Site icon HashtagU Telugu

Bihar Caste Census : బీహార్ లో కులాధార జనగణన.. దేశమంతా కలకలం..

Caste Census In Bihar.. The Whole Country Is In Turmoil

Caste Census In Bihar.. The Whole Country Is In Turmoil

By: డా. ప్రసాదమూర్తి

Bihar Caste Census : బీహార్ ప్రభుత్వం అత్యంత సాహసంగా పేర్కొంటున్న కుల ప్రాతిపదికన జనాభా లెక్కల వివరాలను ఎట్టకేలకు విడుదల చేసింది. ఇది ఆ రాష్ట్రంలో కులాల వారీగా జనాభా శాతం ఎంత ఉన్నదీ తెలియచేస్తుంది. ఇలాంటి లెక్కలు దేశవ్యాప్తంగా జరగాలని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో పట్టుబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా బీహార్ ప్రభుత్వం (Bihar Government) విడుదల చేసిన కులాధార జనాభా లెక్కల వివరాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఈ లెక్కలు చూస్తుంటే దేశ జనాభాలో కొంచెం అటూ ఇటుగా వెనకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలు కలిపి 85% ఉండవచ్చు అని ఒక అంచనాకు రావచ్చు. ఇదే ఇప్పుడు కొన్ని వర్గాలకు ఆందోళన కలిగించేదిగా, కొన్ని వర్గాలకు ఆనందం కలిగించేదిగా మారే అవకాశం ఉంది.

బీహార్ (Bihar) జనాభాలో అత్యంత వెనుకబడిన కులాలవారు (ఈబీసీ) 36%, అలాగే వెనుకబడిన కులాలు (ఓబీసీ) 27% కలిపితే 63 శాతంగా ఉన్నారు. బీహార్లో ముస్లిం జనాభా 14 శాతం పైగా ఉన్నట్టు తేలింది. మొత్తం ఓ బి సి, బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల జనాభా బీహార్ లో 85% గా ఉన్నారు. 15% అగ్రవర్ణాల సంఖ్య ఉంది. వీటిలో పది శాతం పైగా బ్రాహ్మిన్స్, రాజ్ పుట్స్, భూమిహార్ కులాల వారు ఉన్నారు. కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలు తీయడం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవచ్చు అనేది ఒక వాదన ఉంది. అందుకే దీనికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాస్ట్ బేస్డ్ హెడ్ కౌంట్ (Caste Based Head Count ) అని పేరు పెట్టారు. ఇప్పటికే దేశంలో కుల చైతన్యం పెరిగి, వివిధ కులాల వారు తమ జనాభా నిష్పత్తి ఆధారంగా చట్టసభల్లో, ఉద్యోగాల్లో తగిన ప్రాతినిథ్యం డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% ఓబిసి రిజర్వేషన్ వీలు కల్పించింది. దీన్ని సాధించడానికి దశాబ్దాల కాలం పట్టింది. ఇంకా చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం అమలు కావడం లేదు. ఇప్పుడు బీహార్ జనాభా లెక్కల ప్రకారం చూస్తే దేశంలో దాదాపు 60 శాతం పైగా వెనకబడిన జాతులు వారు ఉంటారని అర్థమవుతుంది. బీహార్లో కులాల వారీగా సామాజిక పొందిక ప్రకారం వెనుకబడిన కులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆధిక్యత కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అది కొంచెం తక్కువగా ఉండవచ్చు. కానీ మొత్తం దేశం లో చూసుకుంటే 80 శాతానికి తక్కువ కాకుండా వీరి సంఖ్య ఉంటుందనేది ఈ తాజా లెక్కలు చెబుతున్నాయి.

సాధారణంగానే కులాధారంగా జనాభా లెక్కలు సాగించడం మంచిది కాదని అగ్రకులాల వారు వాదిస్తారు. అగ్రకుల పార్టీలు వెనక నుండి నడిపించే బిజెపి వారు దీన్ని వ్యతిరేకించడం సహజమే. బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ కులాధార జనాభా లెక్కల వివరాలు దేశంలో ఒక తుఫాను వాతావరణం సృష్టిస్తాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి జనాభా లెక్కలు జరగాలని వెనకబడిన వర్గాల నుంచి డిమాండ్ సునామీలా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఎవరి వాటా ఎంత ఉందో ఆ నిష్పత్తిలో చట్టసభల్లోనూ ఉద్యోగాల్లోనూ దేశ సంపదలోనూ వాటా కావాలి అనే డిమాండ్ ఊపందుకుంటుంది. ఇక రానున్న రోజుల్లో ఈ జనాభా లెక్కలను తేల్చే ప్రభుత్వానికి ఆయా వర్గాల ప్రజల మద్దతు ఉంటుంది.

కేవలం జనాభా లెక్కలు తేల్చడం మాత్రమే కాదు. ఆ లెక్కల ఆధారంగా ఆయా వర్గాలకు తగిన ప్రాతినిధ్యం అన్నిచోట్లా దక్కాలన్న డిమాండ్ పెరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ విషయంలో ఎన్నాళ్ల నుంచో తాత్సారం చేస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా బీహార్ జనగణన వివరాలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దేశమంతా ఇలాంటి లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓబీసీల విషయంలో ఉదాసీనంగానే ఉంది. ఓబీసీల ప్రాతినిధ్యానికి సంబంధించి కాంగ్రెస్ వారు గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ స్టాండ్ ని మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఓబీసీల పక్షాన ఇటీవల పార్లమెంట్లో రాహుల్ గాంధీ గట్టిగా వాదించిన సంగతి మనకు తెలిసిందే.

అంతేకాదు ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు వాటా కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఓబీసీల ప్రాతినిధ్యం చట్టసభల్లో కావాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల మొత్తం డిమాండ్ ఇదే అయితే రానున్న ఎన్నికల్లో ఈ అంశం కీలకమైందిగా మారే అవకాశం లేకపోలేదు. మరి బీహార్ రేపిన ఈ కందిరీగల తుట్టె మామూలుది కాదు.

Also Read:  Maldives President : మాల్దీవులు ప్రెసిడెంట్ గా చైనా మద్దతుదారుడు ఎంపిక