Site icon HashtagU Telugu

Lok Sabha without Opposition : ప్రతిపక్షం లేని లోక్ సభ

Lok Sabha And Rajya Sabha

A Lok Sabha Without Opposition

By: డా. ప్రసాదమూర్తి

Lok Sabha without Opposition : ఒక్క ప్రతిపక్ష ఎంపీ కూడా లేని పార్లమెంటులో ఏకచ్ఛత్రాధిపత్య ప్రతాపాన్ని లోకానికి చూపించాలని బిజెపి నాయకులు గట్టిగా కలలు కంటున్నట్టున్నారు. అందుకే లోక్సభలోను (Lok Sabha), రాజ్యసభలోనూ ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అధికార బిజెపి తన అహంకారాన్ని ప్రదర్శించింది. పార్లమెంటులో తాజాగా జరిగిన యువకుల బీభత్సకాండను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు ఈ ఘటనపై ప్రధానమంత్రి, హోంమంత్రి సవివరమైన ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి. కానీ పార్లమెంటు భద్రతనే ప్రమాదంలోకి నెట్టిన వాతావరణాన్ని కళ్లకు కట్టించిన ఘటనపై ఏలిన వారు పార్లమెంటు సాక్షిగా వివరాలను అందించాల్సిన బాధ్యతను మర్చిపోయారు. పైగా అలాంటి డిమాండ్ చేస్తున్న విపక్షాల మీద విరుచుకు పడడం అత్యున్నత ప్రజాస్వామిక దేశంలో అత్యున్నత విషాద ఘటనగా భావించాల్సి వస్తోంది. పార్లమెంటు భద్రత విషయంలో ఏమి లోపాలు జరిగాయి, ఎందుకు ఈ ఘటనకు అవకాశం ఏర్పడింది, దీనికి కారణాలేమిటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి చర్యలు మరిన్ని తీసుకోవాలి మొదలైన అంశాల మీద పార్లమెంటు సాక్షిగా చర్చ జరగాల్సి ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది ప్రజాస్వామికమైన డిమాండ్.

We’re now on WhatsApp. Click to Join.

దేశానికి బాధ్యత వహించేది కేవలం అధికార పార్టీ సభ్యులే కాదు, ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా. అందుకే స్వపక్షమా విపక్షమా అన్న భేదాన్ని పాటించకుండా అటు అధికారంలో ఉన్నవారు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నవారు కలిసి సంఘటితంగా ఇలాంటి కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి, సమాలోచనచేసి, సంపూర్ణమైన అవగాహనతో సమైక్యంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కానీ బిజెపి నాయకులు ఇంత ప్రమాదకరమైన అంశం మీద కూడా విపక్షాల ముందు నోరు విప్పడానికి సుముఖత చూపడం లేదు. ఇది వారి అహంకారానికి ప్రతిపక్షాల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనగా భావించాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దాదాపు 141 మంది పైగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే ఇంచుమించు ప్రతిపక్షాలు లేని పార్లమెంటును సృష్టించడమే. అంటే తమను ప్రశ్నించేవారు లేకుండా, తమను నిరోధించేవారు లేకుండా, తమ ఇష్టానుసారం, అది దేశ హితమైనదైనా అహితమైనదైనా యధేచ్ఛగా తాము నిర్ణయాలు తీసుకోవడానికి అధికార పార్టీ వారు ఆరాటపడుతున్నారా అన్న సందేహానికి ఈ తాజా ఘటనలే ఉదాహరణగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకు వెలుపల ఎక్కడెక్కడో సభల్లో (Lok Sabha) మాట్లాడుతున్నారు కానీ పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశం మీద మాట్లాడడానికి వారు నిరాకరిస్తున్నారు. ఇది ఎక్కడి నిరంకుశత్వమని ఈరోజు ఢిల్లీలో సమావేశమైన ప్రతిపక్షాల ఇండియా కూటమి నాయకులు ముక్తకంఠంతో విమర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాల్లో తాము అఖండ విజయం సాధించామని, ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఎదురులేదని, ప్రతిపక్షాలు లేని పార్లమెంటులో తిరుగులేని అధికారాన్ని చలాయిస్తామని బిజెపి వారు దురాశాపూరిత ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

గత చరిత్ర చూస్తే అసెంబ్లీలో ఎన్నికల ఫలితాలు, పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు అద్దం పట్టవని మనకు తెలుస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల్లో 2003 నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల నేపథ్యాన్ని, చరిత్రను ఒకసారి తడిమి చూస్తే, ఆ రాష్ట్రాల్లో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ, మరొకసారి అధికారం కోల్పోవడం, అసెంబ్లీలో విజయం సాధించిన పార్టీ, పార్లమెంట్లో పరాజయంపాలు కావడం అనేది కనిపిస్తుంది.

Also Read:  CM Revanth Delhi Tour: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ

ఇప్పుడు కూడా ఈ మూడు రాష్ట్రాల్లో ఓటు శాతాన్ని చూస్తే చత్తీస్గడ్,రాజస్థాన్లో బిజెపికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒకటి రెండు శాతం కంటే పెద్ద తేడా లేదు. మధ్యప్రదేశ్లో కొంచెం ఎక్కువ అంతరాయం ఉన్నప్పటికీ మొత్తం తెలంగాణతో కలుపుకొని నాలుగు రాష్ట్రాల ఓటింగ్ శాతం లో కాంగ్రెస్ దే పై చేయిగా కనిపిస్తోంది. ఈ గణాంకాలు చూస్తే, గత చరిత్రను ఒకసారి అవలోకన చేసుకుంటే, అసెంబ్లీ ఎన్నికలలో విజయాలు పార్లమెంటులో పునరావృతం కావడం అనేది సత్యం కాకపోవచ్చు. ఈ విషయాన్ని అధికార బిజెపి నాయకులు, ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది అని రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా, ఏ డిమాండ్లు చేసినా, ఎన్ని ప్రశ్నలు వేసినా, ప్రతిపక్ష విముక్త పార్లమెంటు, ప్రతిపక్ష విముక్త దేశాన్ని బిజెపి వారు కలలు కంటున్నట్టు మనకుఅర్థమవుతుంది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని, ఇక్కడ ప్రజాస్వామ్యం నాలుగు కాళ్లతో నర్తిస్తోందని, 56 ఇంచీల ఢమరుకం మీద దరువులు వేస్తూ, ప్రపంచం ముందు చాటింపు వేసే అధినాయకులకు, ప్రపంచమంతా ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తుందన్న సత్యం బోధపడుతుందో లేదో.

22వ తేదీన పార్లమెంట్లో సస్పెండ్ అయిన ప్రతిపక్షాల సభ్యులకు మద్దతుగా అన్ని రాష్ట్రాలలోనూ ప్రతిపక్షాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి, ఈ ఆందోళన మరికొద్ది నెలల్లో జరగనున్న దేశ సార్వత్రిక ఎన్నికలకు దిశా నిర్దేశం చేసే ప్రజా వెల్లువ కావచ్చు. దీన్ని అధికార పార్టీ అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి.

Also Read:  YSRCP : విజ‌య‌వాడ వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా వ‌ల్ల‌భ‌నేని వంశీ.. గ‌న్న‌వ‌రం బ‌రిలో పార్థ‌సారథి..?