Dwarka Tirumala: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయం ద్వారక తిరుమల.

స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని

స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల (Dwarka Tirumala) అని పేరు వచ్చి నట్టు సమాచారం..సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతి గా ప్రసిద్ధి చెందింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గ్రామము. విజయవాడ నగరానికి 98 కి.మీ. దూరంలోను, రాజమండ్రి నగరానికి 75 కి.మీ. దూరంలోను ఉన్నది. ద్వారకా తిరుమల క్షేత్రం భారతదేశంలో అత్యంత ప్రాచీన క్షేత్రముగా చెప్పబడుతుంది. ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ ద్వారకా తిరుమల గురించి ఒక విషయాన్ని భక్తులు చాలా కాలంగా విశ్వసిస్తున్నారు.

సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల (Dwarka Tirumala) చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు. “పెద్దతిరుపతి” (తిరుమల తిరుపతి) లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును “చిన్నతిరుపతి” లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తుల నమ్మకం.

ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి దేవాలయ విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనిపించే అర్ధ విగ్రహము. ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు.ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం – దారుకము వృత్తిగా కలవారు , దారువులు (చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది. తిరుమలను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా పిలుస్తుంటారు స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు.

“ద్వారకుడు” అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించాలని భావించాడు. దీంతో మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము మరో విశేషము.

ఇక్కడ సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం – స్వయం భూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు. ఈ రెండు విగ్రహాలకు అనుగుణంగా రెండు కళ్యానోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఈ చిన్న తిరుపతిలో నిర్వహిస్తారు గుడి పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాల సమయంలో ఇక్కడ లక్షల మంది ప్రజలు చేరుతారు.

బస్సు మార్గం విజయవాడ – రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్న ద్వారకా తిరుమల క్షేత్రం, జిల్లా ప్రధాన కేంద్రం ఏలురుకు 41 కి. మీ. దూరంలో, భీమడోలుకు 17 కి. మీ. దూరంలో, తాడేపల్లి గూడెం కి 47 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రతి రోజు ఈ క్షేత్రానికి రాష్ట్రం లోని వివిధ ప్రదేశాల నుంచి బస్సులను రాష్ట్ర రవాణా సంస్థ నడుపుతున్నది.

Also Read:  Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే సంకేతాలివీ