Babu Gogineni Vs Chaganti: బాబు గోగినేని Vs చాగంటి Vs ప్రేమ

ఖుషి సినిమా రిలీజ్ రోజునే మా అమ్మాయి చూసింది. రాగానే అడిగాను, సినిమా ఎలా ఉంది అని బాబు గోగినేని అంకుల్, చాగంటి కోటేశ్వరరావు కొట్టుకుంటారు అంతే అంది. అవునా మరి ఎవరు గెలిచారు అని అడిగాను. ఎవరూ గెలవలేదు. అందరికందరూ రాజీ పడిపోయారు అని ఊరుకుంది.

  • Written By:
  • Updated On - September 10, 2023 / 03:51 PM IST

By: డా.ప్రసాదమూర్తి

Babu Gogineni Vs Chaganti: ఖుషి సినిమా రిలీజ్ రోజునే మా అమ్మాయి చూసింది. రాగానే అడిగాను, సినిమా ఎలా ఉంది అని బాబు గోగినేని అంకుల్, చాగంటి కోటేశ్వరరావు కొట్టుకుంటారు అంతే అంది. అవునా మరి ఎవరు గెలిచారు అని అడిగాను. ఎవరూ గెలవలేదు. అందరికందరూ రాజీ పడిపోయారు అని ఊరుకుంది. నేను మాత్రం ఊరుకోలేకపోయాను. వెరీ ఇంట్రెస్టింగ్. రెండు భిన్న ధ్రువాలు రాజీ ఎలా పడ్డాయి? రాజీపడడానికి అంత బలమైన కారణం ఏంటి? వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడని ఈ విభిన్న భావజాలాల మధ్య రాజీ కుదిర్చింది ఏమిటబ్బా అని తర్వాత సినిమా చూశాను. ఏమైనా రాయాలి అనుకున్నాను కానీ మర్చిపోయాను. నిన్న బాబు గోగినేని గారి ఇంటర్వ్యూ చూశాను. ఆయన పర్స్పెక్టివ్ లో ఈ సినిమా గురించి తన అభిప్రాయం చెప్పారు. ఏమైనా రాయాలనిపించింది. ఇలా ఇప్పటికి కుదిరింది.

సినిమా ఓవరాల్ గా నాకు నచ్చింది. ఒక చెత్త టాపిక్ మీద గొప్పగా సినిమా తీసే వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. కానీ ఒక గొప్ప టాపిక్ తీసుకొని సినిమాని గొప్పగా నిర్మించేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అంత గొప్ప కంటెంట్ ని తీసుకొని ఇంత చెడగొట్టాడేందబ్బా అని నిరుత్సాహంగానే చాలాసార్లు థియేటర్ల నుండి తిరిగి వచ్చిన అనుభవం ఎంతో ఉంది. కానీ ఖుషి సినిమా తీసిన శివ నిర్వాణ పెద్దగా నిరుత్సాహపరచలేదు. అలాగని గొప్పగా ఉత్సాహపరచనూ లేదు. పర్వాలేదు మంచి ఎఫెర్ట్ పెట్టాడు. ఒక కమర్షియల్ సినిమాలో తనకున్న అవకాశాల పరిధిలో తాను చెప్పదలుచుకున్న సబ్జెక్టుకి కొద్దో గొప్పో న్యాయం చేశాడనిపించింది. అందుకే సినిమా నాకు నచ్చిందని చెప్పాను.

సినిమా ఆస్తికత్వానికి, నాస్తికత్వానికి మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణకు పిల్లలు, వారి మధ్య ప్రేమలు బలి కాకూడదని, వారికోసం సిద్ధాంతాలు ఒక మెట్టు దిగి రావాలని, పెద్దలు సర్దుకుపోవాలని సందేశం ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో రెండు సిద్ధాంతాలలో నాస్తికత్వానికి ప్రతినిధిగా లెనిన్ సత్యం క్యారెక్టర్ ఉంటుంది. ఆస్తికత్వానికి ప్రతినిధిగా చదరంగం శ్రీనివాసరావు క్యారెక్టర్ ఉంటుంది. లెనిన్ సత్యం పాత్రను సచిన్ ఖేడేకర్, చదరంగం శ్రీనివాసరావు పాత్రను మురళీ శర్మ, హీరో విప్లవ్ రోల్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ ఆరాధ్య రోల్ సమంత పోషిస్తారు. ప్రేమించుకునేటప్పుడు కులం మతం ప్రాంతం దేశం నమ్మకాలు పెద్దగా పట్టింపులోకి రావు. కానీ ప్రేమికుల తల్లిదండ్రులకు మాత్రం అవి చాలా ముఖ్యమై కూర్చుంటాయి. అలా ముఖ్యమైపోయిన నమ్మకాలు, పంతాలు, పట్టింపులు పరువు హత్యల దాకా కూడా దారితీస్తాయి. ఇక్కడ కూడా ఆరాధ్య సనాతన దైవ నమ్మకాలతో ఉన్న కుటుంబానికి, విప్లవ్ నాస్తిక భావాలు కలిగిన కుటుంబానికి చెందినవారు. ఇద్దరి మధ్యలో లవ్ కెమిస్ట్రీ బాగానే కుదిరింది కానీ, ఇరు కుటుంబాల భావాల ఫిజిక్స్ ఇద్దరి మధ్యా ఆర్డిఎక్స్ లా బద్దలైంది. అదే వారి వైవాహిక జీవితంలో కల్లోలం సృష్టించింది.

పెళ్లికి ఒప్పుకోని చదరంగం శ్రీనివాసరావు ఇద్దరి జాతకాల మధ్య ఏదో దోషం ఉందని యాగం చేస్తే తప్ప ఆ దోషం పరిష్కారం కాదని అంటాడు. లైట్ తీసుకుంది కూతురు ఆరాధ్య. విప్లవ్ తో జీవన సాహచర్యానికి విప్లవాత్మక నిర్ణయమే తీసుకుంటుంది. కానీ పుట్టి పెరిగిన వాతావరణం మనసులో గూడు కట్టించిన నమ్మకాలు అంత తేలిగ్గా ఎలా కరిగిపోతాయి? సంతానం లేమికి యాగం చేయకపోవడమే అని ఆమె గట్టిగా నమ్ముతుంది. నాస్తిక భావాల నేపథ్యం నుంచి వచ్చిన విప్లవ్ ససేమిరా అంటాడు. అతని తండ్రి లెనిన్ సత్యం సరే సరి. అలా ఇద్దరూ విడిపోతారు గాని ఆరాధ్య లేని జీవితం విప్లవ్ కి అమావాస్యలా అయిపోతుంది. యాగానికి భార్య సంతృప్తి కోసం సిద్ధపడతాడు గాని తండ్రిని ఒప్పించడం ఎలా? తండ్రి లెనిన్ సత్యం కూడా చివరకు కరిగి యజ్ఞానికి ఒప్పుకుంటాడు. యాగానికి రంగం సిద్ధం అవుతుంది. అక్కడే ఒక ట్విస్ట్. అది సినిమా మొత్తానికి అతి కీలకమైన ట్విస్ట్. యజ్ఞం పూర్తి కావలసిన తరుణంలో వర్షం వచ్చి ఆగిపోతుంది. ఈ యాగం పూర్తి కాదు కానీ చదరంగం శ్రీనివాసరావు గారి మనసులో ఒక నిజమైన మనిషి ఆవిర్భవించే యాగం మాత్రం పూర్తవుతుంది. పెద్దవాళ్లు తమ తమ సిద్ధాంతాలు నమ్మకాలు పట్టుకొని ఎటు చీలిపోయినా.. మనుషులుగాఎక్కడో ఓడిపోతున్నారని ఆయన ఆకస్మిక స్పృహలోకి వచ్చి అందరూ హాయిగా కలిసిపోవడానికి కారణమవుతాడు. విప్లవ్, ఆరాధ్యలకు బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డకి చెవులు కుట్టిస్తూ బిడ్డ పేరు ఖుషి అని చెప్పి సినిమాని ఖుషీగా ఎండ్ చేస్తాడు డైరెక్టర్.

Also Read: G20 Sammit: ముగిసిన జీ20 సదస్సు.. ప్రధానిపై రాజ్ నాథ్ ప్రశంసలు

అంతా బాగానే ఉంది. చాలా భారీ సబ్జెక్టు. దీనిని డీల్ చేయడానికి ఎంతో కసరత్తు చేయాలి. పక్కా స్క్రీన్ ప్లే రాసుకోవాలి. యుగాలుగా వస్తున్న రెండు భావజాలాల మధ్య భీకర పోరాటాన్ని తెరకెక్కించాలన్నది డైరెక్టర్ మెయిన్ మోటో కాకపోవచ్చు. ఇద్దరు యువతీ యువకుల ప్రేమ మధ్యలో ఆ యుద్ధం మరే యుద్ధమూ సృష్టించకూడదని చెప్పటమే డైరెక్టర్ ముఖ్య ఉద్దేశం కావచ్చు. కథ, సంభాషణలు కూడా డైరెక్టరే అందించాడు. ఆయన ఉద్దేశం ఏదైనా నాలాంటి వారికి, చివరికి ఈ డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు అనేదే మెయిన్ ఫోకస్ పాయింట్ అవుతుంది. వైజ్ఞానిక ఆలోచనల ఆధారంగా కొనసాగే హేతువాదం గెలిచిందనా? లేక సనాతన ధర్మపరాయణత, దైవత్వం ఆధారంగా కొనసాగే ఆస్తికవాదం గెలిచిందనా? ఏదో ఒక వైపు నిలబడకుండా గోడమీద పిల్లిలా ఉండడానికి అవకాశం లేదు. అదే నేను కీన్ గా అబ్జర్వ్ చేశాను. యాగం చేస్తే తప్ప దోషం తొలగదని, దోషం పోతే తప్ప ఆరాధ్యకి విప్లవ్ కి బిడ్డ పుట్టదని భీష్మించుకు కూర్చున్న చదరంగం శ్రీనివాసరావులో యాగం శాస్త్రోక్తంగా పరిపూర్ణం కాకముందే మనిషి మేల్కొన్నాడు.

యాగం కడవరకు సాగింది గాని అది పూర్తి కాలేదు. వర్షం వచ్చి ఆగిపోతుంది. అందరం మనుషులుగా బతికేద్దామని అందరూ సింపుల్ గా అనేసుకున్నారు. యాగం సంగతి మర్చిపోయారు. బిడ్డ పుట్టింది. అంటే డైరెక్టర్ బిడ్డ ముందు పుట్టక పోవడానికి, తర్వాత పుట్టడానికి కారణం యాగం కాదని చెప్పకనే చెప్పాడు. ప్రకృతి ధర్మం తన పని తాను చేసుకుపోతుంది. శాస్త్ర ధర్మం దానికి అడ్డు చెప్పలేదు, దానికి ఏ మార్పూ చేయలేదు అని డైరెక్టర్ చివరికి తెలివిగా సినిమాని ముగించాడు. అందుకే నాకు డైరెక్టర్ శివ నిర్వాణ పట్ల అభిమానమే కలిగింది. అయితే ఈ సినిమాని ఇంకొంత శ్రమించి ఉంటే మరో లెవల్ కి తీసుకువెళ్లి ఉండేవాడు. ఉదాహరణకి విప్లవ్ ఆరాధ్యల మధ్య ప్రేమ పుట్టడానికి నేపథ్యంగా ఎంచుకున్న కాశ్మీర్ సీన్లు బాగున్నాయి. కాని ఆ డ్రామా చాలా కృతకంగా అనిపించింది. హీరోయిన్ ఒక ముస్లిం అమ్మాయి అని, ఆమె ఫిరోజ్ అనే పిల్లవాడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ వచ్చిందని, హీరోయిన్ ని పడేయడానికి ఆ పిల్లవాడిని వెదికే పనిలో హీరో పడిపోయాడని చాలాసేపు నడిపించిన డ్రామా బోర్ కొట్టించింది. ఇలాంటి ప్రేమ కథా చిత్రాలు పది కాలాలు నిలవాలంటే హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్లు, స్వీట్ నథింగ్సూ, అత్యంత తాజాగా, వినూత్నంగా, వీలైనంత ఎక్కువగా పండించాలి. ఇక్కడ ఎక్కడో స్క్రిప్ట్ బలహీన పడింది. ఫస్ట్ హాఫ్ అంతా ఇది ఇంకా పక్కాగా నడిచి ఉండాలి. అలాగే ఇద్దరి మధ్య భావజాల ఘర్షణ ఇంకొంత బలంగా ఉండాల్సింది. పాటలు, సంగీతం బావుండడంతో ఇవి కొంత కవరయ్యాయి గాని సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి అవి మాత్రమే సరిపోవు కదా. అయితే విజయ్ దేవరకొండ సమంతల జంట, సినిమాకి ఒక రంగుల పంటే అని చెప్పాలి.

పోతే రెండు భావాల ప్రతినిధుల పాత్రలకు ఆధారంగా బాబూ గోగినేనిని, చాగంటి కోటేశ్వరరావుని చూపిస్తూ మాట్లాడుతున్నారు. నిజ జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి వీరికి ఎదురైతే ఈ సినిమాలో డైరెక్టర్ చూపించినట్టే వీరిద్దరూ ప్రవర్తిస్తారా అంటే అది జరిగే పని కాదని నేను చెప్తాను. సినిమాలో ఒక సందేశం ఇవ్వడానికి కథను ఏ విధంగానైనా మలుపు తిప్పవచ్చు. ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఏ మసాలాలైనా కలపవచ్చు. వాస్తవానికి వచ్చేసరికి అలా కుదిరే పని కాదు. బాబు గోగినేని నాకు మంచి స్నేహితుడు. గొప్ప మానవవాది. లెనిన్ సత్యం అనే పాత్రకు కొంత ఆధారంగా ఆయనను తీసుకున్నారేమో గాని ఆయనే లెనిన్ సత్యం కాదు. కొడుకు కోసం ఏ త్యాగమైనా ఆయన చేయవచ్చు గాని యజ్ఞం మాత్రం చేయడు. అలాగే ఆ క్యారెక్టర్ ని నిర్మించడంలో డైరెక్టర్ అంత సీరియస్ నెస్ చూపించలేదు. చాగంటి వారి పాత్ర అని చెబుతున్న చదరంగం శ్రీనివాసరావు, సినిమాలో తాను మనిషి అని ఆకస్మిక స్పృహను పొందినట్టు, శాస్త్రాలు, ధర్మాలు పంతాలు పట్టింపులు అంటూ మనుషులుగా తాము ఎక్కడో ఓడిపోతున్నామని అనడం వాస్తవంలో జరిగేది కాదు. చాగంటి వారి ప్రవచన ప్రస్థానం ఎరిగిన వారికి ఇది తెలుస్తుంది. ఆ మాటలు లెనిన్ సత్యం పాత్రతో మరోరకంగా చెప్పించి ఉంటే బాగుండేది. ఇలా ఏవేవో రకరకాల మార్పులూ చేర్పులూ నా మనసుకు తోచాయి గాని అవి ఇప్పుడు అనవసరం.

ఇందులో చివరిగా నేను చెప్పే విషయం ఒకటి ఉంది. పిల్లల ప్రేమ విషయంలో పెద్దల పంతాలు పట్టింపులు అడ్డుపడకూడదని ఉదాత్తమైన సందేశమే ఇందులో ఉంది. అసలు విషయం ఏమిటంటే ఈ విరుద్ధ భావజాలాల మధ్య ఘర్షణ కేవలం ఆ పెద్దలతో ఆగిపోదు. పెళ్లి చేసుకున్న పిల్లల మధ్య కూడా కొనసాగుతుంది సరే. అది అంతటితో ఆగిపోదు. వారిద్దరికీ పుట్టిన పిల్లలలో కూడా కొనసాగుతుంది. మరి అప్పుడు వీరేం చేస్తారు? ఆరాధ్యకి విప్లవ్ కి పుట్టిన బిడ్డ ఏ భావజాలానికి ప్రతినిధిగా పెరుగుతుంది? అసలు సినిమా అక్కడే మొదలవుతుంది., అందుకే ఈ సినిమా ఎండింగ్ ఈజ్ ద బిగినింగ్ అనిపించింది. ఏది ఏమైనా చివరికి ప్రేమే గెలుస్తుందని, ప్రేమ మధ్య మరి ఏ రకమైన గోడలు ఎవరు కట్టినా, అవి కుప్పకూలిపోవాల్సిందేనని చెప్పినందుకు డైరెక్టర్ ని అభినందించకుండా ఉండలేను.