TDP Janasena Alliance : వార్ వ‌న్ సైడ్‌..పొత్తు తూచ్‌!

ఏపీలో ఎన్నిక‌లకు ఇంకా రెండేళ్ల టైం ఉన్న‌ప్ప‌టికీ పొత్తుల పేరుతో పార్టీల‌ను లైవ్ లో ఉంచుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 02:06 PM IST

ఏపీలో ఎన్నిక‌లకు ఇంకా రెండేళ్ల టైం ఉన్న‌ప్ప‌టికీ పొత్తుల పేరుతో పార్టీల‌ను లైవ్ లో ఉంచుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. `ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు` అనే ఒకే ఒక అంశాన్ని తీసుకుని ప్ర‌ధాన పార్టీల‌తో జ‌న‌సేన వేసిన ట్రాప్ లో టీడీపీ వైసీపీ ప‌డిపోయాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు జ‌న‌సేన‌కు క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. రెండు ప్ర‌ధాన పార్టీలు గుర్తింపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద గుర్తుంపు కూడా లేని జ‌న‌సేన గురించి ప‌దేప‌దే మాట్లాడే స్థాయికి ప‌డిపోయాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్ విసిరిన రాజ‌కీయ వ‌ల‌లో చిక్కుకుని గిల‌గిల కొట్టుకుంటున్నాయి. రాష్ట్రాభివృద్ధి, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కంటే జ‌న‌సేన‌తో పొత్తు గురించే మాట్లాడుకోవ‌డం విడ్డూరం.

ప్ర‌జా వ్య‌తిరేక ఓటు చీలిపోవ‌డం కార‌ణంగా 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రాలేద‌ని ఆ పార్టీ భావ‌న‌. ఇదే సూత్రాన్ని 2019 ఎన్నిక‌ల‌కు వ‌ర్తింప చేస్తే చంద్ర‌బాబు తిరిగి అధికారంలోకి రావాలి. స‌రిగ్గా ఇక్క‌డే లాజిక్ ను టీడీపీ మేధావులు గ‌మ‌నించాలి. ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్ప‌టి నుంచి విడిపోయిన ఏపీకి జ‌రిగిన 2014, 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు తీసుకుంటే, ఎప్పుడూ వార్ ఒన్ సైడ్ మాత్ర‌మే ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ టీడీపీని 1982లో పెట్టిన‌ప్ప‌టి నుంచి తీసుకుంటే 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఇలా ఏ ఎన్నిక తీసుకున్న‌ప్ప‌టికీ రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాత్ర‌మే అధికార బ‌ద‌లాయింపు ఉంది. పొత్తులు కేవ‌లం నామ‌మాత్ర‌పు ప్ర‌భావాన్ని మాత్ర‌మే చూపాయ‌ని ఆ ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌కు వ‌చ్చిన ఓట్లు, సీట్ల‌ను గ‌మ‌నిస్తే అర్థం అవుతోంది. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణంగా చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ అంటూ కొంద‌రు లెక్కిస్తున్నారు. కానీ, ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న కార‌ణంగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఓట‌ర్లు మ‌ళ్లార‌నే విష‌యాన్ని విస్మ‌రిస్తున్నారు. విభ‌జ‌న వాదాన్ని వినిపించిన టీడీపీ అనుకూల ఓట‌ర్లు కూడా ప్ర‌జారాజ్యం పార్టీకి వెళ్లార‌ని సునిశితంగా ప‌రిశీంచిన వాళ్లు ఎవ‌రైనా చెబుతారు. అందుకే, ఆ పార్టీకి ఏపీలో 2009 ఎన్నిక‌ల్లో త‌క్కువ సీట్లు, తెలంగాణ‌లో ఎక్కువ సీట్లు రావ‌డం జ‌రిగింది.

1999, 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ స‌క్సెస్ అయింది. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ దేశ స్థాయి రాజ‌కీయాల ప్ర‌భావం ప‌డింది. వాజ్ పేయ్ క్రేజ్ 1999లోనూ 2014లో మోడీ హ‌వా దేశ వ్యాప్తంగా ప‌నిచేశాయి. ఫ‌లితంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఊహించిన వాటి కంటే ఎక్కువ‌గా ఎమ్మెల్యేల‌ను గెలుచుకోగ‌లిగింది. ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ ఆనాడు బ‌ల‌మైన క‌మ్యూనిస్ట్ పార్టీల‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు కోసం పొత్తు పెట్టుకుని ఎప్పుడూ స‌క్సెస్ అయిన ఆన‌వాళ్లు పెద్ద‌గా లేవు. కేవ‌లం ఆయా ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెర‌పైకి వ‌చ్చిన అంశాల వారీగా మాత్ర‌మే అధికారం చేజిక్కించుకున్న దాఖ‌లాలు ఉన్నాయి. 2009 ఎన్నిక‌ల బూచిన చూపిస్తూ జ‌న‌సేన లేకుండా టీడీపీ 2024 ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేద‌నే అంచ‌నా బ‌హుశా రాజ‌కీయ మైండ్ గేమ్ లో భాగంగా చూడాల్సి ఉంటుంది. పైగా ఒక ప్రాంతీయ పార్టీ మరొక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏమ‌వుతుందో 2009 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, టీడీపీ పొత్తు ఒక పాఠాన్ని నేర్పింది. ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తో పొత్తు కార‌ణంగా టీడీపీ క్యాడ‌ర్ జారిపోయింది. ఫ‌లితంగా తెలంగాణలో టీడీపీ ప్ర‌శ్నార్థ‌కంగా మిగిలింది.

2009 పొత్తు సూత్రాన్ని అన్వ‌యించుకుంటే, ఒక వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే జ‌రిగే న‌ష్టం టీడీపీకే ఎక్కువ‌. డెడ్ స్టేజ్ లోనూ 40శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ ఎంత ఓటు బ్యాంకు ఉందో కూడా తెలియ‌ని జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌ని టీడీపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. నిజంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఉంటే ప్ర‌త్యామ్నాయ పార్టీ వైపు ఓట‌ర్లు చూస్తారు. వార్ ఒన్ సైడ్ ఉంటుంది. ఏపీ ఎన్నిక‌ల చ‌రిత్ర‌ను తిర‌గ‌తోడితే అదే చెబుతోంది. ఒక వేళ ప‌వ‌న్ మ‌ద్ధ‌తుతో 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలించింద‌ని భావిస్తే, అదే ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో చీల్చిన ఓటు బ్యాంకుతో తిరిగి చంద్ర‌బాబు సీఎం కావాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు క‌నుక ప‌వ‌న్ తో పొత్తు న‌ష్ట‌మా? లాభ‌మా? అనే కోణం నుంచి సీరియ‌స్ గా ఆలోచిస్తోన్న టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని భావిస్తోందట‌.

నెల‌కో, రెండు నెల‌ల‌కోసారి మీడియా ముందు పొత్తు గురించి మాట్లాడే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఫ‌లితంగా జ‌న‌సేన‌కు మీడియా క్రేజ్ తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా మూడు నెల‌ల క్రితం ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోనివ్వ‌న‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అందుకోసం బీజేపీ రోడ్ మ్యాప్ గురించి చూస్తున్నానంటూ వెల్లిడించారు. దీంతో ఆ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందోన‌ని ప్ర‌ధాన పార్టీలు చూశాయి. సీన్ కట్ చేస్తే, మూడు ఆప్ష‌న్లను ఇస్తూ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్ ఎంచుకున్నారు. వాటిలో ఒక‌టి జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు. రెండోది జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ క‌లిసి 2024 ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం. ఇక మూడోది జ‌న‌సేన ఒంటరిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం.

ఒక‌టో ఆప్ష‌న్ ఎంచుకుంటే వ‌చ్చే ఫ‌లితాలు ఎలా ఉంటాయో తిరుప‌తి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌ను చూసి అంచ‌నా వేసుకోవ‌చ్చు. రెండో ఆప్ష‌న్ కు బ‌హుశా చంద్ర‌బాబు అంగీక‌రించక పోవ‌చ్చు. మూడో ఆప్ష‌న్ ను ప‌వ‌న్ ఎంచుకుంటే 2019లో కూట‌మికి వ‌చ్చిన ఓట్లు కూడా జ‌న‌సేన‌కు వ‌స్తాయా? రావా? అనే లెక్క‌లు ముందుగా వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే పొత్తుల ప్ర‌స్తావ‌న అంటూ బాబు దాట‌వేస్తున్నారు. జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే మాత్రం టీడీపీకి తెలంగాణ‌లో జ‌రిగిన న‌ష్టం ఏపీలో పొంచి ఉంటుంద‌న్న విష‌యాన్ని సీరియ‌స్ గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సీనియ‌ర్లు బాబుకు సూచిస్తున్నార‌ట‌. ఇలాంటి పరిస్థితుల్లో చంద్ర‌బాబు ఎలాంటి స్కెచ్ వేస్తారో చూడాలి.