Amaravati: అమరావతికి సుప్రీం ముహూర్తం! అసెంబ్లీలో ‘మూడు’ లేనట్టే!

అమరావతి రాజధాని భవిష్యత్ వచ్చే నెల తేలనుంది. ఆ మేరకు సుప్రీంకోర్టు 28వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసింది.

అమరావతి (Amaravati) రాజధాని భవిష్యత్ వచ్చే నెల తేలనుంది. ఆ మేరకు సుప్రీంకోర్టు 28వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేసింది. ఏపీ రాజధాని కేసు ఆ రోజు విచారణకు రానుంది. కేసును త్వరగా విచారించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది మెన్షన్‌ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ తేదీని ప్రకటించింది. గతేడాది నవంబర్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కాల పరిమితితో రాజధాని పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అమరావతే రాష్ట్ర రాజధాని అని ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి కూడా విదితమే. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు విచారణ తేదీని ఖరారు చేస్తూ సోమవారం కీలక ప్రకటన చేసింది. మార్చి 28న ఈ కేసును విచారిస్తామని తెలిపింది.

సుప్రీంకోర్టు లో అమరావతి (Amaravati) రాజధాని కేసు విచారణ జరగనుంది. రాజధాని కేసుతో పాటే రాష్ట్ర విభజనకు సంబంధించి దాఖలైన 35 కేసుల అన్నింటిపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధిల్లో పని చేయాలి. శాసన, పాలనా వ్యవస్థ అధికారంలోకి న్యాయవ్యవస్థ చొరబడడం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక, జిఎస్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదని పిటిషన్ లో తెలిపింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్యా రాజధానిని అమరావతిని కేంద్రికృతం చేయకుండా..వికేంద్రీకరణ చేయాలని నివేదికలు చెబుతున్నాయని పేర్కొంది. తమ రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ఒకే రాజధాని ఉండాలని, ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెబుతున్నారని పిటీషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

అమరావతినే (Amaravati) రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణ జరిగింది. మొదట పాదయాత్రకు కొన్ని నిబంధనలు విధించింది. ఆ తరువాత పోలీసుల తీరుపై, నిబంధనలపై హైకోర్టులో పిటీషన్ వేశారు రైతులు. దానిపై విచారించిన హైకోర్టు రాజధాని నిర్ణయం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. దీనితో ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఏపీ రాజధాని అమరావతి కేసును మెన్షన్ లిస్టులో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాసిన లేఖపై ఫలితం కనిపించలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్ 23న కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. రాజధాని అంశంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలయింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు.

2014లో ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారు. అయితే జగన్ సీఎం అయినా తర్వాత మూడు రాజధానుల అంశం తెరమీదికి తీసుకొచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా , కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖపట్టణాన్ని పాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని విపక్షాలు కోరుతున్నాయి. మరోపక్క అమరావతి రైతులు సైతం ఆందోళనలు నిర్వహించారు. పాదయాత్రలు, ధర్నాలు , ఆందోళనలు చేసారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ, పలు పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. రాజధానిపై చట్టం చేసే అధికారం శాసభసభకు లేదని 2022 మార్చి మాసంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జగన్మోహనరెడ్డి సర్కార్ వేసిన పిటిషన్ తో పాటు రాజధాని అంశం పై ఉన్న అన్నిటిపై ఒకే సారి విచారణ చేయడానికి సుప్రీం సిద్దమైంది. వచ్చే నెల 28న విచారణకు ఆదేశించింది. అయితే 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. వాటిలో రాజధాని అంశం మరోసారి చర్చకు రానుందని ప్రభుత్వ వర్గాల్లోని టాక్. ప్రస్తుతం ఈ ఇష్యూ కోర్టులో ఉంది కనుక బడ్జెట్ ప్రసంగంలో పెట్టె సాహసం ఈ సారి ప్రభుత్వం చేయదని వినికిడి. ఎందుకంటే , గవర్నర్ గా మాజీ సుప్రీం జస్టిస్ ఉన్నారు. సుప్రీం పరిధిలో ఉన్న మూడు రాజదానుల అంశాన్ని ఒక వేళ ప్రసంగంలో పొందు పరిచినప్పటికి గవర్నర్ స్కిప్ చేసే అవకాశం ఉంది . అందుకే రాజదాని ప్రస్తావన లేకుండా అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది.

Also Read:  Tigers Death Toll: ‘పులుల’ మరణమృదంగం, 2 నెలల్లో 30 మృతి