అప్పుడు-ఇప్పుడు.. అసైన్డ్ భూమూల్లో అక్రమ మైనింగ్ కామన్!

అక్రమ మైనింగ్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ పై కన్నెస్తున్నారు. అడవులు,అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది.

  • Written By:
  • Publish Date - October 24, 2021 / 09:20 AM IST

అక్రమ మైనింగ్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ పై కన్నెస్తున్నారు. అడవులు,అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది. గత టీడీపీ హాయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరిగింది. అటవీ సంపద దోపీడిపై గత ప్రభుత్వ హాయంలో మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించినప్పటికి ఫలితంలేకపోవడంతో… అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హత్య చేశారు.ఆ తరువాత కొన్ని రోజులు మన్యంలో అక్రమ మైనింగ్ తగ్గినప్పటికీ మళ్లీ యధామాములుగానే
కొనసాగుతుంది.

ఏపీలో నాడు చంద్రబాబు హాయంలో జరిగిన అక్రమ మైనింగ్ నేడు వైఎస్ జగన్ సర్కార్లో కూడా జరుగుతుంది. దళితుల అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పడాల కుమారి అనే దళిత మహిళకు ఎకరా 35 సెంట్లు భూమి ఉంది. ఈ భూమి తన తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా ఆమెకు దక్కింది. అయితే ఈ భూమిని కౌలుకు ఇచ్చిన వ్యక్తితో మైనింగ్ కాంట్రాక్టర్లు ఒప్పుదం చేసుకుని తన భూమిని తవ్వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి ద్వారా తనకు ఏడాదికి రూ.40 నుంచి 50వేల వరకు ఆదాయం వస్తుందిని…మైనింగ్‌ని చాలా సార్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమపైనే దాడికి పాల్పడ్డారని పడాల కుమారి ఆరోపించారు.నాడు తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో ఆ పార్టీ నాయకులు అక్రమంగా మైనింగ్ చేశారని..నేడు వైసీపీ నాయకులు తన భూమిని తవ్వేసుకుంటున్నారన్నారు. ఇదే విషయాన్ని నేరుగా జిల్లా ఎస్పీని,ఆర్డీవోని కలిసి ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని వాపోయారు.

ఈ భూముల్లో మైనింగ్ తవ్వకాలు ఎనిమిదేళ్ల క్రితం టీడీపీ హాయాంలో మొదలైయ్యాయి. అప్పట్లో దీనిని వైసీపీ అక్రమ మైనింగ్ అంటూ తప్పుపట్టింది. సీపీఎంతో సహా ఇతర ప్రజాసంఘాలు ఆందోళనలు సైతం చేశాయి.దీంతో నాడు అక్రమ తవ్వకాలపై అధికారులు కొరఢా ఝులిపించారు.అయినప్పటికి మైనింగ్ కొనసాగుతూనే ఉంది.తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న రామేశంపేట, ఆనూరు, వాలు తిమ్మాపురం, సూరంపాలెం గ్రామాల పరిధిలో సహాజసిద్దంగా ఉన్న మెట్ట ప్రాంతాలు ఇప్పుడు సగానికిపైగా మాయమైయ్యాయి. ఇంధిరాగాంధీ హాయాంలో ఆ మెట్ట ప్రాంతాల్లో సాగు చేసుకునేందుకు సమీప గ్రామాల్లో దళితులకు, ఆదివాసీలకు చెందిన 800 కుటుంబాలకు పట్టాలిచ్చారు. ఎకరా 35 సెంట్లు చొప్పున అసైన్డ్ భూములు వారికి అప్పగించారు. అప్పటి నుంచి మెట్ట భూములను సాగులోకి తెచ్చి జీడి, మామిడి తోటలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఏడేళ్ల క్రితం 100 ఎకరాల్లో మెస్సర్స్ శ్రీ సత్యా మైనింగ్ అండ్ మల్టి పర్పస్ వూక్ సొసైటీ లిమిటెడ్ అనే సంస్థ తరుపున మైనింగ్కి అనుమతి కోరారు. అటవీ, భూగర్భ గనులు, పర్యావరణ, రెవెన్యూ శాఖల పరిశీలన తర్వాత 64.075 ఎకరాలలో గ్రావెల్ తవ్వకాలకు అధికారిక అనుమతులు వచ్చాయి. కానీ 2015 నుంచి ఇప్పటి వరకూ జరిపిన తవ్వకాలు పరిశీలిస్తే దాదాపుగా 300 ఎకరాల పైబడి తవ్వేసినట్టు కనిపిస్తోంది. అంటే అనుమతులున్న దానికి ఐదారు రెట్లు మెట్టను తవ్వేసినట్టు చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ కంపెనీ ఇక్కడ తవ్వకాలు జరపట్లేదు.

దళితులకు జీవనోపాధి కోసం ఇచ్చిన అసైన్డ్ భూములవి. అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 9/77 ప్రకారం వాటిని అమ్మడం, కొనడం చట్టవిరుద్ధం. కానీ జిఒ 2/2013ను చూపించి లీజు పేరుతో తవ్వకాలకు అనుమతిచ్చారు. ఎస్సీలకు చెందిన అసైన్డ్ ల్యాండ్స్ ను కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దీనిపై కొందరు కోర్టుకి కూడా వెళ్లారు. సాగుదారుల అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం పట్ల ఇన్జన్క్షన్ ఆర్డర్ కూడా ఉంది. అయినా గ్రావెల్ తరలింపు ఆపలేదు. గ్రావెల్ పేరుతో 50 అడుగుల ఎత్తులో ఉండే కొండలను తవ్వేశారు. భూమిలో కూడా మరో పది అడుగుల లోతు వరకూ తవ్వకాలు జరిపి చెరువుల్లా మార్చేశారు. కొండల స్థానంలో ఇప్పుడు చెరువులు కనిపిస్తున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారని రామేశంపేట కు చెందిన దళితులు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో విచ్చల విడిగా అక్రమమైనింగ్ జరుగుతున్న అధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు . ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి దళితుల అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్కి అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని వారు కొరుతున్నారు.

Follow us