AP Cabinet Ministers : వాళ్ల‌కు క్యాబినెట్ హోదా హుళ‌క్కే.!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతోన్న జిల్లా బోర్డుల చైర్మ‌న్ల‌కు క్యాబినెట్ హోదా అసాధ్యంగా క‌నిపిస్తోంది. ఆయ‌న ఇటీవ‌ల జిల్లా, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల స‌మావేశంలో 2024 దిశానిర్దేశం చేస్తూ మంత్రి ప‌ద‌వులు పోయిన వాళ్ల‌కు ఆ హోదా క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 01:09 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతోన్న జిల్లా బోర్డుల చైర్మ‌న్ల‌కు క్యాబినెట్ హోదా అసాధ్యంగా క‌నిపిస్తోంది. ఆయ‌న ఇటీవ‌ల జిల్లా, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల స‌మావేశంలో 2024 దిశానిర్దేశం చేస్తూ మంత్రి ప‌ద‌వులు పోయిన వాళ్ల‌కు ఆ హోదా క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. ప్రొటోకాల్ ప్ర‌కారం మంత్రివ‌ర్గంలోని మంత్రుల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా హోదా క‌ల్పిస్తాన‌ని ప్రామిస్ చేశారు. దీంతో సంతోష ప‌డ్డ వాళ్ల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ 2014లో ఏర్పాటు చేసిన పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శుల ప‌ద‌వుల విష‌యంలో ఏం జ‌రిగిందో గుర్తుకు వ‌స్తుంది.

వైసీపీ జిల్లా అధ్య‌క్షుల‌కు జిల్లా బోర్డు చైర్మ‌న్ల ప‌ద‌వులను ఇవ్వ‌డానికి జ‌గ‌న్ క‌స‌రత్తు చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ల‌కు మంత్రి హోదా క‌ల్పించ‌డంతో పాటు జిల్లా ఇంచార్జి మంత్రులు, మంత్రుల కంటే వాళ్లే ప‌వ‌ర్ ఫుల్ అంటూ చెబుతున్నారు. ఆ మేర‌కు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి ఆయ‌న ఆదేశించారు. పెరిగిన జిల్లాల సంఖ్య ఆధారంగా 26 మందిని జిల్లా అధ్యక్షులుగా నియ‌మించారు. వాళ్ల‌కు 11 మంది ప్రాంతీయ స‌మ‌న్వ‌యక‌ర్త‌ల‌ను అనుసంధానం చేశారు. ఆ 11 మందికి కూడా క్యాబినెట్ హోదా క‌ల్పిస్తామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. జిల్లా అధ్య‌క్షులు 26 ప్ల‌స్ ప్రాంతీయ స‌మన్వ‌య‌క‌ర్త‌లు 11 వెర‌సి 37 మందికి క్యాబినెట్ హోదా క‌ల్పించాలి. పైగా మంత్రివ‌ర్గంలోని మంత్రులు ఆ 37 మంది చెప్పిన‌ట్టు న‌డుచుకోవాల‌ని జ‌గ‌న్ ఇటీవ‌ల సూచించారు.

రాజ్యాంగం ప్ర‌కారం అసెంబ్లీలోని మొత్తం స‌భ్యుల సంఖ్య‌లో సీఎంతో స‌హా 15 శాతం మందికి మించి మంత్రివ‌ర్గం ఉండ‌కూడ‌దు. ఆ ప్ర‌కారం 25 మంది ఏపీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. వీళ్ల‌కు అద‌నంగా మ‌రో 37 మందికి మంత్రుల హోదా క‌ల్పించాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. ఆ విష‌యాన్ని న్యాయ‌స్థానాలు 2019లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెబుతూ తీర్పు ఇచ్చాయి. తొలి సారి అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ 2014లో పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శుల‌ను 12 మందిని నియ‌మిస్తూ వాళ్ల‌కు మంత్రుల హోదా క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. రాజ్యాంగాన్ని ధిక్క‌రించి 15శాతం కంటే ఎక్కువ మందికి క్యాబినెట్‌ హోదా ఇవ్వ‌డానికి లేద‌ని కోర్టుల్లో తీర్పు వ‌చ్చింది. దీంతో కేసీఆర్ నిమ్మండిపోయారు.

న్యాయ పరిశీలనకు నిలబడే విధంగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి చట్టాన్ని తీసుకురావాల‌ని 2019లో మ‌రోసారి కేసీఆర్ ప్ర‌య‌త్నం చేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాలు అనుస‌రిస్తోన్న విధానాన్ని అధ్య‌య‌నం చేశారు. రాజ్యాంగంలోని 91వ సవరణ ప్ర‌కారం “రాజ్యాంగంలోని ఆర్టికల్ 164లో, క్లాజ్ (1) నిబంధ‌న‌ (1A) నిబంధ‌న‌ల‌పై న్యాయ నిపుణుల‌తో అధ్య‌య‌నం చేయించారు. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కారం మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు”.

91వ సవరణకు ముందు రాష్ట్రంలో జంబో క్యాబినెట్‌లు ఉండేవి. వాటిలో, 1980ల ప్రారంభంలో టి అంజయ్య 61 మందితో క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశంతో ఆ సంఖ్యను 45కి తగ్గించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీట్ల సంఖ్య 119కి తగ్గింది, తదనుగుణంగా మంత్రివర్గం పరిమాణం కూడా తగ్గింది. క్యాబినెట్‌లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకోలేక డిసెంబర్, 2014లో కోవా లక్ష్మి, వి సతీష్ కుమార్, వి శ్రీనివాస్ గౌడ్, జి కిషోర్ కుక్మార్, జలగం వెంకట్ రావు, డి వినయ్ భాస్కర్‌లను పార్ల‌మెంట‌రీ కార్య‌ద‌ర్శులుగా నియమించారు. అయితే, కాంగ్రెస్ నేతలు సవాల్ చేయడంతో హైకోర్టు కొట్టివేసింది.

మంత్రులకు సహాయం చేయడానికి పార్లమెంటరీ సెక్రటరీల నియామ‌కం ఇంగ్లాండ్‌లో ఉద్భవించింది. ఇదే ధోరణిని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మణిపూర్, అస్సాం, రాజస్థాన్ త‌దిత‌ర భారతీయ రాష్ట్రాలు అనుస‌రించాయి. అయితే ఆయా హైకోర్టులు పలు కేసుల్లో నియామకాలను కొట్టివేశాయి. తెలంగాణలో పార్లమెంటరీ కార్యదర్శులను GO ద్వారా ద్వారా “తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శుల (నియామకాలు, జీతాలు, అలవెన్సులు మరియు ఇతర నిబంధనలు) చట్టం, 2015” ను తీసుకువచ్చింది. దీనిని కోర్టులో సవాలు చేయగా కోర్టు కొట్టివేసింది.

మార్చి 2015లో, ఢిల్లీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వం నుండి ఎలాంటి పారితోషికం లేదా ప్రోత్సాహకాలు లేకుండా పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. అయితే, ఆర్టికల్ 239 AAని ఉల్లంఘించిందని రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే NGO దాఖలు చేసిన PIL ద్వారా దీనిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం 21 మంది పార్లమెంటరీ కార్యదర్శులను అనర్హత నుండి మినహాయించేందుకు 1997లోని ఢిల్లీ సభ్యుల శాసనసభ (అనర్హత తొలగింపు) చట్టం, 1997ను పునరాలోచన ప్రభావంతో సవరించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును పంపారు. కానీ, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు.

ఆయా రాష్ట్రాలు క్యాబినెట్ హోదా ఇచ్చేలా ప‌ద‌వుల‌ను సృష్టించి భంగ‌ప‌డిన అంశాలు తెలిసి కూడా ఇప్పుడు జ‌గ‌న్ ప్రాంతీయ‌, జిల్లా బోర్డు అధ్య‌క్షుల‌కు క్యాబినెట్ హోదా క‌ల్పించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మంత్రివ‌ర్గం నుంచి తొలగించబ‌డిన వాళ్ల‌కు ఆశ‌లు రేకెత్తించేలా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌య‌త్నం న్యాయ‌స్థానాల్లో నిల‌బ‌డే ప్ర‌స‌క్తేలేద‌ని గ‌త తీర్పులు చెబుతున్నాయి. పైగా కేసీఆర్ చేయ‌లేని ప‌నిని జ‌గ‌న్ చేసి చూపాల‌ని ప్ర‌య‌త్నించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.