Site icon HashtagU Telugu

Bloodshed in History : ఎన్నాళ్ళీ రక్తపాతం..? ఎందుకీ మానవ హననం?

Israel Palestine Conflict A Never Ending Battle How Many Bloodshed.

Israel Palestine Conflict A Never Ending Battle How Many Bloodshed.

By: డా. ప్రసాదమూర్తి

Bloodshed in History :రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్లులతో” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం‘ అని కూడా ఆయనే అన్నాడు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తాజాగా చెలరేగిన మానవ మారణ హోమం చూస్తుంటే మన మహాకవులెందరో రాసిన ఎన్నో వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.

ఆదివారం ప్రశాంతంగా తెల్లారుతూ ఉండగానే రక్తసిక్తమైన వార్త ప్రపంచాన్ని కన్నీటి పర్యంతం చేసింది. పాలస్తీనాలోని గాజా ప్రాంతం నుంచి హమాస్ దళాలు ఇజ్రాయిల్ మీద అమాంతం దాడి చేసినట్టు, వేల కొద్ది రాకెట్లు ప్రయోగించినట్లు, వందలాది మంది ప్రాణాలు బలికొన్నట్టు, ఎందరినో అపహరించినట్టు, రక్తంతో కన్నీళ్ళతో ఇజ్రాయిల్ భూభాగం తడిసిపోయినట్టు ఆ వార్త చెప్పింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ రెచ్చిపోయింది. అదను కోసమే చూస్తున్నట్టుగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మనం యుద్ధంలో ఉన్నామని ప్రకటించడమే కాదు, వెంటనే పాలస్తీనాలోని గాజా మీద పరమ భీతావహంగా దాడి చేశాడు.

ఇక ఇజ్రాయిల్ నుంచి గాజా దాకా రక్తంలో తడిసిపోయిన (bloodshed) మృతదేహాల ప్రవాహం వెల్లువెత్తింది. ఇది ఎప్పటికి చల్లారుతుందో తెలియదు. ఆ రెండు ప్రాంతాల మధ్య యుద్ధమే తప్ప ప్రశాంతత ఎప్పుడూ లేదు.

We’re now on WhatsApp. Click to Join.

చరిత్ర ఏం చెబుతోంది?

ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధ ఘర్షణ ఈనాటిది కాదు. ఎప్పుడో ఒకటో శతాబ్దంలో పాలస్తీనాను ఆక్రమించుకున్న రోమన్ల కాలం నుంచి ఈ యుద్ధం వయసు కొలవాలి. అప్పుడు ఉన్నది కేవలం పాలస్తీనా మాత్రమే. రోమన్ల ఆక్రమణ తర్వాత వారు అక్కడి నుంచి యూదుల్ని తరిమివేశారు. అప్పటినుంచి యుద్ద బీజాలు పడ్డాయి. ఎప్పుడెప్పుడు తమ దేశంలోకి వెళదామా అని యూదులు చేస్తున్న ప్రయత్నమంతా ఆ బీజాల నుంచి వృక్షాలుగా పరిణమిస్తూనే ఉంది. 19వ శతాబ్దంలో యూదులు పాలస్తీనా తిరిగివచ్చి తమ సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు. అక్కడితో పాలస్తీనా మూలవాసులకు, యూదులకు మధ్య బహిరంగ యుద్ధం మొదలైంది.

ఇది 1948లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను విడదీసి ఇజ్రాయిల్ రాష్ట్రాన్ని సొంత దేశంగా ప్రకటించడం వరకూ సాగింది. అది పరిష్కారం కాలేదు కాగా సమస్యను మరింత జటిలం చేసింది. పాలస్తీనా వాసులు తమ దేశాన్ని ముక్కలు చేశారని గుండెలు బాదుకుని 1949 లో ఇజ్రాయిల్ వాసుల మీద యుద్ధం ప్రకటించారు. అప్పట్లో ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా అరబ్బు దేశాలు అన్నీ ఇజ్రాయిల్ కి ఎదురు తిరిగాయి. 1967 లో ఇజ్రాయిల్ అరబ్ దేశాలతో యుద్ధం చేసింది. చాలా దేశాలను ఓడించింది. చాలా భూ భాగాలను ఆక్రమించుకుంది. అప్పటినుంచి పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘోరమైన యుద్ధం సాగుతూనే ఉంది. ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగంలో అనేక ప్రాంతాలను ఆక్రమించడం, నిరంతరం దాడులు చేయడం, వందలాదిమందిని ఖతం చేయడం కొనసాగిస్తూనే ఉంది. దానికి ప్రతీకారంగా పాలస్తీనా నుంచి ప్రతిఘటన సాగుతూనే ఉంది.

అయితే ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఎక్కువగా ప్రజల ప్రాణాలు పోగొట్టుకున్నది పాలస్తీనా మాత్రమే. 2008 నుంచి ఇప్పటివరకు అనేక సందర్భాల్లో వేలాది సంఖ్యలో పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలో తొలిసారిగా ఇజ్రాయిల్ మొన్న జరిగిన దాడిలో 600 మంది పైగా ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటివరకు లెక్కలు చూస్తే పాలస్తీనా కోల్పోయిన ప్రాణాల సంఖ్య బాగా అధికంగా ఉంది. 2008- 2010 మధ్యకాలంలో దాదాపు రెండు వేలమంది పాలస్తీనీయులు బలైపోయారు. కేవలం 2014 సంవత్సరంలోనే 2,329 మంది ఆహుతైపోయారు. ఇలా తాజా పరిణామాల వరకు వేల సంఖ్యలో పాలస్తీనీయులు మట్టి పాలయ్యారు. దీనితో పోలిస్తే ఇజ్రాయిల్ కోల్పోయిన మానవ ప్రాణాల సంఖ్య తక్కువే. తాజా ఘటనలో మాత్రం ఇజ్రాయిల్ బాగా దెబ్బతింది.

Also Read:  Telangana Election Schedule : మరికాసేపట్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈ సమస్యకు పరిష్కారం లేదా?

ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. యుద్ధానికి యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో ఆపక్షం వైపో ఈ పక్షం వైపో ఎవరూ నిలబడడానికి అవకాశం లేదు. కానీ ప్రపంచ దేశాలు అటో ఇటో స్టాండ్ తీసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉనికిలో లేని ఇజ్రాయిల్, ఉనికిలో ఉన్న పాలస్తీనాతో, ఉనికిలో ఉన్న అరబ్ దేశాలతో ఘర్షణకు దిగడమే కాదు, ఒకప్పుడు అతిపెద్ద దేశంగా ఉన్న పాలస్తీనాను క్రమక్రమంగా ఆక్రమిస్తూ రక్తపాతాన్ని (bloodshed) సృష్టించడమే తన జన్మ హక్కుగా భావిస్తోంది. దీన్ని ప్రపంచంలో మానవ హక్కుల ప్రేమికులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించి, సామరస్యాన్ని పెంపొందించి, మరిన్ని మారణ హోమాలు జరగకుండా ఆపగలిగేది ఒక ఐక్యరాజ్యసమితి మాత్రమే. వెంటనే ఐరాస రంగంలోకి దిగాలని చాలామంది మానవీయ దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇండియా స్టాండ్ ఏమిటి?

ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణ విషయంలో గతం నుంచి భారత ప్రభుత్వాలు ఆ ప్రాంతంలో సామరస్య వాతావరణం నెలకొనాలని కోరుకుంటున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మనదేశంలో అధికారంలో ఉన్న బిజెపి వారు, ఇజ్రాయిల్ లో అధికారంలో ఉన్న రైట్ వింగ్ శక్తులకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తాజా ఘటన విషయంలో కూడా 2004- 2014 మధ్య భారత దేశంలో ఉగ్రవాదులు ఎలాంటి దాడులు సాగించారో.. ఆ పరిస్థితులు ఇజ్రాయిల్ లో ఇప్పుడు కనిపిస్తున్నాయని, ఇజ్రాలీయులకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇజ్రాయిల్ లోని నెతన్యాహూ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను తన చేతుల్లోకి తీసుకొని, అణచివేత చర్యలను కొనసాగించడం ఇక్కడ అధికారంలో ఉన్న మనవారికి కొంచెం ఇంపైన విషయంగా కనిపిస్తూ ఉండవచ్చు.

అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాజాగా ఇజ్రాయిల్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇరుపక్షాలు ద్వైపాక్షక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొన్నది. పాలస్తీనా ప్రజల ఆత్మగౌరవం, సమానత్వం, అస్తిత్వం కేవలం చర్చల ద్వారా మాత్రమే రక్షింపబడతాయని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఘర్షణ ఎంత మాత్రం పరిష్కారం కాదని ఆ పార్టీ చెబుతోంది. మనదేశంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ సందర్భంగా చెలరేగిన యుద్ధ వాతావరణాన్ని తీవ్రంగా ఖండిస్తూనే, రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి తక్షణం చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి.

Also Read:  Govt Employees – New Scheme : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్టు.. వివరాలివీ..

ఈ సందర్భంగా పాలస్తీనా మీద ఇజ్రాయిల్ సాగిస్తున్న నిరంతర దాడులను కమ్యూనిస్టులు ఖండించారు. ప్రస్తుత ఘటనలు మినహాయిస్తే ఈ సంవత్సరంలో దాదాపు 248 మంది, 40 మంది పిల్లలతో సహా పాలస్తీనాలో ఇజ్రాయిల్ దాడిలో ప్రాణాలు కోల్పోయారని వారు అంటున్నారు. ఇలా మన దేశంలో పాలస్తీనా, ఇజ్రాయిల్ ఘర్షణ పట్ల రాజకీయపక్షాలలో ఒక సన్నటి విభజన రేఖ కనిపిస్తుంది.

ఇది ఏమైనప్పటికీ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగితే బలైపోయేది నిస్సహాయులైన సామాన్య పౌరులే. తాజా వార్తలు వింటుంటే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎందరో శవాలుగా మారుతున్నారని అర్థమవుతుంది. ఇది మానవీయ హృదయం ఉన్న ఏ మనిషినైనా కలచివేస్తుంది. ఏ పాపం ఎరుగని అమాయకులే యుద్ధాలలో బలైపోతారు. ఇళ్ళ మధ్య గోడలు.. దేశాల మధ్య సరిహద్దులు.. ఎవరికి వారు తమ జీవితాలను ప్రశాంతంగా గడుపుకోవడానికే గాని ఒకరిని ఒకరు ద్వేషించడానికి, నిర్మూలించడానికి కాదు.

చరిత్ర పొడవునా యుద్ధం కథలన్నీ మనకు ఇచ్చిన సందేశం ఇదే. మహాకవి దాశరథి ఒక పాటలో అన్నట్టు “మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో.. రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో.. కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో.” ఎంతో.. ఎంతో. ఆ ఆవేదన, ఆ ఆక్రోశం.. ఆ కన్నీరు.. అదెంతో. అదెంతో. అందుకే మనుషులైన వాళ్ళు ఎవరైనా ఇలాంటి రక్తపాతాలకు (bloodshed), యుద్ధ వాతావరణానికి వంత పాడరు. అది అంతం కావాలనే కోరుకుంటారు. ఇవాళ ఇజ్రాయిల్, పాలస్తీనా కావచ్చు. ఉక్రెయిన్, రష్యా కావచ్చు. మరో దేశం.. మరో దేశం ఏదైనా సరే. యుద్ధం వద్దు. శాంతి మాత్రమే ముద్దు.

Also Read:  Chandrababu Case : చంద్రబాబు బెయిల్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు