Maharashtra Politics Judgment : ఉద్ధవ్‌ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ థాక్రేను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే తమ ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది. పార్టీలో తలెత్తిన సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్‌ వర్గం), శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం) దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి గురువారం తీర్పు (Maharashtra Politics Judgment) వెలువరించింది.

  • Written By:
  • Publish Date - May 11, 2023 / 05:58 PM IST

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ థాక్రేను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే తమ ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది. పార్టీలో తలెత్తిన సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్‌ వర్గం), శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం) దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి గురువారం తీర్పు (Maharashtra Politics Judgment) వెలువరించింది. ఈ వ్యాజ్యాన్ని విచారణ నిమిత్తం సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. శాసన సభలో ఉద్ధవ్ మెజార్టీ కోల్పోయారని నిర్ధారణకు రావడానికి అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వద్ద తగిన సమాచారం లేనప్పుడు సభలో మెజార్టీని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని పిలవడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచక్షణాధికారాలను గవర్నర్ అమలు చేసిన తీరు చట్టపరంగా లేదని, పార్టీలోని అంతర్గత వివాదాలను పరిష్కరించడానికి బలపరీక్షను ఒక మాధ్యమంగా వాడలేమని తెలిపింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును ఉద్ధవ్ కోల్పోయారని తెలుసుకునేందుకు శివసేన ఎమ్మెల్యేలకు చెందిన ఒక వర్గం చేసిన తీర్మానంపై గవర్నర్ ఆధారపడటాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కానీ బలపరీక్షను ఎదుర్కోకుండానే ఉద్ధవ్ రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించలేమని వెల్లడించింది. ఉద్దవ్ స్వచ్ఛందంగా సమర్పించిన రాజీనామాను కోర్టు రద్దు చేయదని తేల్చి చెప్పింది. ఒకవేళ ఉద్ధవ్ రాజీనామా చేయకుంటే ఆయనకు ఉపశమనం లభించేదని విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. థాక్రే రాజీనామా చేసిన తర్వాత.. అప్పటికే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మద్దతు కలిగిన శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం)తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రం సమర్థనీయమే అని పేర్కొంది. అలాగే గోగ్యాలేను విప్‌గా స్పీకర్ నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.

also read : Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై పరస్పర విమర్శలు

విస్తృత ధర్మాసనానికి బదిలీ..

షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలకుండానే ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండేతో ప్రమాణస్వీకారం చేయించిన నాటి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో ఉద్ధవ్‌ వర్గం సవాల్ చేసింది. ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై తాము అనర్హత వేటు వేయలేమని సుప్రీం వెల్లడించింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌కు.. రెబల్‌ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా ? లేదా ? అనే అంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని చెప్పింది. కాగా, సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు అటు షిండే, ఇటు థాక్రే వర్గాలకు ఏదో ఒక విధంగా సంతోషకరంగా ఉంది. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం.. ఎవరు నిజమైన శివసేన అనే అంశాన్ని శాసన సభ స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పడం ఆ వర్గానికి సంతోషాన్నిచ్చింది. షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ అని ఎన్నికల కమిషన్ ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే.