BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

కాలగమనంలో 18 క్యాలెండర్లు అలా మారిపోయాయి. కానీ దాంతోపాటే.. బీజేపీ రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 12:00 PM IST

కాలగమనంలో 18 క్యాలెండర్లు అలా మారిపోయాయి. కానీ దాంతోపాటే.. బీజేపీ రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి. సరిగ్గా 18 ఏళ్ల కిందట.. అంటే 2004లో ఇదే బీజేపీకి సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇదే హైదరాబాద్ లో జరిగాయి. అప్పుడే వాజ్ పేయి, అద్వానీదే హవా. కానీ ఇప్పుడు నరేంద్రమోదీ, అమిత్ షా దే రాజ్యం. అప్పుడు వైస్రాయ్ హోటల్ లో ఈ సమావేశాలు జరిగితే.. ఇప్పుడు నోవాటెల్ కన్వెన్షన్ దానికి వేదికైంది. అప్పుడు ప్రధానిగా వాజ్ పేయి వస్తే.. ఇప్పుడు ప్రధానిగా మోదీ వచ్చారు. ఇదే మోదీ నాటి సమావేశాలకు గుజరాత్ సీఎం హోదాలో విచ్చేశారు.

నాటి సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలు కూడా ఉన్నాయి. ప్రధాని హోదాలో వాజ్ పేయి హైదరాబాద్ కు వచ్చిన చివరి పర్యటన కూడా అదే. అప్పుడు కూడా పరేడ్ గ్రౌండ్స్ లోనే సభ జరిగింది. ఇప్పుడూ అక్కడే సభను ఏర్పాటుచేశారు. జనవరి 11, 12 తేదీల్లో జరిగిన సమావేశాలు బీజేపీకి బూస్ట్ ని ఇచ్చాయి. కానీ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో విజయాన్ని మాత్రం అందించలేకపోయాయి. ఆనాడు ముందస్తుకు వెళ్లాలని ఆ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా అలాంటి నిర్ణయాలను పార్టీ అంతర్గత సమావేశాల్లో తీసుకుంటారు. కానీ బీజేపీ మాత్రం అక్కడే డెసిషన్ తీసుకుంది.

భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో ముందస్తుకు వెళ్లింది బీజేపీ. కానీ అది జనానికి చేరలేదు. అప్పుడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల వల్ల బీజేపీకి ఓటమి తప్పలేదు. ఆ ఓటమే నరేంద్రమోదీ విజయానికి పునాదిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే.. 2004 ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీపై అద్వానికి పట్టు తగ్గింది. పైగా ఆ తరువాత పదేళ్లపాటు యూపీఏ అధికారంలో ఉండడం, కాంగ్రెస్ కు తిరుగులేని వాతావరణం ఉండడంతో బీజేపీ ప్రభ మసకబారింది. కానీ ఆ సమయంలో మోదీ మార్క్ రాజకీయం చాపకింద నీరులా విస్తరిస్తోందని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోయింది.

గుజరాత్ పగ్గాలను 2001లో చేపట్టిన మోదీ.. 2007, 2012 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2004లోనూ ఆయన సీఎంగానే ఉన్నా.. అప్పటికీ గుజరాత్ అల్లర్ల ప్రభావం ఆయనపై పడడంతో ఆనాడు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. 2004లో హైదరాబాద్ సమావేశాల తరువాత అద్వానీకి పార్టీని నడిపించే అవకాశాలు రెండుసార్లు వచ్చాయి. అయినా ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పార్టీపై అద్వానీ పట్టు చేజారుతున్న వేళ.. మోదీ.. గుజరాత్ మోడల్ ను తెరపైకి తెచ్చి పార్టీపై పట్టు సాధించారు. జాతీయ రాజకీయాల్లో తన హవా పెంచుకున్నారు. దీంతో సంఘ్ పరివార్ తో పాటు పార్టీ దృష్టి మోదీపై పడింది.

యూపీఏ జమానాలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణల గురించి జనానికి వివరించడంలో సక్సెస్ అయిన మోదీ టీమ్.. బీజేపీని 2014లో అధికారంలోకి తీసుకువచ్చింది. 2019లో మళ్లీ పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. అంటే 18 ఏళ్లలో బీజేపీలోకి కొత్త రక్తం వచ్చి చేరింది. పార్టీ స్థితిగతులూ మారాయి. అప్పట్లో బీజేపీ అజెండా అయోధ్యలో రామమందిరం, కాశీ, మధుర క్షేత్రాలకు పూర్వవైభవం, కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు. ఇప్పుడు వీటిలో 370 ఆర్టికల్ ను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతోంది. కాశీ, మధుర క్షేత్రాలకు ప్రాధాన్యత కల్పించారు.

ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్న మోదీ బృందంలో చాలామంది.. 2004 నాటి సమావేశాల్లో పాల్గోలేదు. వారికి ఆ అవకాశం రాలేదు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా.. అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగా, యువమోర్చా అధ్యక్షుడిగా ఉండేవారు. అమిత్ షా ఎమ్మెల్యేగా కేవలం గుజరాత్ రాజకీయాలను మాత్రమే చూసుకునేవారు. పీయూష్ గోయల్ నాడు కేవలం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్. నితిన్ గడ్కరీ అయితే మహారాష్ట్రలో ఎమ్మెల్సీగా ఉండేవారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలను చూస్తున్న తరుణ్ చుగ్ అప్పుడు.. పంజాబ్ లో విద్యార్థి పరిషత్తు నాయకుడు. యువమోర్చాలో ఉండేవారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు.. అప్పుడసలు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ 18 ఏళ్లలో వీళ్లంతా ఇప్పుడు పార్టీలో కీలకం అయ్యారు. కాలంతోపాటే బీజేపీలో చాలా మార్పులు వచ్చాయి.