TS Cabinet: శాఖల వారిగా తెలంగాణ కేబినెట్ చర్చలు, నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ సమావేశం ఎనిమిదిన్నర గంటలపాటు కొనసాగింది. రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చ చేసిన కేబినెట్ పలు శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.

తెలంగాణ కేబినెట్ సమావేశం ఎనిమిదిన్నర గంటలపాటు కొనసాగింది. రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చ చేసిన కేబినెట్ పలు శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.

వైద్య, ఆరోగ్య శాఖ

రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై కేబినేట్ మొదటగా చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా కేబినేట్ కు వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని, అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

వ్యవసాయశాఖ

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు సిఎం కెసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. సిఎం కెసిఆర్ వెంట వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.

రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చిందని, అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదని కేబినేట్ సమీక్షించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

విద్యాశాఖ

రాష్ట్రంలోని విద్య పై కేబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరుగుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అనివార్యత పెరిగిందని కేబినెట్ భావించింది.
వారి గ్రామాల్లో గనుక ప్రభుత్వమే ఇంగ్లీషు మీడియం లో విద్యాబోధన చేపట్టినట్టయితే స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు గ్రామాల్లోని తల్లిదండ్రులు సంసిద్దంగా ఉన్నారని కేబినెట్ భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియం లో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థులను ప్రాధమికస్థాయిలో ఇంగ్లీషు మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడామైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన ఆంగ్ల విద్యను అందిచడం ద్వారా ప్రయివేట్ కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ నిర్ణయించి ఈ మేరకు విద్యాశాఖను ఆదేశించింది.

రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేట్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల వసూల్ల పై సర్వత్రా వ్యతరేకత వినవస్తున్నదనే విషయాన్ని కేబినెట్ చర్చించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింతగా చేరువచేయాలని కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రంలో ‘మహిళా యూనివర్సిటీ ఏర్పాటు’ కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

ఇరిగేషన్ శాఖ

ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. పలు అంశాలను ఆమోదించింది.
ఏయే ప్రాజెక్టు కోసం ఎంత నీరు అవసరమో, ఎంత నీటిని కేటాయించాలో కేబినెట్ నిర్ణయించి ఆ సూచనలను పాటించాలని అధికారులను ఆదేశాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.