Site icon HashtagU Telugu

Telangana War : తెలంగాణలో యుద్ధం ఆ రెండు పార్టీల మధ్యనే

The War In Telangana Is Between Those Two Parties

The War In Telangana Is Between Those Two Parties

By: డా. ప్రసాదమూర్తి

War in Telangana Politics : తెలంగాణలో రాజకీయ చదరంగం ముక్కోణంగా సాగుతోందా? అయితే ఇది ఇద్దరి మధ్యనే జరుగుతున్న పోటీ అని చెప్పటానికే, మూడు ప్రధాన పక్షాలూ ముక్కోణంలో పోటీ పడుతున్నాయా? ప్రధాన పోటీ ఎప్పుడూ రెండు ప్రత్యక్ష వర్గాల మధ్య ఉంటుంది. ఇది సాధారణ సన్నివేశం. కానీ తెలంగాణలో ఇంకా ప్రధాన పోటీ జరుగుతున్న ఆ ఇరుపక్షాలు ఏమిటి అన్న విషయం తేలలేదన్న భ్రమలో జనాన్ని ముంచడానికి కొన్ని ప్రయత్నాలయితే సాగుతున్నాయి. కానీ ఎవరికి వారే, మేమిద్దరమే.. మేమిద్దరమే.. పోటీదారులం అంటూ, మూడో పక్షాన్ని కార్నర్ చేసే ప్రయత్నంలో మాత్రం ముమ్మరంగా మునిగిపోయారు.

మొన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే బహిరంగంగానే ఒక బహిరంగ రహస్యాన్ని బయట పెట్టాడు. అదేమిటంటే, తెలంగాణలో బిఆర్ఎస్, బిజెపి రెండూ పరోక్షమైన బంధంలో ప్రగాఢంగా అల్లుకుపోయాయన్నది ఆయన విమర్శ. మరోపక్క బిజెపి ఇంకో రకమైన విమర్శనాస్త్రాన్ని సంధిస్తోంది. అదేమిటంటే, కాంగ్రెస్, బిఆర్ఎస్ దొందూ దొందే అని ఆ పార్టీ వాదన. ఇంకోపక్క అసలు మైత్రి కాంగ్రెస్, బిజెపి మధ్యనేనని, వాళ్ళిద్దరూ తోడు దొంగలని, తెలంగాణ (Telangana)లో కొనసాగుతున్న ప్రజాపాలనను అంతం చేసి, నియంతృత్వ పాలనను నెలకొల్పాలని కాంగ్రెస్, బిజెపి చూస్తున్నారని, ఇద్దరి మధ్య ఎవరికీ తెలియని ఒక ఒప్పందం కొనసాగుతోందని బిఆర్ఎస్ వాదన.

చూసారా ఇలా ప్రధాన మూడు పక్షాలూ వారిద్దరంటే, వారిద్దరంటూ తనను తప్ప మిగిలిన రెండు పక్షాలను టార్గెట్ చేయడానికి చూస్తున్నాయి. ఇది ఒక విచిత్ర సందర్భం రాజకీయాలలో. అందునా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలూ వైరి పక్షాల మీద దొరికిన బాణాలు వదలడం మామూలు విషయమే కదా. వారి మాటలు ఎలా ఉన్నా, ప్రజలే ఆ మాటలకు చాలా గందరగోళపడతారు. అసలు ప్రజల్ని అలా గందరగోళంలో ఉంచి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే రాజకీయ పక్షాల వ్యూహాత్మక రాజకీయం.

తెలంగాణ (Telangana) రాజకీయాల విషయానికి వస్తే, ఇక్కడ క్రమక్రమంగా పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కేంద్రీకృతం అవుతున్న విషయం స్పష్టమవుతోంది. రెండు కారణాలు ప్రధానంగా మనం చూడవచ్చు. ఒకటి, మత తత్వంతో పోరాడతానని, కేంద్రంలో ఉన్న బిజెపి తన ప్రధాన శత్రువు అని, దేశాన్ని బీజేపీముక్త దేశంగా చేయడానికి తాను కంకణం కట్టుకున్నానని కేసీఆర్ ఒకప్పుడు అట్టహాసంగా ప్రకటించిన సందర్భాలు జనం మర్చిపోలేదు. అంతేకాదు, బిజెపి వారు తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పన్నాగాలు రచిస్తున్నారని, వాటిని సమస్త ఆధారాలతో దేశం ముందు పెడతానని, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎంత హడావిడి చేశాడో అందరికీ గుర్తు ఉంది. మరి ఇప్పుడు ఆ వీడియోలు, ఆ ఆధారాలు, ఆ హడావిడి ఏమైపోయిందో.. ఏ వ్యూహాత్మక నిశ్శబ్దంలో మరుగున పడిపోయిందో ఆయనకు ఎలాగూ తెలుసు. మనకే తెలియదని కెసిఆర్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అంత అమాయకంగా ఎవరున్నారు?

రెండో విషయం కవిత లిక్కర్ స్కామ్. ఇదిగో ఇక ఈరోజే, ఇక ఈ క్షణమే, కవిత అరెస్టు అన్న ఆర్భాటాన్ని కేంద్రంలో ఉన్న పాలకులు వారి అనుయాయ వర్గాలు, సిబిఐతో సహా అందరూ చేసిన హంగామా ఇప్పుడు ఏమైంది? ఇది కూడా నిశ్శబ్ద వ్యూహాత్మక రాజకీయమేనా? కేవలం ఈ రెండు విషయాలు చూస్తే చాలు. కానీ అటు బిఆర్ఎస్ మీద రాష్ట్రంలో ప్రతిక్షణం కాలు దువ్వే బండి సంజయ్ లాంటి బిజెపి నాయకులు మొగమాటానికైనా నోరెత్తటం లేదు. మరోపక్క, కేసీఆర్ గారు దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం కోసం సాగుతున్న విపక్షాల ప్రయత్నాలలో పాలుపంచుకుంటున్న దాఖలాలు లేవు. ప్రతిపక్షాలు ఐక్యంగా నిర్వహించిన పాట్నా సభలో ఆయన పత్తా లేడు. బెంగుళూరు సభలో ఆయన పలుకూ లేదు. ఇలా కళ్ళ ముందు కనిపిస్తున్న పరిణామాలు చూస్తే, ఎవరు ఎవరితో లోపాయికారి మిలాఖత్ అయ్యారో అర్థమవుతుంది.

మొత్తానికి లోపల విషయాలు ఎలా ఉన్నా, ఇంకా తెలంగాణలో పోటీ ముక్కోణంగా ఉంటుందని చెప్పడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. చదరంగం ఇద్దరే ఆడతారు. యుద్ధంలో రెండు పక్షాలే ఉంటాయి. ఎన్నికల్లో కూడా రెండు పార్టీలే ప్రధానంగా బరిలో ఉంటాయి. అవి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలే అన్నది జనానికి స్పష్టమవుతోంది. అయితే జనం ఏ పక్షం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారో చూడాలి.

Also Read:  Telangana Election Campaign : ఎన్నికల ఖర్చుల కోసం ఎమ్మెల్యేకే డబ్బులు ఇస్తున్న ఓటర్లు..