TDP : తెలంగాణలో టీడీపీ రాజకీయ వ్యూహం అదేనా?

హైదరాబాదులో ఆంధ్రా సెట్లర్లూ, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగస్తుల్లో టిడిపి సానుభూతిపరులు చాలామంది ఉంటారు. అసలే వార్ వన్ సైడ్ కాదని, అది టగ్ ఆఫ్ వార్ గా ఉంటుందని సర్వేలు చెబుతున్న ఈ సమయంలో ఒక్క ఓటును వదులుకున్నా అది ప్రాణాపాయంగా పరిణమించవచ్చు

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 10:30 PM IST

నారా లోకేష్ (Nara Lokesh) ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిసిన మరుక్షణం నుంచి రాజకీయ విశ్లేషకుల, పరిశీలకుల ఊహాగానాలకు అంతే లేదు. లోకేష్, అమిత్ షా తో తన భేటీ తన తండ్రి చంద్రబాబు నాయుడు (Chandrababu)కు సంబంధించింది మాత్రమే అని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు, ఆయన అరెస్టు, అరెస్టు అనంతర పరిణామాలు, జైల్లో ఆయన ఆరోగ్య (Chandrababu helath) పరిస్థితి.. ఇవన్నీ వివరించడానికి తాను హోం మంత్రి అమిత్ షాను కలిసినట్టు లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ రాజకీయ నాయకుల కలయికలు పైకి చెప్పినట్టు ఉండవు. ఊరక రారు మహానుభావులు అన్నట్టు రాజకీయ నాయకులు ఊరకనే కలుసుకోరు. అసలే ఐదు రాష్ట్రాల ఎన్నికలు నెత్తి మీదకు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ బిజెపికి ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు సర్వేలన్నీ ప్రధాన పోటీ కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని, బిజెపి మూడో స్థానంలోకి జారిపోతుందని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి తెలంగాణలో ఇమేజ్ డ్యామేజ్ కంట్రోల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగానే లోకేష్ అమిత్ షాల మధ్య భేటీ జరిగిందనేది పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంటుంది. రాష్ట్రం విడిపోయి అప్పుడే 10 సంవత్సరాలు గడిచింది. విభజన కాలం నాటి గాయాలు, ఘర్షణలు ఇప్పుడు లేవు. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో కొనసాగి మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాల్లో చిన్న గడ్డిపోచను కూడా వదలడం లేదు. అధికార పార్టీని ఎదుర్కోవడానికి, కర్ణాటక ఫలితాల తదనంతర ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సమస్త శక్తుల్నీ కూడగట్టుకుంటూ ఎన్నికల వైపు కదులుతోంది. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆంధ్రా ఓటర్ల ప్రాబల్యం గణనీయంగా ఉంటుంది. వీరిని తమవైపు ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం తమకు కావాల్సిన సీట్లను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందు షరతులు పెట్టింది. హైదరాబాదులో ఆంధ్రా సెట్లర్లూ, ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగస్తుల్లో టిడిపి సానుభూతిపరులు చాలామంది ఉంటారు. అసలే వార్ వన్ సైడ్ కాదని, అది టగ్ ఆఫ్ వార్ గా ఉంటుందని సర్వేలు చెబుతున్న ఈ సమయంలో ఒక్క ఓటును వదులుకున్నా అది ప్రాణాపాయంగా పరిణమించవచ్చు. ఇలాంటి సమయంలో టిడిపి సానుభూతిపరులు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూడడం అనివార్యం. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా టిడిపిని మద్దతు కోరలేదు. చంద్రబాబుకి కేసీఆర్ కి మధ్య ఉన్న వైరం అలాంటిది. అంతేకాదు ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు చేసిన నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిషేధించి కేటీఆర్, చంద్రబాబుకు తమకు మధ్య ఉన్న స్పర్థను ప్రత్యక్షంగా ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో టిడిపి మద్దతు దారులు కమ్మ సామాజిక వర్గం గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళకుండా బిజెపి తన వైపు లాక్కుంటే, అది బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు పోకుండా మరోవైపు వెళితే అధికార పార్టీకి ఎంతో మేలు జరిగినట్టే. ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో నారా లోకేష్ అమిత్ షాను కలవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ కలయిక కేవలం ఇద్దరి మధ్యనే జరగలేదు. రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి కూడా ఆ సమావేశంలో ఉన్నారు. అంటే ఆంధ్ర ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి, తక్షణం తెలంగాణలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలు, ఎత్తులు పొత్తుల గురించి చర్చ జరిగి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ టిడిపి అధికారికంగా తమ మద్దతును బిజెపికి ప్రకటించి, రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి ఎన్నికల బరిలోకి దిగితే, అధికార బీఆర్ఎస్ పార్టీకి కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు అవుతుంది. ఒకవైపు రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ వైపు మళ్ళినట్టుగా కనిపిస్తున్న తరుణంలో, టిడిపి మద్దతుదారులు సానుభూతిపరులు కాంగ్రెస్ వైపు చూడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికే ఈ సమావేశంలో మంతనాలు జరిపినట్టుగా అర్థం చేసుకోవాలని పలువురు భావిస్తున్నారు. అసలే రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికి షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించడం చూస్తున్నాం. ఇక మిగిలిన కమ్మ సామాజిక వర్గం, టిడిపి సానుభూతి వర్గం కూడా కాంగ్రెస్కు దూరమైతే కాంగ్రెస్ ని కట్టడి చేసినట్టే అవుతుందని ప్రత్యర్థి వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో.

Read Also : Haris Rauf: పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ రియల్ స్టోరీ ఇదే.. స్కూల్ ఫీజు కోసం పని..!