Saralasagar Project : తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రో కూడా ఉత్తమ్ కు తెలియదు – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 04:28 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడివేడిగా నడుస్తున్నాయి. శనివారం సమావేశాలు మొదలుకాగా.. సభలో ఇరిగేషన్‌పై శ్వేత పత్రాన్ని (White Paper On Irrigation Projects) ప్రభుత్వం విడుదల చేసింది. నీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Uttam Kumar) సభలో మాట్లాడారు. ఉత్తమ్ సభలో అన్ని అసత్యాలే మాట్లాడారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. వనపర్తి జిల్లాలోని సరళాసాగర్ ప్రాజెక్టుపై అవాస్తవాలు ప్రచారం చేశారని సింగిరెడ్డి అన్నారు.

సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించింది వనపర్తి రాజులు అని, నిజాం రాజులు కాదని సింగిరెడ్డి స్పష్టం చేశారు. సరళా సాగర్ ప్రాజెక్ట్ (Sarala Sagar Project
) ను పూర్వం వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజులలో ఒకరైన రెండవ రామేశ్వరరావు కాలంలో సరళాదేవి పేరు మీదుగా ఒక చెరువులా నిర్మించారు. దీని నిర్మాణం కోసం రామేశ్వరరావు-II ఇంజనీర్ లను అమెరికా లోని కాలిఫోర్నియాకు పంపించి అధ్యయనం చేసిన తర్వాత శంకరమ్మపేటలో 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. సరళా సాగర్ ప్రాజెక్ట్ ను 1949 సెప్టెంబరు 15 న ఆనాటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జనరల్ జయంతో నాథ్ చౌదరీ చేతుల మీదుగా ఊకచెట్టు వాగు మీద పునాదులు వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దీని సామర్థ్యం 0.42 టీఎంసీ ఈ ప్రాజెక్టు కింద 9 గ్రామాలకు సాగు నీరు అందుతుంది. దీనినే ఆధునీకరించి 1959 జూలై 26 వ తేదిన సరళా సాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. అప్పటి పి. డబ్ల్యూ డి. శాఖా మంత్రి జె.వి. నర్సింగరావు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిజాం రాజులకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తిగా వనపర్తి రాజులు నిర్మించారు. అనంతర కాలంలో అవసరాల మేరకు ఆయా ప్రభుత్వాలు మరమ్మతులు చేపట్టాయి. ఏ ప్రాజెక్టు ఎవరు నిర్మించారో తెలియకుండా కాంగ్రెస్ మంత్రులు శాసనసభలో చెప్పడం విచారకరం. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల మీద వీరికి ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

1964 సెప్టెంబరులో సరళాసాగర్ కుడివైపు గండి పడితే కొంత భాగాన్ని రాతితో ఆనకట్ట పునర్నిర్మించారు. తదనంత కాలంలో బుర్ర వాగు ఇతర వాగుల నుంచి వచ్చే ప్రవాహాలు, అనావృష్టి కాలక్రమేణా సరళ సాగర్ ప్రాజెక్ట్ మరుగున పడిపోయింది. ఇది వర్షాధార ప్రాజెక్టు కావడం మూలాన ఆ సమస్యను అధిగమించడానికి, నిరంతరం నీటితో ఉండటానికి ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్ పాడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 12 కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని 2008 లో అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డా. జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. దాదాపు పదకొండు సంవత్సరాల పాటు అనేక మంది రైతుల పంటలకు నీరు అందించింది.కానీ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కొరవడడంతో 2019 డిసెంబరు 31 ఉదయం సరళా సాగర్ కు ఎడమవైపు భారీ గండి పడింది దీనితో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు 2020 ఆగస్టు నాటికి గండిని పూర్తిగా పునరుద్ధరించారు అని సింగిరెడ్డి చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రో కూడా రాష్ట్ర నీటి పారుదలశాఖా మంత్రి ఉత్తమ్‌కు తెలియక పోవడం విచారకరం అని సెటైర్ వేశారు. శాసనసభ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేయడం కాంగ్రెస్ మంత్రులకు, పార్టీకి ఉన్న అవగాహనకు ఇది నిదర్శనం అన్నారు.

Read Also : Etela Rajender : తనను బద్నాం చేయడానికే ఈ ప్రచారం – ఈటెల