Paddy Issue : రైతుకు ర‌బీ వ‌రి పంట న‌ష్టం రూ.3వేల కోట్లు

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 03:47 PM IST

వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రాజ‌కీయ యుద్ధం చేస్తుంటే సంద‌ట్లో స‌డేమియాలాగా రైతుల క‌ష్టాన్ని రైస్ మిల్ల‌ర్లు క్యాష్ చేసుకుంటున్నారు. మునుపెన్న‌డూ లేని విధంగా వ‌రి ధాన్యం విష‌యంలో కేంద్రం, రాష్ట్రం మ‌ధ్య తేడా వ‌చ్చింది. సాధారణంగా ప్ర‌తి ఏడాది బియ్యం రూపంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి ఇస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం వ‌రి ధాన్యం మాత్ర‌మే ఇస్తామంటూ మొండికేసింది. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రం కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో వ‌రి ధాన్యం రైతుల వ‌ద్ద ఉండిపోయింది. అప్పుల బాధ‌ల‌ను త‌ట్టుకోలేక త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యించ‌డానికి రైతులు సిద్ధ ప‌డ్డారు. ఆ అవ‌కాశాన్ని క్యాష్ చేసుకుంటూ మిల్ల‌ర్లు కేవ‌లం రూ. 1500ల‌కు క్వింట‌ల్ ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఫ‌లితంగా ఈ సీజ‌న్ లో సుమారు 3వేల కోట్ల రూపాయాలు తెలంగాణ రైతులు న‌ష్ట‌పోతున్నార‌ని అంచ‌నా.తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్ల దోపిడీకి వరి రైతులు బలి అవుతున్నారు. సోమవారం ఢిల్లీలో వరి సేకరణపై కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పెద్ద ధర్నా చేప‌ట్టింది. జాతీయ స్థాయిలో ఒకే వ్య‌వ‌సాయ విధానం ఉండాల‌ని 24 డెడ్ లైన్ ను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కేంద్రం ముందు పెట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రి కొనుగోలు కేంద్రాల‌ను మూసివేయ‌డంతో బహుశా తొలిసారిగా. తెలంగాణ రైతులు రబీ సీజన్‌లో MSP (కనీస మద్దతు ధర) కంటే తక్కువకు వ‌రి ధాన్యం విక్రయించడానికి సిద్ధ‌ప‌డ్డారు.

దేశ రాజధానిలో జరిగే పెద్ద ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నుంచి రైతు సంఘం కొంత ఉపశమనాన్ని ఆశించింది. కానీ, ఫ‌లితం మాత్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి. ప్రతి వ్యవసాయ సీజన్‌లో నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. ముడి బియ్యంను ప్ర‌తి ఏడాది రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేసేది. ఈసారి ముడి వరిని కొనుగోలు చేయాలని కేంద్రం ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం కండిష‌న్ పెట్టింది. అందుకు కేంద్రం తిరస్కరించడంతో ప్రస్తుత రబీ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రకటించింది.నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాలోని మిల్లర్లు రైతుల నుంచి తక్కువ ధరకు వరిని కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు రూ.1,900 ఉండగా, రూ.1,500 నుంచి రూ.1,600 వరకు వరిధాన్యాన్ని రైతులు తెగ‌న‌మ్ముకుంటున్నారు. సూర్యాపేటలోని మిర్యాలగూడలో మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ప్రతి సీజన్‌లో దోచుకుంటున్నారు. పాత నల్గొండ జిల్లాలో, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ద్వారా సమృద్ధిగా నీటి వనరులు ఉన్నందున రైతులు రెండు సీజన్లలో వరి వేయ‌డం ఆనవాయితీ.

సూర్యాపేట జిల్లా చిల్కూరు మండలం రామాపురంకు చెందిన టి రవికుమార్‌ మాట్లాడుతూ.. తనకున్న 10 ఎకరాల్లో వరి సాగు చేశానని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో తక్కువ ధరకే అమ్ముతున్నానని తెలిపారు. రబీలో వరి సాగును నిలిపివేయాలని కేసీఆర్‌ పిలుపునివ్వడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. రైతులు వరి నాట్లు వేయకముందే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ సీజన్‌లో 30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. సీజన్ ప్రారంభానికి ముందే 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రం, కేంద్రం కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకుని మిల్లర్లు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మిల్ల‌ర్లు కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు రూ.2,200 ఎంఎస్‌పీ ఇవ్వగా, బ‌య‌ట రూ.1,800 చెల్లిస్తుండడంతో సూపర్‌ఫైన్ వరి రకాలైన చింతల, హెచ్‌ఎంటీ సాగుదారులకు కూడా ఎంఎస్‌పీ అందడం లేదు.వచ్చే వారం నుంచి వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లో వరి రైతులు కూడా మిల్లర్ల వద్దకు వెళ్లి పంటను త‌క్కువ ధరలకు అమ్ముకోవాల్సి వ‌స్తుంది. ఈ ఏడాది వరిపై ఎంఎస్‌పీ రాకపోవడంతో రైతుకు ఎకరాకు కనీసం రూ.5 వేల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ రబీలో వరి సాగు చేసిన మొత్తం రైతుకు దాదాపు రూ.3,000 కోట్ల నష్టం వాటిల్లనుంది. సూర్యాపేట, నల్గొండ మరియు వరంగల్ జిల్లాల్లో ఉన్న దాదాపు 1,000 ముడి రైస్ మిల్లులు వరి సేకరణలో బిజీగా ఉన్నాయి. ముడి బియ్యం నిల్వ చేసే ప్రక్రియలో ఉన్నాయి. కొనుగోళ్లు ముగియగానే మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో పాత బియ్యానికి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తున్నారని ఓ రైతు వాపోయాడు. మొత్తం మీద రైతుల‌ను అంటు ప్ర‌భుత్వాలు ఇటు మిల్ల‌ర్లు దోచుకోవ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేయ‌డం విచిత్రం. అన్నం పెట్టే రైతన్న విష‌యంలో మోసాల‌కు పాల్ప‌డిన మిల్ల‌ర్ల‌కు ప్ర‌భుత్వాలు ప‌రోక్షంగా స‌హ‌కారం అందించ‌డం దారుణం. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వాల‌కం తెలంగాణ రైతుల‌కు కేవ‌లం ర‌బీ సీజ‌న్ లోనే రూ. 3వేల కోట్ల వ‌ర‌కు న‌ష్టాన్ని తెచ్చింద‌ని తెలుస్తోంది.