Site icon HashtagU Telugu

Phone Tapping : జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారు.. భుజంగరావు సంచలన వాంగ్మూలం

Phone Tapping Bhujanga Rao

Phone Tapping Bhujanga Rao

Phone Tapping :  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన  ఫోన్ ట్యాపింగ్ తతంగంతో ముడిపడిన ముఖ్యమైన సమాచారంపై ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ(సస్పెండెడ్‌) నాయిని భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ‘‘ప్రభుత్వ కేసులు, బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయ్యాయి’’ అని ఆయన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘జడ్జీలు, జర్నలిస్టుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు భావించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై  ఆనాటి డీజీపీ, అదనపు డీజీపీలు క్షుణ్నంగా సమీక్ష జరిపేవారు కాదు. దీంతో ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ(సస్పెండెడ్‌) ప్రణీత్‌రావు ఇష్టానుసారంగా వ్యవహరించారు’’ అని భుజంగరావు తెలిపారు. ఈమేరకు వివరాలతో నిందితుడు భుజంగరావు నేరాంగీకార వాంగ్మూలాన్ని కోర్టుకు పోలీసులు సమర్పించారు. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ బారినపడిన ఓ హైకోర్టు జడ్జి పేరును కూడా ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Blood Cancer : భారతదేశంలోని యువకుల్లో పెరుగుతున్న బ్లడ్ క్యాన్సర్ కేసులు

‘‘ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఆర్థిక వనరులను సమకూర్చేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించాలని ప్రభాకర్‌రావు మాకు ఆదేశాలిచ్చేవారు. హైటెక్‌ సిటీలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వ్యవహారంలో సంధ్య కన్వెన్షన్‌ శ్రీధర్‌రావు, అతడి వ్యాపార భాగస్వామి సాంబశివరావుతో వివాదం ఉండేది. ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్‌కు రూ.15 కోట్ల నిధులు సమకూర్చాలని శ్రీధర్‌రావుపై ఒత్తిడి తెచ్చాం. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అతడిపై పలు క్రిమినల్‌ కేసులుండటంతో బీఆర్ఎస్ నుంచి ఇబ్బందులు ఎదురుకావొద్దంటే ఆ నిధులివ్వాలన్నాం. అందువల్లే శ్రీధర్‌రావు బీఆర్ఎస్ కోసం ఎస్‌బీఐ నుంచి రూ.13 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నారు’’ అని స్టేట్మెంట్‌లో భుజంగరావు  పేర్కొన్నారు.

Also Read : Health Tips : 60 ఏళ్ల తర్వాత ఏ ఆహారాలు తినాలి..?

‘‘కేసీఆర్‌ పోటీచేసిన కామారెడ్డి అసెంబ్లీ స్థానంపై నిఘా పెట్టేందుకు ‘కేఎంఆర్‌’ పేరిట వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి.. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిల కార్యకలాపాలపై నిఘా ఉంచడం.. వారికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడమే ఈ వాట్సప్ గ్రూపు లక్ష్యం. కేసీఆర్‌ను గెలిపించేందుకు ఈ సమాచారాన్ని వాడాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు’’ అని భుజంగరావు, తిరుపతన్నలు వాంగ్మూలం ఇచ్చారు.  ఈ వాట్సప్ గ్రూపులో షేర్ చేసుకున్న సమాచారం ఆధారంగానే కామారెడ్డి పోలీసులు విపక్ష నేతలకు సంబంధించిన దాదాపు రూ.56.84 లక్షలను స్వాధీనం చేసుకోగలిగారని చెప్పారు.