Hyderabad : క్యారీ బ్యాగ్ కొనాలని ఒత్తిడి.. కస్టమర్ కు 11 వేలు చెల్లించిన సంస్థ!

హైదరాబాద్ కు చెందిన కె. మురళీ కుమార్ అనే విద్యార్థి 2019 సెప్టెంబరు 16న టేక్‌ అవే ద్వారా పిజ్జాను ఆర్డర్ చేశాడు. ఫిజ్జాను డెలివరీకి డబ్బులు చెల్లించిన మురళి.. క్యారీ బ్యాగ్ కూడా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.

  • Written By:
  • Updated On - November 18, 2021 / 05:20 PM IST

హైదరాబాద్ కు చెందిన కె. మురళీ కుమార్ అనే విద్యార్థి 2019 సెప్టెంబరు 16న ఆన్ లైన్  ద్వారా పిజ్జాను ఆర్డర్ చేశాడు. పిజ్జాను డెలివరీకి డబ్బులు చెల్లించిన మురళి.. క్యారీ బ్యాగ్ కూడా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఇందుకు అదనంగా రూ.7.62 వసూలు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మురళి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. క్యారీ బ్యాగ్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసినట్టు, అందుకు డబ్బులు చెల్లించాలని పట్టుబడినట్టు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వినియోగదారుల ఫోరం విచారణ చేపట్టింది. దాదాపు రెండు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత వినియోగదారునికి రూ.11,000 చెల్లించాలని అవుట్‌లెట్‌ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం సంస్థ లోగోతో కూడిన క్యారీ బ్యాగ్‌ను రూ.7.62కు కొనుగోలు చేయమని ఒత్తిడి చేసినందుకు పిజ్జా అవుట్‌లెట్‌ను వినియోగదారునికి రూ.11,000 చెల్లించాలని ఆదేశించింది.

వినియోగదారుల హక్కులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్-2019ను ప్రభుత్వం రూపొందించింది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. అందుకే ఎలాంటి కొనుగోళ్లు, లావాదేవీలు చేసినప్పుడు అయినా వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా సేకరించాలి. వారంటీ, గ్యారంటీ ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ఇన్వాయిస్, ఇతర బిల్లులను చూపించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన వస్తుసేవల్లో లోపాలు ఉన్నప్పుడు పరిహారాన్ని కోరే అవకాశం వినియోగదారులకు ఉంటుంది. వీటితో పాటు వినియోగదారులు తమ హక్కులకు సంబంధించిన పూర్తి వివరాలపై అవగాహన పెంచుకోవాలి.

వినియోగదారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. అవి ఏమేమిటంటే.. ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. బి) కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. సి) రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం మరియు అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.