Telangana : తెలంగాణలో హంగ్..? ‘సర్వే’ సర్వత్రా ఇదే మాట..

ఇప్పటివరకు తెలంగాణ (Telangana)లో వచ్చిన దాదాపు అన్ని సర్వేలూ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం చేపట్టడానికి తగిన మెజారిటీ స్థానాలు రాకపోవచ్చు అని చెబుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 21, 2023 / 02:00 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Hung in Telangana :  ఒకపక్క ఎన్నికల వేడి.. మరోపక్క నాయకుల వాగ్యుద్ధాల వాడి.. ఇంకోపక్క పథకాల జోరు.. అన్ని దిక్కులా వాగ్దానాల హోరు.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ (Telangana)లో తాజా రాజకీయ వాతావరణం. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, సర్వేలు మరో ఎత్తు. ఇప్పటికే చాలా సర్వేలు వస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ రకరకాల సంస్థలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ పక్షాలు ఎవరికి వారే రానున్న ఎన్నికల్లో విజయ రథసారథులు తామేనని ప్రకటించుకుంటున్నాయి. ప్రజలు మాత్రం మౌనంగా, నాయకుల మాటలు, వారు చేసే వాగ్దానాలు, వారు ప్రకటించే పథకాలు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు అన్నీ తదేకంగా గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటరు మహాశయుడే దేవుడు. ఆ దేవుడి తీర్పు ఎలా ఉంటుందో అంచనా వేయడం అంత తేలిక విషయం కాదు. నాయకులు ఏమైనా చెప్పొచ్చు గాని ఓటరు మదిలో ఏముందో చిలక జోస్యం చెప్పే ఘనులు ఎవరూ లేరు. అదిగో అలాంటి పని తాము చేస్తున్నామని సర్వే సంస్థలు చెప్తున్నాయి.

ఇప్పటివరకు తెలంగాణ (Telangana)లో వచ్చిన దాదాపు అన్ని సర్వేలూ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం చేపట్టడానికి తగిన మెజారిటీ స్థానాలు రాకపోవచ్చు అని చెబుతున్నాయి. తాజాగా ఇండియా టుడే చేసిన సర్వే ప్రకారం కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని తెలుస్తోంది. కాకుంటే ఈ ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఎవరికీ అధికారాన్ని ఏర్పాటు చేసే పూర్తి మెజారిటీ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ సర్వే 54 స్థానాలు ఇస్తే, అధికార బీఆర్ఎస్ పార్టీకి 49 స్థానాలు, బిజెపికి ఎనిమిది స్థానాలు, ఏడెనిమిది మజ్లిస్ పార్టీకి దక్కవచ్చని అంచనా. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇలాగే జరిగితే తెలంగాణలో హంగ్ (Hung) అసెంబ్లీ రావడానికి సంపూర్ణ అవకాశాలు కనిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడే కాదు, మొదటి నుంచీ బిజెపి వారు హంగ్ (Hung) అసెంబ్లీ వస్తుంది అని ఒకటే ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి ఇప్పుడు ఇండియా టుడే సర్వే గట్టి బలాన్నిస్తోంది. ప్రచారం వేరు, ప్రజల్లోకి వెళ్లి వారిని అనేక కేటగిరీల వారీగా విభజించి ఓటరు మనోగతాన్ని స్టడీ చేయడం వేరు. అలా స్టడీ చేసేవే సర్వే సంస్థలు. ఇప్పుడు తాజా సర్వే ప్రకారం హంగ్ (Hung) తప్పదని అర్థమవుతుంది. అయితే ఇంకా ఎన్నికలకు 40 రోజులు సమయం ఉంది కాబట్టి, ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితాలను ఇంకా విడుదల చేయలేదు కాబట్టి, రానున్న రోజుల్లో రాజకీయ రంగస్థలం మీద పాత్రధారులు, సూత్రధారులు అటూ ఇటూ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఒపీనియన్ పోల్స్ తారుమారు కాగలవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ (Telangana)లో ఒక విచిత్రమైన పరిస్థితిని మనం చూడబోతున్నామని తాజా రాజకీయ సమీకరణలు, వెలువడుతున్న సర్వేలు, విశ్లేషకుల అభిప్రాయాలు, పార్టీల ప్రచారాలు చూస్తుంటే అర్థమవుతుంది.

ఒకవేళ ఇండియా టుడే లెక్కలు కొంచెం అటూ ఇటు ఫలితాలుగా పరిణమిస్తే ఏ ఒక్కరూ మరో పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలు ఉండదు. అలాంటి సమయంలో ఎవరు ఎవరి పక్షాన ఉంటారు అనేది ఇప్పుడు ఎవరికీ అంతుబట్టని చిక్కు ప్రశ్న. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మొత్తం 119 స్థానాల్లో 60 స్థానాలు చేజిక్కించుకోవాలి. ఈ పూర్తి మెజార్టీ ఎవరికీ రావడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ 54 స్థానాలకి సరిపెట్టుకుంటే మరో ఆరు స్థానాల కోసం పక్క పార్టీల వైపు చూడాలి. అలా ఏ పార్టీ కాంగ్రెస్ కి మద్దతునివ్వడానికి ముందుకు వస్తుంది? అధికార పార్టీ అసలే రాదు. బిజెపి, కాంగ్రెస్ కు మద్దతు సమస్యే లేదు. ఇక మిగిలింది ఎంఐఎం మాత్రమే. ఈ పార్టీకి ఓల్డ్ సిటీలో కనీసం ఏడు సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. అంటే వీరు కాంగ్రెస్ పార్టీకి గాని మద్దతిస్తే కాంగ్రెస్ చాలా సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో గాని, ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో గాని ఎక్కడా ఎంఐఎం కాంగ్రెస్ ని గెలిపించే ప్రయత్నాలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నాలు గాని చేయలేదు. పైగా అనేక రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ తన అభ్యర్థులను పోటీకి దింపి అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ఓటర్లను చీల్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల వైపు మరలకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది.

అందుకే మజ్లిస్ పార్టీ బిజెపికి బీ టీమ్ అని దేశవ్యాప్తంగా ఒక ప్రచారం కూడా ఉంది. దానికి మజ్లిస్ నాయకులు ఎన్ని ఖండనలు చేసినప్పటికీ లాభం లేదు. ఆ విమర్శను ఎదుర్కోవడానికి వాళ్ళు తమను తాము సరిదిద్దుకున్నట్టు చూపించే దాఖలాలు కూడా లేవు. మరి తెలంగాణ (Telangana)లో అధికార బీఆర్ఎస్ పార్టీకి, మజ్లిస్ పార్టీ నాయకులకు గట్టి బంధమే కొనసాగుతోంది. అది ఈనాటి బంధం కాదు. ఒకవేళ కాంగ్రెస్ కి తమ మద్దతు అవసరమైనా, మజ్లిస్ పార్టీ ముందుకు వచ్చి హస్తం పార్టీతో హస్తం కలుపుతుందా దోస్తీ కుదురుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అలా జరగడానికి అవకాశం తక్కువ. రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రతి ఆరోపణలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల అనంతరం పొత్తు కుదురుతుందని కూడా ఇప్పుడు చెప్పలేము. కానీ మతతత్వ విధానాలకు, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న విషయం తెలిసిందే.

Also Read:  AP High Court : 30కు చేరిన ఏపీ న్యాయమూర్తుల సంఖ్య

రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ఎంత సఫలం అయిందో మనకు తెలుసు. విద్వేష బజారులో తాము ప్రేమ దుకాణం తెరుస్తామని రాహుల్ గాంధీ గొప్ప నినాదంతో దేశమంతా తిరిగాడు. మైనారిటీల అస్తిత్వానికి పెను ప్రమాదంగా మారే అనేక విధానాలను అమలు జరుపుతున్న బిజెపికి పరోక్షంగా మజ్లిస్ వారు మద్దతిస్తారా, లేక బిజెపికి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా అనేది ఎన్నికల తర్వాత వరకు వేచి చూడాల్సిందే.

ఇకపోతే అధికార బీఆర్ఎస్ తో తమకున్న గట్టి బంధం రీత్యా మజిలీస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలబడవచ్చు. కానీ బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు మజ్లిస్ పార్టీ సీట్లతో కలుపుకున్నా పూర్తి మెజార్టీ రాకపోతే, అనివార్యంగా బీఆర్ఎస్, బిజెపి వైపు చూడొచ్చు. బిజెపి కోరుకుంటున్నది కూడా అదే. కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు. తాము అధికారంలోకి రాకపోయినా, బీఆర్ఎస్ ని నిలబెట్టాలనేది బిజెపి అంతరాత్మలో అట్టడుగున ఉన్న ఆకాంక్ష అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ప్రజల ముందు పెడుతూనే ఉంది. బిజెపికి నువ్వు బీ టీమ్ అంటే నువ్వు బీ టీ మంచి అని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. కానీ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పటికి అన్ని శత్రుత్వాలూ పక్కకు వెళ్లిపోతాయి. పాత శత్రువులు కొత్త మిత్రులవుతారు.

పాత మిత్రులు కొత్త శత్రువులవుతారు. ఇవి అందరికీ తెలిసిందే. కానీ బీఆర్ఎస్, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వానికి అవసరమైన మద్దతును మజ్లిస్ పార్టీ అందజేసే అవకాశం ఉంటుందా? బీజేపీ అనుసరించే విధానాలకు మజిలీస్ పార్టీ పూర్తి వ్యతిరేకం కదా, అలాంటప్పుడు బిజెపి ఉన్న ప్రభుత్వంలో మజ్లిస్ కలవడం సాధ్యమా? కాదు. అప్పుడు మజిలిస్ పార్టీ ముందున్న ఆప్షన్, బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వానికి వెలుపల నుండి మద్దతునివ్వడం. అలా చేసిన మజ్లిస్ పార్టీ సొంత మైనారిటీ ప్రజల నుండే తీవ్రమైన వ్యతిరేకతను చవిచూసే ప్రమాదం ఉంది. మరి అప్పుడు మజ్లిస్ ఏం చేస్తుంది? అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, లేదంటే బీఆర్ఎస్, బిజెపికి మద్దతు ఇవ్వాలి. అది కాదంటే తటస్థంగా ఉండిపోవాలి. అప్పుడు ఏ పక్షానికి ఎక్కువ మంది అభ్యర్థుల మద్దతు ఉంటుందో వారికి కావలసిన 60 సంఖ్య లేకపోయినా, అధిక సంఖ్యాబలం ఉన్న పక్షానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ కల్పించవచ్చు.

అది మైనారిటీ ప్రభుత్వమవుతుంది. ఇవన్నీ ఊహాగానాలే. ఎన్నికలకు ఇంకా 40 రోజులు సుదీర్ఘ సమయం ఉంది. ఎవరి బొమ్మ ఎటు తిరుగుతుందో ఇప్పుడు ఎవరూ ఊహించలేం. ప్రస్తుతానికి హంగ్ (Hung) వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అంచనాలే అంతటా వినిపిస్తున్నాయి. ఎవరి బలాబలాలకు తగినట్టు వారి ప్రయత్నాలు చేసుకుంటారు కానీ హంగ్ (Hung) అసెంబ్లీ ఏర్పడితే ఏం చేయాలనే విషయం మీద కూడా మరోవైపు నాయకులు మంతనాలు సాగించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఏది ఏమైనా పిక్చర్ లో క్లారిటీ కోసం మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది.

Also Read:  YCP vs JSP : అవ‌నిగడ్డలో కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌.. నేడు బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ – జ‌న‌సేన‌