KCR Politics : ‘ఫ్రంట్’లో ‘ఉపరాష్ట్ర‌ప‌తి’ ప‌ద‌వి స్టంట్‌?

తెలంగాణ సీఎం కేసీఆర్ వేసే ఎత్తుగ‌డ‌లు ఒక మాత్రాన అర్థం కావు. పైకి వినిపించే ఆయ‌న మాట‌ల‌కు, లోప‌ల ఆయ‌న ర‌చించే వ్యూహాల‌కు పొంత‌న ఉండ‌దు.

  • Written By:
  • Updated On - February 24, 2022 / 02:57 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ వేసే ఎత్తుగ‌డ‌లు ఒక మాత్రాన అర్థం కావు. పైకి వినిపించే ఆయ‌న మాట‌ల‌కు, లోప‌ల ఆయ‌న ర‌చించే వ్యూహాల‌కు పొంత‌న ఉండ‌దు. ఆయ‌న అడుగుతీసి అడుగు వేసారంటే..ఏదో వ్యూహం ఉన్న‌ట్టే భావించాలి. ఇక ఢిల్లీ వెళుతున్నారంటే..ఎవ‌రూ ఊహించ‌ని ఎత్తుగ‌డ‌ల‌తో వెళుతున్నార‌ని అర్థం చేసుకోవాలి. ఎంపీగా ఉన్న‌ప్పుడు పార్ల‌మెంట్ కు ఆయ‌న హాజ‌రైన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. తెలంగాణ ఉద్య‌మ నాయ‌కునిగా ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ‌లు దేశ వ్యాప్తంగా ఉండే పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకొచ్చాయి. కేవ‌లం ఇద్ద‌రు ఎంపీల‌తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘ‌న‌డు కేసీఆర్‌.నాలుగు నెల‌ల క్రితం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ నెల రోజుల పాటు అక్క‌డే ఉన్నాడు. ఆ త‌రువాత 15 రోజుల పాటు హ‌స్తిన‌లోనే పాగా వేశాడు. వెనువెంట‌నే మూడు రోజులు ఢిల్లీ వెళ్లి వ‌చ్చాడు. వ‌రుస‌గా ఢిల్లీ వెళ్లిన సంద‌ర్భంగా ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. సోష‌ల్ మీడియాలో ఆ ప్ర‌చారం ఊపందుకున్న క్ర‌మంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చాడు. కాంగ్రెస్, బీజేయేత‌ర ఫ్రంట్ దేశానికి అవ‌స‌ర‌మ‌నే నినాదాన్ని తీసుకొచ్చాడు. దాన్ని మ‌రింత బ‌లంగా వినిపించ‌డానికి శుక్ర‌వారం మ‌రోసారి ఢిల్లీకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధం అయ్యాడు.

కేసీఆర్ మాదిరిగా ఢిల్లీ పీఠాన్ని ఆశిస్తోన్న వాళ్ల‌లో ప్ర‌ధ‌మంగా బెంగాల్ సీఎం మ‌మ‌త ఉంది. ఆ త‌రువాత ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్‌, కేజ్రీవాల్, స్టాలిన్ త‌దితరులు ఉన్నారు. వాళ్లంద‌రి కంటే ఎంపీల బ‌లం కేసీఆర్ కు చాలా తక్కువ‌. ఈసారి ఎన్నిక‌ల్లో ఇప్పుడున్న‌ తొమ్మిది మంది ఎంపీల బలం కూడా ఉంటుందో..ఉండ‌దో తెలియదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న కాంగ్రెస్‌, బీజేయేత‌ర ఫ్రంట్ అంటూ ఎత్తుగ‌డ వేస్తున్నాడు. ఇదంతా పైకి క‌నిపిస్తోన్న ఆయ‌న ఎత్తుగ‌డ మాత్ర‌మే. కానీ, ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం లోలోన వ్యూహాలు ర‌చిస్తున్నాడ‌ని ఆంత‌రంగీకుల నుంచి వినిపిస్తోన్న వినికిడి.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వులను ఏక‌గ్రీవం చేసుకోవ‌డం ఎన్డీయేకు క‌ష్ట‌త‌రం. ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా బీజేపీ వైపు ఉంటే మిన‌హా ఏక‌గ్రీవం అసాధ్యం. వివిధ ర‌కాల స‌ర్వేల ద్వారా బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాల‌ను సాధించ‌లేక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. అందుకే, కేసీఆర్ ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌ను ర‌చిస్తున్నాడు. బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే నాయ‌కునిగా ఢిల్లీ స్థాయిలో ఫోక‌స్ పెడుతున్నాడు. దీంతో ఇప్ప‌టికే బీజేపీ వ్య‌తిరేక పార్టీలు కేసీఆర్ వెంట ర్యాలీ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌హారాష్ట్ర వెళ్లిన కేసీఆర్ అక్క‌డి ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్‌, శివ‌సేన అధిప‌తి ఉద్ధ‌వ్ థాక‌రే మ‌ద్ధ‌తును ప్రాథ‌మికంగా కూడ‌గ‌ట్టుకున్నాడు. కానీ, కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ సాధ్యంకాద‌ని వాళ్లు వినిపిస్తున్నారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ కు మాత్రం అండ‌గా ఉంటామ‌ని వాళ్లు చెబుతున్నారు.

ఇక శుక్ర‌వారం ఢిల్లీ వెళ్ల‌నున్న కేసీఆర్ బీజేపీయేత‌ర పార్టీల నేత‌ల‌తో సాన్నిహిత్యం పెంచుకునే ప్ర‌య‌త్నం చేయ‌నున్నాడు. ప్ర‌ధానంగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, బెంగాల్ సీఎం మ‌మ‌త మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నం చేయ‌డానికి అవ‌కాశం ఉంది. పైకి ఫ్రంట్ అంటోన్న కేసీఆర్ ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అవ‌స‌ర‌మైన మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టేందుకు బీజేపీయేత‌ర స్లోగ‌న్ అందుకున్నాడ‌ని ఆయ‌న గురించి బాగా తెలిసిన లీడ‌ర్లు ప‌సిగ‌డుతున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి ఇటీవ‌ల మ‌ద్ధ‌తుగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ పుట్టుక‌పై మాట్లాడిని హ‌ర్యానా సీఎంపై కేసీఆర్ ఫైర్ అయ్యాడు. రాహుల్ ఇటీవ‌ల చేసిన ప్ర‌సంగాల‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నాడు. ఇవ‌న్నీ చూస్తూంటే కేసీఆర్ పైకి చెబుతోన్న ఫ్రంట్ కంటే కూడా ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం అంటూ భావిస్తోన్న వాళ్లు లేక‌పోలేదు.రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కోసం ఎలక్టోరల్ కాలేజీలలో ఉభయ సభలకు చెందిన 776 మంది ఎంపీలు ఉంటారు. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,120 మంది ఎమ్మెల్యేలు ఓట‌ర్లుగా ఉంటారు. మొత్తంగా ఎలక్టోరల్ కాలేజీలో 1,098,903 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి కావాలంటే క‌నీసం 549,452 ఓట్లను సంపాదించాలి. ఆయా రాష్ట్రాల్లోని ఓట్ల‌ విలువ విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 83,824 ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలుసు. ఎన్టీయే, యూపీయేత‌ర పార్టీలు క‌లిసి అభ్య‌ర్థిని నిలిపితే విప‌క్ష శిబిరంలోని ఓట్లు చీలిపోయే ప్ర‌మాదం ఉంది. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు చేతులు కలిపి ఉమ్మడి అభ్యర్థిని పెట్టినట్లయితే యూపీఏలో విభేదాలు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఫ‌లితంగా బిజెపి నిలిపే అభ్యర్థి గెలిచే అవ‌కాశం మెండుగా ఉంటుంది. అలా కాకుండా అబ్దుల్ కలాం లేదా ప్రతిభా పాటిల్ వంటి అభ్యర్థులను ఎన్టీయే గుర్తిస్తే ఈజీగా గెలుపు సాధ్యం అవుతుంది. ఆ త‌ర‌హా జాబితాలోకి వెళ్లడానికి కేసీఆర్ వ్యూహాల‌ను ర‌చిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలు మరియు మహారాష్ట్రలో 200 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అంటే, దాదాపు సగం ఎలక్టోరల్ కాలేజీలు రాష్ట్రపతి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నికలలో కీలకం కాగలవు. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఏకాభిప్రాయ అభ్యర్థి కోసం వెతకాల్సిన అవసరం ఉన్నందున బిజెపికి స‌వాల్ గా మారే అవ‌కాశం ఉంది. ఒకవేళ ఐదు రాష్ట్రాల్లో బిజెపికి తగినన్ని సీట్లు వస్తే రాజ్యసభలో దాని స్థానం అంత ఘోరంగా మారకపోతే, బిజెపియేతర పార్టీలు ఏమి చేయ‌లేవు. అలా కాకుండా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితాలు బీజేపీకి రాక‌పోతే, ఏకాభిప్రాయ అభ్య‌ర్థిగా కేసీఆర్ పేరు వ‌చ్చేలా ఆయ‌న వ్యూహాల‌ను ర‌చిస్తున్నాడ‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గాల గుస‌గుస‌.ఈ ఏడాది జూన్ లేదా జూలైలో జరగనున్న భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలపై ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు ప్రభావం ఉంటుంది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో బీజేపీకి 150 సీట్లకు మించి రాకపోవచ్చని ప్రతిపక్షాల అంచ‌నా. యూపీతో సహా ఐదు రాష్ట్రాల్లో కనీసం మూడింటిలోనైనా బీజేపీ అధికారంలోకి రాలేకపోతే, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది. ఈ నేపథ్యంలో యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్లమెంటు ఉభయ సభలు మరియు అసెంబ్లీలలో ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన‌ ఎలక్టోరల్ కళాశాల ద్వారా రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. అందుకే, ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రాధాన్యం ఉంది.

ద‌క్షిణ భార‌త దేశం నుంచి రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వుల్లో ఏదో ఒక‌టి ఉండే అవ‌కాశం ఉంది. ఈసారి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి రేసులో గులాంన‌బీ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ ప‌ట్టుబ‌డితే, అద్వానీకి కూడా ఛాన్స్ ఉండే అవకాశం లేక‌పోలేదు. ఇక ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని ద‌క్షిణ భార‌త దేశానికి ఇస్తే ప్ర‌ధమంగా కేసీఆర్ పేరు వినిపించేలా ఆయ‌న ఫోక‌స్ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి కేసీఆర్ అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌క‌టిస్తే.. ఏపీ, త‌మిళ‌నాడు, బెంగాల్‌, మ‌హారాష్ట్ర సీఎంలు మ‌ద్ధ‌తు ప‌లుకుతార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపిస్తోన్న ముఖ‌చిత్రం. రేసులోకి నితీష్ కూడా వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది. సో..కేసీఆర్ పైకి చెబుతోన్న కాంగ్రెస్‌,బీజేపీయేత‌ర ఫ్రంట్ వెనుక ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం వ్యూహం ఉంద‌న్న దానిపై స‌న్నిహిత వర్గాలు చ‌ర్చంచుకుంటున్న దాన్లో ఎంత నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌బోతుందన్న‌మాట‌.