BRS Party : `విషం, విద్వేషాల` న‌డుమ కేసీఆర్ మ‌నుగ‌డ

`ప్ర‌జ‌లు మోసం పోయే వ‌ర‌కు మోసం చేస్తూనే ఉంటాం. వాళ్లకు న‌చ్చేలా మోస‌పు మాట‌లు చెప్ప‌క త‌ప్ప‌దు.

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 01:10 PM IST

`ప్ర‌జ‌లు మోసం పోయే వ‌ర‌కు మోసం చేస్తూనే ఉంటాం. వాళ్లకు న‌చ్చేలా మోస‌పు మాట‌లు చెప్ప‌క త‌ప్ప‌దు. ఎవ‌రూ సొంత ఆస్తులు అమ్మి ప్ర‌జ‌ల‌కు పెట్టారు. ప్ర‌జ‌ల సొమ్మును దోచుకోవ‌డం మామూలే.` అంటూ ఒకానొక సంద‌ర్భంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇవే మాట‌ల్ని సీఎం కేసీఆర్ కు అన్వయిస్తే స‌రిగ్గా స‌రిపోతాయి. ఎందుకంటే, ఒక‌ప్పుడు విషం, విద్వేషం నింప‌డం ద్వారా ప్ర‌జ‌ల భావోద్వేగాలను ఓట్ల రూపంలో మ‌లుచుకుని రెండుసార్లు కేసీఆర్ సీఎం అయ్యారు. ఇప్పుడు అవే `విషం, విద్వేషం` ప‌దాల‌ను బీజేపీపై ప్ర‌యోగించ‌డం ద్వారా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

స‌రిగ్గా రెండు ద‌శాబ్దాల‌ క్రితం కేసీఆర్ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని చేప‌ట్టారు. ఆనాడు ఆంధ్రోళ్ల మీద విషం, విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టారు. ఉమ్మ‌డి ఏపీలో అస‌హ‌నానికి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ద్వారా బీజం వేశారు. ఆనాటి నుంచి వీలున్న‌ప్పుడ‌ల్లా ఆంధ్రోళ్ల‌ను త‌రిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు. వాళ్ల మీద విషం క‌క్కారు. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చ‌గొట్టారు. ఆ క్ర‌మంలో ప‌లు చోట్ల అభంశుభం తెలియ‌ని అమాయ‌కులు ఎంద‌రో బ‌లయ్యారు. ఆస్తులను భారీగా న‌ష్ట‌పోయిన వాళ్లు ఉన్నారు. తెలంగాణ‌లో వ్యాపారాలు చేసుకోవ‌డానికి అనువైన ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో ఆంధ్రోళ్లు వాళ్ల రాష్ట్రానికి చాలా మంది వెళ్లిపోయారు. విధిలేని ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో ఉండిపోయిన వాళ్ల‌పై ఆనాడు జ‌రిగిన దాడులు అనేకం. కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ చాలా సంఘ‌ట‌న‌లు బ‌య‌ట‌కు రాలేదు. అదే విషం, విద్వేషాన్ని రెచ్చ‌గొట్ట‌డం ద్వారా 2014, 2018 ఎన్నిక‌ల్లో సీఎంగా కేసీఆర్ ప‌ద‌విని అధిరోహించారు. ఆర్థికంగా ఎవ‌రూ ఊహించ‌లేని స్థితికి ఆయ‌న చేరార‌ని ప్ర‌త్య‌ర్థులు చెప్పే మాట‌.

ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిధులు దేశంలోని ఏ పార్టీకి లేవు. ఒక‌ప్పుడు స్కూట‌ర్ మీద తిరిగే కేసీఆర్ ప్ర‌త్యేక విమానం కొనుగోలు చేయ‌డం వ‌ర‌కు ఎదిగారని ప్ర‌త్య‌ర్థులు చెబుతున్నారు. దాదాపు అన్ని రంగాల‌పై ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గం తెలంగాణ వ్యాప్తంగా పెత్త‌నం చేస్తోంది. మీడియా సింహ‌భాగం ఆయ‌న చేతిలోనే ఉంది. రియ‌ల్ ఎస్టేట్‌, నిర్మాణ‌, వైద్య‌, విద్య‌, రాజ‌కీయ‌, మీడియా ఇలా అన్ని రంగాలు ఆయ‌న‌ సొంత సామాజిక‌వ‌ర్గం చేతిలోకి వెళ్లేలా ఎనిమిదేళ్ల కేసీఆర్ పాల‌న ఉంద‌ని సామాజికవేత్త‌లు ప‌లు వేదిక‌ల‌పై ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా పుష్టిగా ఉన్న కేసీఆర్ దేశ వ్యాప్తంగా పార్టీని విస్త‌రింప చేయాల‌ని స‌రికొత్త ఎత్తుగ‌డ ప‌న్నారు. దానికి తెలంగాణ రోల్ మోడ‌ల్ ను చూపిస్తూ ప్ర‌త్యేక ఎజెండాను రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు.

ప్ర‌స్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌మాజంలో విషం, విద్వేషం నింపుతోంద‌ని ప్ర‌ధానంగా కేసీఆర్ చేస్తోన్న ఆరోప‌ణ‌. సమాజాన్ని చీల్చే ప్ర‌య‌త్నం చేస్తున్న మోడీ స‌ర్కార్ ను దింపాల‌ని చెబుతున్నారు. స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీలు ఏవైనా విషం, విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డాన్ని ఇటీవ‌ల చూస్తున్నాం. ఆ విష‌యంలో కేసీఆర్ అంద‌వేసిన చేయిగా ఉన్నారు. హిందూ భావ‌జాలాన్ని వినిపిస్తోన్న బీజేపీ ఇత‌ర మ‌తాల‌ను కించ‌ప‌రిచిన సంఘ‌ట‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ ఆ పార్టీ అగ్ర‌నేత‌లు మోడీ, అమిత్ షా త‌దిత‌రులు ఎప్పుడూ విషం, విద్వేషాన్ని నింపేలా మాట్లాడ‌లేదు. కానీ, కేసీఆర్ ఆంధ్రోళ్ల‌పై నేరుగా విషం, విద్వేషాన్ని ర‌గిల్చారు. ఇప్పుడు ఆ అస్త్రాల‌ను రివ‌ర్స్ లో బీజేపీ మీద ప్ర‌యోగించ‌డం విచిత్రం. ఆయ‌న ఏది చెబితే అది విన్న తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌హాలో దేశ వ్యాప్తంగా ఉండే వాళ్లు వింటారా? అనేది ఇప్పుడు వినిపిస్తోన్న పెద్ద ప్ర‌శ్న‌.