Telangana: కాంగ్రెస్సే టార్గెట్.. బీఆర్ఎస్ పక్కా వ్యూహం

తెలంగాణలో ఎవరి మధ్య ప్రధానంగా పోటీ జరగబోతుందనేది అందరికీ స్పష్టమైపోయింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల్లో తలపడి గెలవాల్సింది కాంగ్రెస్ తోనే. ఒకటి కాదు, రెండు కాదు, అనేకానేక సర్వేలు చెబుతున్న సత్యం ఇదే. మరి పరిస్థితి ఇలా ఉంటే, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది?

డా. ప్రసాదమూర్తి

Telangana: తెలంగాణలో ఎవరి మధ్య ప్రధానంగా పోటీ జరగబోతుందనేది అందరికీ స్పష్టమైపోయింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల్లో తలపడి గెలవాల్సింది కాంగ్రెస్ తోనే. ఒకటి కాదు, రెండు కాదు, అనేకానేక సర్వేలు చెబుతున్న సత్యం ఇదే. మరి పరిస్థితి ఇలా ఉంటే, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది? కాగల కార్యం ఓటర్లే తీర్చుతారని బీఆర్ఎస్ నిమ్మళంగా ఉంటుందని చెప్పలేం. గత పదేళ్ళుగా తాము అమలు చేస్తున్న పథకాలకు, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు మెజారిటీ ప్రజల ఆమోదముద్ర లభిస్తుందని బీఆర్ఎస్ నాయకులు ధీమాగా కూర్చోగలరా? కూర్చోలేరు. అందుకే బీఆర్ఎస్ చాలా పకడ్బందీగా పక్కా వ్యూహంతో ఓటర్లను తన వైపు మళ్లించుకునే అసలు పథకాలు రచించింది.

ఎప్పుడో ఆగస్టులోనే తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసి మిగిలిన పార్టీలకంటే తాను ఎంతో ముందు ఉన్నట్టు నిరూపించుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి రెండూ చాలా వెనుకబడి ఉన్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ మొత్తం నియోజకవర్గాల్లో ఒక దశ ప్రచారం ముగించింది. ఈ విషయంలో కూడా మిగిలిన రెండు పక్షాలూ వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక పక్కా వ్యూహాన్ని రచించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసింది. దానికి ఒక ఇన్ ఛార్జిని నియమించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి 100 ఓటర్లకు ఒక పోల్ మేనేజర్ ఉంటాడు. సర్వేలు చెబుతున్నది ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్నదనే. కాబట్టి తాము ఇన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వ్యతిరేకత ఎందుకు ఉన్నది? ఓటర్ మదిలో ఉన్నది ఈ మేనేజర్ తెలుసుకుని, ప్రభుత్వం చేసినది, చేయబోతున్నది వివరించి, ఓటరు మనసు మార్చడానికి ప్రయత్నం చేయడమే.

2018లో తాము ఘన విజయం సాధించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో చాలా ఎదురుదెబ్బ తిన్నారు. నాలుగు సీట్లు బిజెపికి, మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. తొమ్మిది సీట్లతో బిఆర్ఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018 లో సాధించిన విజయం ధీమాతో ఒక ఏడాదిలోపే ఘోరమైన దెబ్బ తినాల్సి వచ్చింది. అది ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది.. ఆ తప్పు మరోసారి ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలనేదే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఇప్పుడు ప్రతి 100 ఓటర్లకి ఒక పోల్ మేనేజర్ ని నియమించి. దాదాపు 3 లక్షల మందిని రంగంలోకి దింపింది.

ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది అన్న విషయం అర్థమైంది. తర్వాత ఆ వ్యతిరేకతను తమ అనుకూలతగా మార్చుకోవడానికి బీఆర్ఎస్ తన శక్తియుక్తులన్నీ వినియోగిస్తోంది. అభ్యర్థులను ప్రకటించడంలో, ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో, కాంగ్రెస్ ని మించి పథకాలను ప్రకటించడంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ముందుంది. ఇక ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా చాలా ముందున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో బీఆర్ఎస్ ఎంత విజయం సాధిస్తుంది అనేది ఎన్నికల ఫలితాలు చెబుతాయి. అయితే అధికార బీఆర్ఎస్ కి గట్టి పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఈ ప్రయత్నాలను ఎలా ఎదుర్కొంటుంది, బీఆర్ఎస్ కంటే పై చేయి ఎలా సాధిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్నికల్లో వాగ్దానాలు, మేనిఫెస్టోలో పథకాలు, ఒక ఎత్తు అయితే పోల్ మేనేజ్మెంట్ అనేది మరొక ఎత్తు. ఈ విషయంలో బీఆర్ఎస్ బాగా ముందుకు దూసుకుపోతోంది. ప్రతి 100 ఓటర్లకి ఒక వ్యక్తిని నియమించడం అంటే ఆ ప్రభావాన్ని అంత తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. చూడాలి, ఏ ప్రయత్నాలు ఏ విజయానికి దోహదం చేస్తాయో.

Also Read: Whats Today : టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ.. ఇంద్రకీలాద్రిపై రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం