BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్

  • Written By:
  • Updated On - April 8, 2024 / 02:58 PM IST

BRS: కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతుల(Farmers)కు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది. ఈ యాసంగి సీజన్‌లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే, రైతులు కన్నీరు కారుస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగునీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్న దారుణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీళ్లు ఇంకిపోతే.. రైతు కండ్లల్లో మాత్రం కన్నీటిధారలు పారుతున్నాయి. గత యాసంగి మాదిరిగానే మంచి పంట చేతికొస్తదని, పైసలొస్తాయని భావించిన రైతులకు సాగు పెట్టుబడులు మీదపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందులతో అప్పులపాలయ్యే దుర్భర పరిస్థితులు దాపురించాయి.

ఈ యాసంగి సీజన్‌లో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 67.55 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి 51.71 లక్షల ఎకరాల్లో సాగైంది. మొత్తం సాగైన పంటలో ఇప్పటికే సుమారు 15 నుంచి 20 శాతం పంటలు ఎండిపోగా మరింత విస్తీర్ణంలో ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఎస్సారెస్పీ పరిధిలో కాలువ, బోర్లు కలిపితే సుమారు 20 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. సాగర్‌ ఎడమ కాలువ కింద 6 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు నీటి వనరుల పరిధిలోనే 30 నుంచి 40 శాతం పంటలు ఎండపోయినట్టు అంచనా. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి ఇప్పటివరకు సుమారు 15 లక్షల ఎకరాల వరకు ఎండిపోయినట్టు సమాచారం. సాగునీటి కొరతతోపాటు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలు కూడా రైతులకు నష్టాలే మిగిల్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పంటల కారణంగా రైతులకు సుమారు రూ.3,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. దున్నకం, నాటు కూలీలు, ఎరువులు, విత్తనాలు, కలుపు మందు ఇలా అన్నీ కలిపి ఒక ఎకరం వరి సాగుకు రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. ఈ దశలో పంటలు ఎండిపోవడంతో వరి కోతలు, ఆ తర్వాత ఖర్చులు మినహాయిస్తే ఎకరానికి కనీసంగా రూ.20 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో జరిగిన నష్టానికి రూ.3 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. మే మొదటివారం వరకు సాగునీటి కొరత తీవ్రమైతే మరింత విస్తీర్ణంలో పంటల నష్టంవాటిల్లే ప్రమాదమున్నదని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా.

Read Also: CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?