Site icon HashtagU Telugu

Chinese Apps Ban: మరో 232 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం

Voice And SMS Packs

Voice And SMS Packs

చైనా యాప్‌లపై (Chinese Apps) ప్రభుత్వం మరోసారి డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. చైనా లింక్‌లతో కూడిన 200 కంటే ఎక్కువ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఈ యాప్‌లలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ చైనీస్ లింక్డ్ యాప్‌లను తక్షణ, అత్యవసర ప్రాతిపదికన నిషేధించే, బ్లాక్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి సమాచారం వచ్చింది. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. చైనాతో సంబంధాలున్న ఈ యాప్స్‌ ప్రజలను అప్పుల ఊబిలోకి దించడంతో పాటు గూఢచర్య సాధనాలుగా మారే ఆస్కారం కూడా ఉన్నందున కేంద్రం చర్యలు తీసుకుంటుంది.

నివేదిక ప్రకారం.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరు నెలల క్రితం 288 చైనీస్ లోన్ యాప్‌లను పర్యవేక్షించడం ప్రారంభించింది. వీటిలో 94 యాప్‌లు యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని థర్డ్ పార్టీ లింక్‌ల ద్వారా పని చేస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ యాప్‌లను బ్లాక్ చేయమని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY)ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ వారం ఆదేశించింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లను బ్లాక్ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

Also Read: Adani Wealth: పది రోజుల్లోనే అదానీ సంపద రూ. 9 లక్షల కోట్లు అవుట్!

తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర నిఘా సంస్థలు ఈ యాప్‌లపై చర్య తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేశాయి. ఈ చైనీస్ లింక్‌లను కలిగి ఉన్న 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు తక్షణ, అత్యవసర ప్రాతిపదికన నిషేధించబడ్డాయి. లోన్ యాప్‌లు ఎలాంటి పత్రాలు లేకుండా, KYC లేకుండా రుణాన్ని అందిస్తాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఈ యాప్‌ల నుండి రుణాలు తీసుకోవడం అత్యంత సులభమైన, వేగవంతమైన ప్రక్రియగా భావిస్తారు. ప్రజలు వాటి బారిన పడుతున్నారు. అప్పుల బాధలు, బ్లాక్‌మెయిల్‌లతో చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

Exit mobile version