Site icon HashtagU Telugu

KCR Strategy : కేసిఆర్ మౌనవ్యూహం ఏమిటి?

What Is Kcr Silence Strategy

What Is Kcr's Silence Strategy

By: డా. ప్రసాదమూర్తి

KCR Silence Strategy : దేశమంతా ప్రతిపక్ష పార్టీలు ఏకమై, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఐక్యంగా ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. కానీ బిజెపిని తాను తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ నాయకుడిగా నిన్న మొన్నటి వరకు ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా ప్రకటనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏమైపోయారు? దేశమంతా సాగుతున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఐక్యతా ప్రయత్నాల పట్ల ఆయన ఎందుకింత మౌనంగా ఉన్నారు? అదే ఇప్పుడు రకరకాల ఊహాగానాలకు తావిస్తున్నది.

కేసిఆర్ (KCR) అనేక విషయాల పట్ల మౌనమే తన వ్యూహంగా పాటిస్తున్నట్టు అర్థమవుతోంది. బిజెపిని గద్దె దింపడమే తన లక్ష్యం అన్నట్టు ఒకప్పుడు గర్జించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకింత మౌనంగా ఉన్నారు? కేవలం ప్రతిపక్షాల ఐక్యతా ప్రయత్నాల పట్ల మాత్రమే కాదు, కేంద్రంలోని బిజెపి తీసుకొస్తున్న అనేక బిల్లులను కూడా ఆయన సమర్థించిన తీరు ఇట్లాంటి అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు తాజాగా బిజెపి చర్చకు పెట్టిన ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం పట్ల కూడా కేసిఆర్ నోరు మెదపడం లేదు.

ఒకే దేశం ఒకే ఎన్నిక దుమారం దేశమంతా చాలా రేగిన ఈ సందర్భంలో KCR గుంభనంగా వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రతిపాదనను సమర్థిస్తున్నట్టుగా అనుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల ఎన్నికలు, కేంద్రం ఎన్నికలతో పాటు జమిలిగా జరపాలన్న ప్రతిపాదనను కేసీఆర్ ఇంతకుముందే ఆమోదించారని, లా కమిషన్ కు ఆయన తన అంగీకారాన్ని తెలుపుతూ రాసిన లెటర్ ని కూడా రేవంత్ మీడియాకు చూపించారు. రేవంత్ వాదన ప్రకారం కేసీఆర్ బిజెపితో రానున్న ఎన్నికలలో పరోక్షంగానో లేదా అంత అవసరమైతే ప్రత్యక్షంగానో పొత్తు కొనసాగించే అవకాశం ఉందని అర్థమవుతుంది.

రాష్ట్ర ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో తన వ్యతిరేకత పట్ల ప్రజల దృష్టి మళ్ళుతుందని, జాతీయమైన అంశాలు మాత్రమే ఎన్నికలలో ప్రధానంగా ముందుకు వస్తాయని, అప్పుడు బిజెపి మాత్రమే ఓటర్ల దృష్టిలో ఉంటుందని, అలా జరిగితే వాతావరణం రాష్ట్ర ప్రభుత్వం పని విధానం మీద అనుకూలంగా మారే అవకాశాలు ఉండవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సి-ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు కొంత ఎడ్జ్ కనిపిస్తోంది. ఎటు తిరిగి పరిణామాలు ఎలా సంభవించినా, బిజెపితో సంబంధాలు చెడగొట్టుకోవడం రాజకీయ పరిణతి అనిపించుకోదని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు. ఒకవేళ సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి ఎదురు దెబ్బ తగిలినా ఆ పార్టీ తెలంగాణలో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం అయితే ఉంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ రాకపోతే, రాష్ట్రంలో ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు అనివార్యంగా బీఆర్ఎస్ కు బిజెపి మద్దతు అవసరం అవుతుంది.

ఒకపక్క కాంగ్రెస్ మాంచి దూకుడుగా ఉంది. అసలే కర్ణాటక విజయంతో కాంగ్రెస్ నేతలు, త్వరలో జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్ చత్తీస్ గఢ్, తెలంగాణలో విజయం మాదే అని తొడలు కొడుతున్నారు. పరిస్థితి విషమించి తమకు మెజారిటీ తగ్గినా తగ్గవచ్చు. అలాంటి సమయంలో బిజెపితో కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణి పాటించి లోపాయికారి ఒప్పందం చేసుకుంటే మంచిదని KCR భావిస్తున్నట్టుగా ఆయన మౌనంలో అంతరార్థం అనుకోవాలి. కేసీఆర్ తో పరోక్ష బంధం లేదా ప్రత్యక్ష బంధం బిజెపికి కూడా అవసరమే. ఒకపక్క దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రంలో తమకు ప్రభుత్వం ఏర్పరచడానికి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే అప్పుడు దక్షిణాది పార్టీలవైపు చేతులు చాచాల్సిన అగత్యం బిజెపికి రావచ్చు. అలాంటి సమయంలో కేసీఆర్ ఎంపీల మద్దతు ఎంతైనా అవసరం.

ఇలా అనేకానేక కారణాల రీత్యా కేసీఆర్ బిజెపి పట్ల మెతక వైఖరిని, బిజెపి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మౌన ధారణ పాటిస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇదే అదను చూసి రేవంత్, కేసీఆర్ మీద దాడి తీవ్రం చేశారు. కేసీఆర్, బిజెపి అంతర్గత బంధాన్ని బట్టబయలు చేసి బిజెపి వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరిగితే కేసీఆర్ అనుకున్నట్టు ఆయనకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. కాలం బెడిసికొట్టి బిజెపి వ్యతిరేకత, కేసీఆర్ మీదకు కూడా మళ్లి, అది కేసీఆర్ కు ప్రాణ సంకటంగా మారే ప్రమాదం కూడా ఉంది. మరి కేసిఆర్ ఈ మౌనాన్ని ఎన్నికల వరకు కొనసాగిస్తారా, లేక మధ్యలోనే మౌనం వీడి మరో కొత్త వ్యూహాన్ని రచిస్తారా చూడాలి.

Also Read:  Madhya Pradesh Politics : మధ్యప్రదేశ్ లో అసలేం జరుగుతోంది?