El Nino Explained : దడపుట్టిస్తున్న ఎల్ నినో.. దేశానికి కరువు గండం ?

El Nino Explained : ఇది "ఎల్ నినో" ఏడాది..అందుకే జూన్ వచ్చినా ఎండలు దంచి కొడుతున్నాయి..  వానల జాడ లేదు..ఈ ఏడాది ఇండియాలో 1991 నాటి కరువు పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని "స్కైమెట్" అంచనా వేసింది. 

  • Written By:
  • Updated On - June 18, 2023 / 07:50 AM IST

El Nino Explained : ఇది “ఎల్ నినో” ఏడాది..

అందుకే జూన్ వచ్చినా ఎండలు దంచి కొడుతున్నాయి..  వానల జాడ లేదు..

ఈ ఏడాది ఇండియాలో 1991 నాటి కరువు పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని “స్కైమెట్” అంచనా వేసింది. 

రుతుపవనాలు కూడా ఆలస్యంగా జూన్ 8న కేరళకు చేరాయి..

వడదెబ్బతో ఎన్నో మరణాలు సంభావిస్తున్నాయి. 

ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో గత గురు, శుక్రవారాల్లో వడదెబ్బకు 34 మంది చనిపోయారు.   

ఆ 2 రోజుల్లో అక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అంతకంటే ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్న చోట్లలో ఇంకెన్ని మరణాలు సంభవిస్తున్నాయో మనం అంచనా వేసుకోవచ్చు.

ఇలాంటి దుర్భర వాతావరణ పరిస్థితికి కారణం.. “ఎల్‌నినో”

ఎల్ నినో Vs లా నినా

ఎల్ నినో.. ఇది ఒక స్పానిష్ భాషా పదం. దీని అర్ధం బాల యేసు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్ నినో వాతావరణ పరిస్ధితి అనేది డిసెంబర్ లో కీలక దశకు చేరుతుంది.. క్రీస్తు పుట్టిన రోజు కూడా డిసెంబర్ లోనే వస్తుంది. అందుకే క్రిస్టమస్ పండుగను సూచిస్తూ ఆ  వాతావరణ పరిస్ధితికి  ఎల్ నినో  అనే పేరు పెట్టారు. ఎల్ నినో అనేది ప్రతి 3 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఎల్ నినోతో పాటు మనం తెలుసుకోవాల్సిన మరో అంశం “లా నినా”. ఇది కూడా స్పానిష్ పదమే. ఇంగ్లీష్ లో దీని అర్ధం ‘ద గర్ల్’.  ఎల్ నినో కు(El Nino Explained) పూర్తి  విరుద్ధంగా లా నినా వాతావరణ పరిస్థితి ఉంటుంది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్ నినో, లా నినాలకు కారణం అవుతాయని అంచనా.

పసిఫిక్ మహాసముద్రంలో అలా..  

సాధారణంగానైతే పసిఫిక్ మహాసముద్రంలో గాలులు భూమధ్యరేఖ నుంచి పశ్చిమం వైపుగా వీస్తాయి. అలా జరగడం వల్ల దక్షిణ అమెరికా వైపు నుంచి వెచ్చని సముద్ర జలాలు ఆసియా ఖండం వైపు నెట్టబడతాయి. దీంతో సముద్రపు లోతుల నుంచి చల్లటి నీరు పైకి ఉబికి వచ్చి.. వెచ్చని సముద్ర జలాలు ఖాళీ అయిపోయిన ప్రదేశాన్ని నింపుతాయి. ఈ ప్రాసెస్ ను అప్‌వెల్లింగ్ అంటారు. ఇదంతా నార్మల్ గా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ప్రక్రియ. అయితే దీన్ని ఎల్ నినో, లా నినాల రూపంలో చోటుచేసుకునే వాతావరణ మార్పులు  నెగెటివ్ గా ఎఫెక్ట్ చేస్తాయి.

ఇండియాకు ఎల్ నినో మంచిదా ? లా నినా మంచిదా ?

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎల్ నినో అంటే వర్షాలు సరిగ్గా కురవక ఏర్పడే కరువు పరిస్ధితి.  లా నినా అంటే విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితి.  పసిఫిక్ మహాసముద్రంలో “లా నినా” సంభవిస్తే మన దేశానికి అది మంచి సూచన. ఒకవేళ  ఎల్ నినో చోటుచేసుకుంటే.. జూన్- అక్టోబర్ నెలల మధ్య మన దేశంలో రుతుపవనాలు ప్రభావితమవుతాయి. లేట్ అవుతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే.  ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఈ ఎల్ నినో ఎఫెక్ట్ తో మనకు చలికాలం  కూడా వెచ్చగా అనిపిస్తుంది. వర్షాలు లేట్ అయిపోయి..  వేసవి కాలం మరింత వేడిగా మారుతుంది. రుతుపవనాలు ఆలస్యం అవుతాయి.. వీక్ అవుతాయి.. గత 20 ఏళ్లలో సంభవించిన కరువులన్నీ ఎల్‌నినో సంవత్సరాల్లోనే చోటుచేసుకున్నాయి. ఇది కూడా ఎల్ నినో ఏడాదే. దీంతో ఈసారి కూడా దాని ఎఫెక్ట్ తో వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. గత 65 ఏళ్లలో 14 సార్లు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడింది.  అయితే 9 సార్లు భారతదేశంలో పెద్ద ఎత్తున కరువు వచ్చింది. 5 సార్లు మనదేశంలో కరువు వచ్చినా.. ఎల్ నినో ప్రభావం  స్వల్పంగానే పడింది.