TSRTC Merger Bill : అయ్యో…ఆర్టీసీ (RTC) విలీనం బిల్లు లేనట్లేనా..?

ఈరోజు తో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 11:26 AM IST

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించటం లేదు అనే సామెత ఇప్పుడు TSRTC విలీన బిల్లుకు వర్తిస్తుంది. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఈ బిల్లు ను మంత్రి మండలి ఆమోదించినప్పటికీ..గవర్నర్ మాత్రం పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని పెండింగ్ లో పెట్టింది. దీంతో అసెంబ్లీ సమావేశాలలో.. ఆర్టీసీ బిల్లుపై చర్చ లేకుండానే ముగుస్తున్నట్లు తెలుస్తుంది.

ఈరోజు తో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి. చివరి రోజైన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. దీనిఫై సీఎం కేసీఆర్ దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించనున్నారు. నిన్న (శనివారం) శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన ఐదు బిల్లులను ఈరోజు శాసనమండలిలో ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించనున్నారు. వీటిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) యాక్ట్‌-2023, ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వర్గాల కమిషన్‌ (సవరణ) బిల్లు, గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్‌ యాక్ట్‌ రెండో సవరణ బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న TSRTC విలీన బిల్లు మాత్రం అలాగే పెండింగ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గవర్నర్‌ ఇంకా ఆమోదం తెలపకపోవడంతో..ఆర్టీసీ బిల్లుపై చర్చ లేదని సమాచారం. ఆర్టీసీ విలీన బిల్లు ఫై గవర్నర్ సంతకం పెట్టాలని శనివారం ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున రాజ్ ముట్టడికి ట్రై చేయడం తో గవర్నర్ దీనిపై స్పందించింది. ఉద్యోగుల కోసమే కొన్ని అంశాల్లో స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నానని..అందుకే ఇంకా బిల్లు ఫై సంతకం పెట్టలేదని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

1. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉంది. ఈ దృష్ట్యా కేంద్రం సమ్మతి పొందారా? లేదా? కేంద్రం అనుమతి ఉంటే ఆ కాపీని పంపండి. లేదంటే చట్టబద్ధత పాటించేలా రాష్ట్రం తీసుకున్న చర్యలను తెలపండి.

2. ఉద్యోగుల సంఖ్య, కేటగిరీలు, డిపోల వారీగా వర్గీకరించిన మొత్తం శాశ్వత ఉద్యోగుల సంఖ్యను అందించండి. కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ లేదా ఏదైనా ఇతర ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూడా ఇవ్వండి

3. నాన్‌-పర్మనెంట్‌ ఉద్యోగుల కోసం ఉన్న వ్యవస్థ ఏమిటి?. పర్మినెంట్‌ కాని ఉద్యోగుల వివరాలు సమర్పించండి.

4. కార్పొరేషన్‌ స్థిర, చర ఆస్తులు కార్పొరేషన్‌లోనే కొనసాగుతాయా లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ప్రత్యేకించి కార్పొరేషన్‌ భూములు, భవనాల సంగతి ఏమిటి?

5. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అవుతారు కాబట్టి బస్సుల నిర్వహణలో వారికి డ్యూటీలు వేయడాన్ని ఎవరు నియంత్రిస్తారు.? ప్రయాణికులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్‌ పాత్ర ఏమిటనేది స్పష్టంగా చెప్పాలి. ఉద్యోగులు డిప్యూటేషన్‌పై మళ్లీ కార్పొరేషన్‌లో పని చేస్తారా లేదా మరేదైనా ఇతర ఏర్పాట్లు ఉన్నాయా?.

6. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో చేరాక డిప్యూటేషన్‌పై లేదా ఇతర ఏ పద్ధతిలో కార్పొరేషన్‌లో కొనసాగిస్తారో స్పష్టం చేయాలి. వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వండి. మీరిచ్చే వివరాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని గవర్నర్ ప్రశ్నించగా..ప్రభుత్వం మాత్రం.. ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత అన్ని ఇతర అంశాల్లో చట్టపరంగా వెళ్లామని తెలిపింది.

ఆర్టీసీ చట్టం 1950లోని నిబంధనల ప్రకారం కార్పొరేషన్‌ బోర్డు టీఎ్‌సఆర్టీసీకి అపెక్స్‌ బాడీగా కొనసాగుతుంది. విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్పొరేషన్‌ స్వభావం మారదు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను సమర్పించిన తర్వాత, విభజనకు సంబంధించిన అంశాలు భారత ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి..

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత పారిశ్రామిక వివాదాల చట్టంలోని నిబంధనల ప్రకారం వ్యవహరిస్తాం. ప్రతిపాదిత బిల్లులో దీనికి సంబంధించి ఎలాంటి నిబంధన అవసరం లేదు. ఉద్యోగుల ప్రయోజనాలు ప్రభుత్వంలో విలీనంతో మరింత మెరుగవుతాయి. ప్రతిపాదిత బిల్లులోని ప్రధాన అంశాలలో ఇది ఒకటి.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పెన్షన్‌, ఇతర నిబంధనలకు సంబంధించి ప్రతిపాదిత బిల్లులో అస్పష్టత లేదు. ఈ విషయాలపై ప్రభుత్వం దృష్టిసారించే వరకు, వాటాదారులతో చర్చించిన తర్వాత, ఆర్టీసీ ఉద్యోగులను నియంత్రించే ప్రస్తుత నియమ నిబంధనలు వర్తిస్తాయి.

ప్రతిపాదిత బిల్లులోని సెక్షన్‌ 4, 5 అటువంటి విషయాలపై నిర్ణయం తీసుకోవడానికి అనుమతించే నిబంధనలను కలిగి ఉంది. జీతాలు, అలవెన్సుల విషయంలో ఏ ఉద్యోగి ఇబ్బందులకు గురికారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న వివిధ కేడర్‌లను కొనసాగించడానికి ఏ అడ్డంకీ లేదని తెలిపింది. మరి ఒకవేళ ఈరోజు ఏమైనా గవర్నర్ సంతకం పెడితే..సోమవారం తిరిగి అసెంబ్లీ పెట్టి బిల్లును ఏమైనా ఆమోదిస్తారేమో చూడాలి.

Read Also : Hyderabad: ఎయిర్ పోర్టులో 1.12 కోట్ల విలువైన బంగారం పట్టివేత