Dr. Sarvepalli Radhakrishnan Birthday Special : దేశం గర్వించిన టీచర్

సెప్టెంబర్ 5 అనగానే అందరికి గుర్తుంచేది డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan) పుట్టిన రోజు.

  • Written By:
  • Updated On - September 5, 2023 / 11:10 AM IST

September 5, 2023 Dr. Sarvepalli Radhakrishnan Birthday Special : సెప్టెంబర్ 5 అనగానే అందరికి గుర్తుంచేది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు. ఈయన పుట్టిన రోజున దేశమంతా టీచర్స్ డే గా జరుపుకుంటారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సొంతం (Dr. Sarvepalli Radhakrishnan). అయితే, రాష్ట్రపతిగా కంటే తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. భారత మాజీ రాష్ట్రపతి, ‘భారతరత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5న ఆయన గౌరవార్థం 1962 నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

రాధాకృష్ణన్ బాల్యం – విద్య (Sarvepalli Radhakrishnan) :

వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి మహోన్నతుడు. పువ్వ పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రఙ్ఞా పాటవాలను ప్రదర్శించిన డాక్టర్ సర్వేపల్లి.. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు. గురువులకే గురువుగా ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆయన.. 1888 సెప్టెంబరు 5 న తెలుగుదంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు.

రాధాకృష్ణన్ బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతిలో సాగింది. హైస్కూల్ విద్య కోసం రాధాకృష్ణన్ వేలూరులోని వూర్హీస్ కాలేజీలో చేరాడు. ఎఫ్.ఏ (ఫస్ట్ ఆఫ్ ఆర్ట్స్) తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత రాధాకృష్ణన్ 16 సంవత్సరాల వయస్సులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ( మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది) చేరాడు. అతను 1907 లో అక్కడ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను అదే కళాశాల నుండి తన మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు.

సర్వేపల్లి “ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిసపోజిషన్స్” :

రాధాకృష్ణన్ తాను విద్యాభ్యసనలో ఎంచుకునే విషయాల కంటే యాదృచ్ఛికంగా తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు. ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థి కావడంతో, అదే కళాశాలలో పట్టభద్రుడైన బంధువు రాధాకృష్ణన్‌కు తన తత్వశాస్త్ర పాఠ్యపుస్తకాలను అందించినప్పుడు, అది అతని విద్యా కోర్సు తత్త్వశాస్త్రంగా స్వయంచాలకంగా నిర్ణయించబడింది. సర్వేపల్లి “ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిసపోజిషన్స్” అనే అంశంపై తన బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ రాశాడు. ఇది “వేదాంత వ్యవస్థలో నైతికతకు చోటు లేదనే ఆరోపణలకు సమాధానంగా ఉద్దేశించబడింది.” అతనికి బోధించే ఇద్దరు ప్రొఫెసర్లు, రెవ్. విలియం మెస్టన్, డాక్టర్ ఆల్ఫ్రెడ్ జార్జ్ హాగ్ లు రాధాకృష్ణన్ చేసిన ప్రవచనాన్ని మెచ్చుకున్నారు. రాధాకృష్ణన్ థీసిస్ కేవలం ఇరవై సంవత్సరాల వయస్సులో ప్రచురించబడింది. రాధాకృష్ణన్ “భారతీయ సంస్కృతికి సంబంధించిన హాగ్ తో పాటు ఇతర క్రైస్తవ ఉపాధ్యాయుల విమర్శలు నా విశ్వాసానికి భంగం కలిగించాయి. నేను ఆశ్రయించిన సాంప్రదాయక ఆధారాలను కదిలించాయి.” అని తెలిపాడు.

రాధాకృష్ణన్ వివాహం :

రాధాకృష్ణన్ మే 1903లో 10 సంవత్సరాల వయస్సు గల శివకామమ్మ (1893–1956) తో తన 16 వ యేట వివాహం జరిగింది . ఆ దంపతులకు పద్మావతి, రుక్మిణి, సుశీల, సుందరి, శకుంతల అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారికి సర్వేపల్లి గోపాల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతను చరిత్రకారుడిగా చెప్పుకోదగిన వృత్తిని కొనసాగించాడు.

రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు, అతని మనుమలు, మనుమరాళ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా అకాడెమియా, పబ్లిక్ పాలసీ, మెడిసిన్, లా, బ్యాంకింగ్, బిజినెస్, పబ్లిషింగ్, ఇతర రంగాలలో విస్తృతమైన వృత్తులను అభ్యసించారు. భారత మాజీ క్రికెటర్‌ వీ.వీ.ఎస్‌. లక్ష్మణ్‌ ఆయన మేనల్లుడు. శివకాము 1956 నవంబర్ 26న మరణించింది. అప్పటికి వారి వివాహమై దాదాపు 53 సంవత్సరాలు అయింది.

సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) గొప్ప ప్రొఫెసర్‌గా…

కోల్‌కతా యూనివర్సిటీలోని కింగ్‌ జార్జ్‌ వి చైర్‌ ఆఫ్‌ మెంటల్‌ అండ్‌ మోరల్‌ సైన్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్‌గా 1921 నుంచి 1935 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 1936 నుంచి 1952 వరకు పనిచేయడం విశేషం. ఆయన ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తూ పలువురి ప్రశంసలనందుకున్నారు.

ఆయన ప్రతిభకుగాను నైట్‌హుడ్‌(1931), భారతరత్న (1954), ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ (1963) అవార్డులను అందజేశారు. ఇక 1909లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. అనంతరం మైసూర్‌ యూనివర్సిటీ వేదాంతం ప్రొఫెసర్‌గా అతన్ని నియమించింది.

ఈ సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్‌ ద క్వెస్ట్‌, జర్నల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆప్‌ ఎథిక్స్‌కు ఎన్నో ఆర్టికల్స్‌ రాశారు. ఆయన తొలిసారిగా ‘ది ఫిలాసఫి ఆఫ్‌ రవీంద్రనాథ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్‌ ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్‌ ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు.

1939లో పండిత్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య బనారస్‌ హిందూ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా చేయాలని రాధాకృష్ణన్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్‌ బనారస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్‌ రాధాకృష్ణన్‌ యునెస్కోలో ఇండియా ప్రతినిధిగా 1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతో పేరుతెచ్చుకున్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) చేపట్టిన పదవులు చూస్తే..

  • మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
  • 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
  • 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
  • 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
  • 1929లో, ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు “తులనాత్మక మతము”(Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
  • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
  • 1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు
    విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
  • 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కులపతిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
  • 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
  • 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
  • 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
  • 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
  • 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
  • 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.

రాధాకృష్ణన్ రచనలు..

  • The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక తలంపు)(1908) – ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
  • The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వము)(1918).
  • The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి)(1920).
  • Indian Philosophy (భారతీయ తత్వము)(2 సంపుటాలు) (1923 మరియు 1927).
  • The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణము)(1926).
  • The Religion We Need (మనకు కావలిసిన మతము)(1928).
  • Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు)(1929).
  • An Idealist View of Life (ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము)(1932).
  • East and West in Religion (ప్రాక్‌ పశ్చిమాలలో మతము)(1933).
  • Freedom and Culture (స్వాతంత్ర్యం మరియు సంస్కృతి)(1936).
  • The Heart of Hindusthan (భారతీయ హృదయము)(1936).
  • My Search for Truth (Autobiography)(నా సత్యశోధన(ఆత్మకధ))(1937).
  • Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు)(1938).
  • Eastern Religions and Western Thought (తూర్పు మతాలు మరియు పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
  • Mahatma Gandhi (మహాత్మా గాంధీ)(1939).
  • India and China (భారత దేశము మరియు చైనా)(1944).
  • Education, Politics and War (విద్య, రాజకీయం మరియు యుద్దము)(1944).
  • Is this Peace (ఇది శాంతేనా)(1945).
  • The Religion and Society (మతము మరియు సంఘము)(1947).
  • The Bhagwadgita (భగవధ్గీత)(1948).
  • Great Indians (భారతీయ మహానీయులు)(1949).
  • East and West: Some Reflections (తూర్పు మరియు పడమర: కొన్ని చింతనలు)(1955).
  • Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము)(1967).

రాష్ట్రపతిగా సర్వేపల్లి..

1962లో బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్యపాశ్చాత్వ తత్వశాస్త్రాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన ఛలోక్తులు, హాస్యం అందరినీ కట్టి పడేసేవి.

ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో సత్కరించింది. 1967లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ గడిపారు. 1975 ఏప్రిల్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు.

సర్వేపల్లి ప్రత్యేకతలు ఎన్నో..

  • రాధాకృష్ణన్‌ అద్వైత వేదాంతి. శంకరుల మాయావాదాన్ని యథాతథంగా స్వీకరించలేదు. తన సొంత భాష్యం రాశారు. ఆయన రచనలు హిందూ ధర్మానికి పునరుద్దీపన కలిగించాయి. దార్శనిక శాస్త్రాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచిన ఘనత సర్వేపల్లికే దక్కుతుంది.
  • సర్వేపల్లి గొప్ప మానవతావాది. ప్రతి మానవుడూ అతడి మతమేదైనా, సాంఘిక స్థితిగతులేమైనా పరమేశ్వరుడి రూపంలో పుట్టినవాడే అని నమ్మేవారు. ప్రతి మనిషీ ఆ ఈశ్వరుడికి ప్రియపుత్రుడిగా రాణించగల నిగూఢ శక్తులతో జన్మించినవాడేనని ఆయన అభిప్రాయం.
  • సర్వేపల్లి దృష్టిలో మతం అంటే – శక్తి, సంపదల కోసం కాకుండా.. శాంతి కోసం, సత్యం కోసం నిత్యాన్వేషణ.
  • మతం అనేది సర్వసంగ పరిత్యాగం, ప్రారబ్ధానికి తలొగ్గడమూ కాదు. ధీరోదాత్తంగా సాగిపోవడమే మతం.
  • ప్రస్థాన త్రయానికి ఆంగ్లంలో ఆధునిక దృష్టితో భాష్యం రాశారు సర్వేపల్లి. సోక్రటీస్‌ మొదలుకొని పాశ్చాత్య దార్శనికవేత్తల వరకు అందరి రచనలూ ఆయనకు కంఠోపాఠమే.
  • భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్‌ చదివారు సర్వేపల్లి. ఖురాన్‌ ఆయనకు కొట్టిన పిండి. సూఫీ తత్వాన్నీ మధించారు.
  • సర్వమతాలవారూ ఇతర మతాల పట్ల విశాలమైన, ఉదారమైన దృక్పథాన్ని అవలంబించాలని సర్వేపల్లి ప్రబోధించారు. ఎవరైనా ఇతర మతాలను, సంస్కృతులను విమర్శించడాన్ని ఆయన అంగీకరించేవారు కారు.
    మతం కాలానుగుణంగా మార్పు చెందుతుందన్న విషయం మరచిపోరాదని రాధాకృష్ణన్‌ అనేవారు. ఉపనిషత్తుల ఉపదేశాలు, బుద్ధుడి బోధనలు, గీతా సందేశం ప్రాతిపదికగా జాతీయ జీవనాన్ని తిరిగి నిర్మించుకోవాలని సందేశం ఇచ్చారు.
  • సమాజంలో పండితులేగాని నిజమైన తత్వవేత్తలు కనిపించడం లేదని, సృజనాత్మకత కొరవడిందని సర్వేపల్లి ఆవేదన వ్యక్తం చేసేవారు. వారసత్వ సంపద ఎవరినీ మానసిక దాస్యానికి గురిచేయకూడదని మన మహర్షులు కూడా హితవు పలికారని.. అలా వారు నూతన సత్యాలు కనుగొనడానికి, అలాంటి పరిష్కారాలనే సూచించడానికి ఆసక్తి కనబరిచారని వివరించారు.
  • తత్వవేత్తలుగా ప్రసిద్ధి చెందినవారెవరూ రాధాకృష్ణన్‌ పనిచేసినన్ని రంగాల్లో ప్రవేశించి ఉండరు. ఆయన పాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు. అన్నింటినీ మించి.. ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా వ్యవహరించగలిగిన ప్రజ్ఞాధురీణుడు.
  • తత్వశాస్త్రాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయించడమే కాకుండా ప్రపంచమంతటికీ వర్తింపజేసిన మేటి రాధాకృష్ణన్‌. ఆయన పర్యటించని ప్రదేశం లేదు. ఆయనను గౌరవించని స్థలం లేదు.

Also Read:  Teachers Day : ఆచార్య దేవోభవ.. గురువుకు జై