Site icon HashtagU Telugu

Space Elevator : ఆకాశానికి లిఫ్ట్.. భూమి నుంచి ఉపగ్రహం వరకూ కేబుల్

Space Elevator

Space Elevator

Space Elevator : ఆకాశానికి నిచ్చెన వేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అదేనండీ స్పేస్ లిఫ్టును రెడీ చేస్తామని ప్రఖ్యాత జపాన్ కంపెనీ ఒబయాషీ కార్పొరేషన్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచే దీనికి సంబంధించిన పనులను ప్రారంభించడానికి ప్రణాళికలు రచిస్తోంది. 2050 నాటికి పనులు పూర్తిచేయాలని ఒబయాషీ కంపెనీ యోచిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ టవర్‌‌ ‘టోక్యో స్కైట్రీ’‌ని ఈ కంపెనీయే కట్టింది. ఒకవేళ స్పేస్ లిఫ్టు అందుబాటులోకి వస్తే చాలా ఈజీగా, చౌక ధరతోనే అంతరిక్షంలోని మనుషులను, సరుకులను పంపొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

భూమి నుంచి ఉపగ్రహం వరకూ కేబుల్‌

స్పేస్‌ ఎలివేటర్‌(Space Elevator)  నిర్మాణంలో భాగంగా భూమి నుంచి అంతరిక్షంలోని భూస్థిర కక్ష్యలో ఉన్న ఉపగ్రహం వరకూ కేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం భూమి నుంచి 96వేల కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్ష లిఫ్ట్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తారు.  భూమధ్యరేఖా ప్రాంతంలో సముద్రంలో ‘ఎర్త్‌ పోర్ట్‌’ను ఏర్పాటు చేస్తారు. అంతరిక్ష లిఫ్ట్‌ కేబుల్‌ సాయంతో క్లైంబర్‌ అనే విద్యుదయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్లడం, కిందికి రావడం చేస్తాయి. వాటిలో మానవులు ప్రయాణించొచ్చు. ఈ కేబుల్‌ వెంబడి 36వేల కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్‌ను నిర్మిస్తారు. సందర్శకులు అక్కడికి వెళ్లి.. శూన్య గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విశ్వాన్ని సరదాగా చూసి రావచ్చు.  అక్కడి నుంచి భూస్థిర కక్ష్య ఉపగ్రహాలను కూడా ప్రయోగించొచ్చు. ఈ లిఫ్ట్‌ సాయంతో భూస్థిర కక్ష్యలో సౌర విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును భూమికి పంపొచ్చు.

Also Read :Hajj Pilgrims : 550 మందికిపైగా హజ్ యాత్రికులు మృతి

అంతరిక్ష యాత్రల ఖర్చు తగ్గిపోతుంది

స్పేస్‌ ఎలివేటర్లలో విద్యుదయస్కాంత వాహనాలే ఉంటాయి. సౌర విద్యుత్‌తోనూ వీటిని నడపొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న అంతరిక్ష యాత్రల వల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా జరుగుతోంది. స్పేస్ ఎలివేటర్లతో ఆ రిస్క్ ఉండదు. స్పేస్ ఎలివేటర్ వచ్చాక అంతరిక్ష యాత్రల ధరలు కూడా  తగ్గుతాయి.  ప్రస్తుతం ఫాల్కన్‌ 9 వ్యోమనౌకతో పౌండు (0.45 కిలోలు) బరువును అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు 1,227 డాలర్లను స్పేస్‌ఎక్స్‌ వసూలు చేస్తోంది. స్పేస్‌ ఎలివేటర్‌ రాకతో ఆ ఖర్చు  57 డాలర్లకు దిగి వస్తుంది.  స్పేస్‌ ఎలివేటర్‌.. రాకెట్‌ కన్నా నెమ్మదిగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. అందువల్ల ఈ ప్రయాణంలో ప్రకంపనలు, కుదుపులు ఉండవు.

Also Read : Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’

అంత ఈజీ కాదు

స్పేస్‌ ఎలివేటర్‌ ప్రాజెక్టును పూర్తి చేయడం అంత ఈజీ కాదు. 96వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్‌ను తయారుచేయడమే పెద్ద సవాల్‌. అది తేలిగ్గా, దృఢంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు, తుపాన్లు, తీవ్ర వాతావరణ పరిస్థితులు, అంతరిక్ష శకలాలను తట్టుకునేలా ఎలివేటర్‌ను, దాని కేబుల్‌ను తయారు చేయాలి. లేదంటే దాని మనుగడ కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు.