Credit Card: క్రెడిట్ కార్డుకు అప్లై చేసేందుకు ఫ్రీగా ఫోన్ ఇచ్చాడు.. కట్ చేస్తే 7 లక్షలు కాజేశాడు

అతడొక సైబర్ మోసగాడు.. పేరు సౌరభ్ శర్మ..కానీ తాను బ్యాంకు ఉద్యోగిని అంటూ మహారాష్ట్రలోని పన్వెల్ టౌన్ కు చెందిన ఒక మహిళకు పరిచయం చేసుకున్నాడు.

అతడొక సైబర్ మోసగాడు.. పేరు సౌరభ్ శర్మ..కానీ తాను బ్యాంకు ఉద్యోగిని అంటూ మహారాష్ట్రలోని పన్వెల్ టౌన్ కు చెందిన ఒక మహిళకు పరిచయం చేసుకున్నాడు. మీ దగ్గర ఇప్పటికే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ (Credit Card) ఉన్నాయని అడిగాడు. వాటి క్రెడిట్ లిమిట్ ఎంత అని అడిగాడు. మీరు మా క్రెడిట్ కార్డు తీసుకుంటే ముంబైలోని ప్రముఖ స్పోర్ట్స్ క్లబ్‌లో ఉచిత సభ్యత్వం లభిస్తుందని నమ్మించాడు. దీంతో కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆ మహిళ అంగీకరించింది.వెంటనే ఆ మోసగాడు ఒక లింక్ ను పంపించాడు. ఆ లింక్ ను క్లిక్ చేసి ఆ మహిళ తన పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ను నింపింది. “మా క్రెడిట్ కార్డు (Credit Card) తీసుకుంటున్నందుకు మీకు సెల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తున్నాం. మీరు ఆ కొత్త ఫోన్ నుంచే క్రెడిట్ కార్డును వాడాలి. మీ యాపిల్ ఫోన్ సిమ్ ను కొత్త ఫోన్ లో వేసుకోవాల్సి ఉంటుంది” అని చెప్పాడు.

దీంతో ఆ మహిళ సరే అని చెప్పింది. అదే రోజు సాయంత్రం కల్లా కొత్త సెల్ ఫోన్ ను సైబర్ మోసగాడు ఆమె ఇంటికి పంపించాడు. వెంటనే ఆ మహిళ అందులో సిమ్ ఇన్సర్ట్ చేసి .. అతడు పంపిన లింక్స్ క్లిక్ చేసి.. OTPలు, PINలు ఎంటర్ చేస్తూ కొత్త క్రెడిట్ కార్డ్స్ అప్లికేషను ప్రాసెస్ లో ముందుకు వెళుతోంది. ఈక్రమంలో ఆమెకు రెండు మెసేజ్ లు వచ్చాయి. వాటిని చూసి షాక్ అయ్యింది. ఆమెకు చెందిన ఒక క్రెడిట్ కార్డు నుంచి రూ.4.50 లక్షలు, మరో క్రెడిట్ కార్డు నుంచి రూ.2.50 లక్షలు కట్ కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. బెంగళూరులోని ఓ బ్రాండెడ్ జ్యువెలరీ షాపులో తన రెండు క్రెడిట్ కార్డుల నుంచి కొనుగోళ్లు చేసినట్లు ఆమెకు మెసేజ్‌లు వచ్చాయి. ఆ మహిళ గుండెలు బాదుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె క్రెడిట్ కార్డ్స్ లోని డబ్బులు కొట్టేసేందుకు సైబర్ మోసగాడు ఆ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో ముందుగా 2 యాప్స్ ఇన్‌స్టాల్ చేశాడని పోలీసులు గుర్తించారు. DOT సెక్యూర్ మరియు సెక్యూర్ ఎన్వాయ్ ఆథెంటికేటర్ అనే యాప్స్ ద్వారా ఫోన్ లోని సిమ్ ను, మెసేజ్ లను కంట్రోల్ చేసి క్రెడిట్ కార్డులోని డబ్బులు కాజేశాడు జనవరి 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఐపీసీ 419, 420, ఐటీ చట్టంలోని 66(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.“బ్యాంక్ వివరాలు లేదా పిన్ నంబర్‌లను డిమాండ్ చేయడానికి ఏ బ్యాంకు లేదా సంస్థకు అధికారం లేదని ప్రజలు తెలుసుకోవాలి. దురదృష్టవశాత్తు, విద్యావంతులు ఆన్‌లైన్ మోసాల బారిన పడి లక్షల రూపాయలను కోల్పోతున్నారు ”అని డిసిపి సైబర్ క్రైమ్, బాల్సింగ్ రాజ్‌పుత్ వివరించారు.

Also Read:  Chess Board Station: చెస్ బోర్డ్ లా కనిపించే రైల్వే స్టేషన్ ను మీరు ఎప్పుడైనా చూసారా!