Apple Fruit: ఆపిల్ చరిత్ర మీకు తెలుసా?

ఆపిల్ పండు అంటే ఎర్రగా, దోరగా, నునుపుగా చూస్తేనే కసుక్కున కొరికేయాలన్నంత అందంగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - April 17, 2022 / 06:30 PM IST

ఆపిల్ పండు అంటే ఎర్రగా, దోరగా, నునుపుగా చూస్తేనే కసుక్కున కొరికేయాలన్నంత అందంగా ఉంటుంది. అందుకే ఎవరైనా చిన్నపిల్లలు అందంగా ఉంటే.. ఆపిల్ పండులా ఉన్నావే అంటుంటారు. కానీ అలాంటి ఆపిల్ కు తొలుత ఈ రంగు కాని, రుచి కాని, ఆకారం కాని ఉండేవి కావట. పైగా వాటి పుట్టినిల్లు కూడా ఏ అమెరికానో, బ్రిటనో కాదు. వాటి నిజమైన పుట్టిల్లు కజకిస్తాన్ లోని తియాన్ షెన్ కొండలు. కెనడా శాస్త్రవేత్తల పరిశోధనలో ఇలాంటి నిజాలు చాలా వెలుగుచూశాయి. ఆపిల్ పుట్టిల్లు గురించి తెలిస్తే.. అక్కడ ఆ పండ్లు తొలుత ఎలా ఉండేవి.. ఎలా పండేవి అన్న ప్రశ్నలు ఒకదాని వెంట మరొకటి వచ్చేస్తాయి. నిజం చెప్పాలంటే ఆపిల్ పుట్టిన తొలినాళ్లలో చిన్న సైజులో ఉండేది. పైగా ఇప్పటిలా తియ్యగా కాని, పుల్లగా కాని ఉండేది కాదు. బాగా చేదుగా ఉండేది. అప్పటి నుంచి వేల సంవత్సరాలపాటు దాని సాగులో చాలా పద్దతులు మార్చి చూశారు. ఆ పండు ఆకారం, రుచి, రంగు, వాసన.. ఇలాంటి వాటన్నింటిలోనూ చాలా ప్రయోగాలు చేశారు. దానివల్లే ఇప్పుడున్న ఆపిల్ తయారైంది.

కజకిస్తాన్ లోని అతి పెద్ద నగరం ఏది అంటే.. అల్మాటీ అని చెబుతాను. దాని పేరు నుంచి యాపిల్ కు ఆ పేరు వచ్చింది. అల్మాటీ అంటే కజక్ భాషలో యాపిల్ కొండ అనే అర్థం ఉంది. ఇక యాపిల్ చరిత్ర ఎప్పుడు మొదలైందీ అంటే.. లాంగ్ లాంగ్ ఎగో అని చెప్పాలి. అంటే గత ఐదువేల ఏళ్ల కింది నుంచి ఇది సాగులో ఉంది. అప్పట్లో దీని విత్తనాలు ఆసియాకు సరఫరా అయ్యింది సిల్క్ రూటు ద్వారానే. ఆ తరువాత ప్రపంచమంతటికీ చేరాయి. అప్పట్లో ఈ పండ్లు చేదుగా ఉండేవి. కజకిస్తాన్ కొండల్లో యాపిల్ చెట్లు చాలా సహజంగా పెరుగుతాయి. వాటికి అక్కడున్న వాతావరణం కరెక్టుగా సరిపోతుంది. కాకపోతే ఆ పండ్లు చిన్నవిగా, చేదుగా, ఇంకా చెప్పాలంటే ఆమ్ల స్వభావంతో ఉంటాయి.

అడవి జాతి ఆపిల్స్ తో పోల్చి చూస్తే.. ఇప్పుడున్న ఆపిల్స్ బరువు 3.6 రెట్లు ఎక్కువ. ఆమ్లత్వం కూడా 43 శాతం తక్కువుంటుంది. చేదు గుణానికి కారణంగా చెప్పే ఫినోలిక్ కాంపౌండ్ కూడా 68 శాతం తగ్గిపోయింది. పైగా గత రెండు శతాబ్దాల్లో టెక్నాలజీని ఉపయోగించి ఆపిల్ లో కొత్తరకాలను తయారుచేశారు. ఎక్కువకాలం నిలువ ఉండేలా, తీపి శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి అడవి జాతి ఆపిల్స్ కు, ఇప్పుడున్న ఆపిల్స్ కు అసలు ఎందులోనూ పోలిక లేదు. బహుశా వీటి ఆకారం, రుచి, రంగు.. ఇలా లేకపోతే.. ఆపిల్ ను ఎవరూ ఇష్టపడేవారు కాదేమో!