World Chess Olympiad:ప్రపంచ చెస్ ఒలింపియాడ్ కు చెన్నైనే ఎందుకు వేదికగా చేశారు?

మన దేశంలో చదరంగం అంటే చెన్నై. దీనికి తిరుగులేదంతే. అందుకే ప్రతిష్టాత్మక 44వ చెస్ ఒలింపియాడ్ కు చెన్నైని వేదికగా ఖరారు చేశారు.

  • Written By:
  • Updated On - July 26, 2022 / 12:57 PM IST

మన దేశంలో చదరంగం అంటే చెన్నై. దీనికి తిరుగులేదంతే. అందుకే ప్రతిష్టాత్మక 44వ చెస్ ఒలింపియాడ్ కు చెన్నైని వేదికగా ఖరారు చేశారు. దీనిని ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. విదేశాల నుంచి కూడా ఆటగాళ్లు రావడానికి కారణం.. వారంతా చెన్నైని ఇష్టపడడమే. ఇంతకీ ఇంతటి ప్రతిష్టాత్మక టోర్నీకి చెన్నైనే ఎందుకు ఎంపిక చేశారు?

చెన్నైలోనే ఈ ఒలింపియాడ్ ను ఏర్పాటు చేయడానికి కారణం.. దేశంలో ఉన్న గ్రాండ్ మాస్టర్లలో 40 శాతం మంది తమిళనాడు రాష్ట్రం నుంచే ఉన్నారు. అందులో కేవలం చెన్నై నుంచి చూసినా 25 మంది ఉన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చెస్ లో చెన్నై పేరు మారుమ్రోగుతుంది. మన దేశంలో చెస్ రంగంలో తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఆయన ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా గెలిచారు. అలాంటి ఆనంద్ కూడా చెన్నైకి చెందినవారే.

తమిళనాడులో స్వాతంత్ర్యానికి ముందు నుంచి చెస్ ఆటగాళ్లు ఉన్నారు. అందుకే 1947లోనే తమిళనాడు చెస్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. దీని కృషితో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చెస్ క్లబ్బులు ఏర్పాటయ్యాయి. మద్రాస్ చెస్ క్లబ్ ఏర్పాటయ్యాక ఈ గేమ్ ఇంకా ఎక్కువమంది చేరింది. అలా 2018 నాటికి తమిళనాడులో చెర్ టోర్నీల్లో పాల్గోవాలని కోరుకునేవారు దాదాపు 12 వేల మంది ఉన్నారు. వీరికోసం ఇప్పటికే 200 టోర్నీలను నిర్వహించారు. దీనివల్లే రాష్ట్రంలో చెస్ అకాడమీలు కూడా ఎక్కువయ్యాయి.

చెన్నైలో చెస్ ఒలింపియాడ్ ను నిర్వహించడం ఇదే తొలిసారి. అందుకే చెన్నై పేరు ప్రపంచంలో నిలిచిపోతుంది. 2013లో మన దేశంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ జరిగింది. ఇప్పుడు దానికి మించిన టోర్నీకి చెన్నై వేదికైంది. మన దేశం నుంచి చెస్ లో తొలి అంతర్జాతీయ మాస్టర్ టైటిల్ ను గెలిచిన మాన్యుయేల్ ఆరోన్, తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, మహిళల విభాగంలో గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన సుబ్బరామన్ విజయలక్ష్మి, 12 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ సాధించి రెండో వ్యక్తిగా నిలిచిన ప్రజ్ఞానంద.. వీరంతా చెన్నైకి చెందినవారే.