రామేశ్వరం మహిళలు.. పర్యావరణ యోధులు..!

పర్యావరణ పరిరక్షణ లేదా బతుకుపోరాటమా అని అడిగితే.. ఎవరైనా తడుముకోకుండా చెప్పేది బతుకుపోరాటం గురించే. కాని, రామేశ్వరం మహిళలు అలా కాదు. ఇక్కడి మహిళలు జీవనోపాధితో పాటే పర్యావరణాన్ని రక్షిస్తున్న సైనికులుగా మారారు.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:45 AM IST

బతుకుదెరువు కోసం సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడ పెరిగే నాచును తీసుకొస్తుంటారు. ఈ ద్వీపంలోని సముద్ర లోతుల్లో రాళ్లు, పగడపు దిబ్బల్లో ఆల్గే పెరుగుతుంటుంది. బయటి మార్కెట్లో ఈ నాచుకు మంచి గిరాకీ ఉంది. దీంతో ఎంతో సాహసంతో సముద్ర గర్భంలోకి వెళ్లి వస్తుంటారు. ఇందుకోసం వీరు ప్రత్యేకమైన డ్రెస్ అంటూ ధరించరు. చీరకట్టుతోనే సముద్రపు లోతుల్లోకి వెళ్తారు. అరువు తెచ్చుకున్న కళ్లజోడును ధరించి సముద్రం లోపలికి ప్రవేశిస్తారు.

నాచు సేకరణలో భాగంగా చేతులకు గాయాలు కాకుండా వేళ్ల చుట్టూ గుడ్డలు చుట్టుకుని వాటిని రబ్బరు బ్రాండ్లతో కట్టుకుంటారు. తాతల కాలం నుంచే వీరు ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. మొత్తానికి సునామీ లాంటి ఎన్నో ఆటుపోటులను తట్టుకుని మరీ నిలబడగలుగుతున్నారు ఇక్కడి ఆడవాళ్లు. సుమారు వంద తీరప్రాంత గ్రామాల వారికి నాచు సేకరణే అతి పెద్ద ఆదాయ వనరు. నాచును సేకరించడం ఒక్కటే ఇక్కడి మహిళలకు తెలుసు. సముద్రపు నాచులో ప్రొటీన్లు ఎక్కువ. దీన్ని మందుల తయారీ, ఐస్ క్రీమ్, టూత్ పేస్టులు, ఎరువులు, ఇతర పదార్ధాల తయారీకి ఉపయోగిస్తారు. అయితే, సముద్రపు నాచు తరిగిపోతుండడంతో గల్ఫ్ ఆఫ్ మన్నార్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని 1986లో ప్రభుత్వం మెరైన్ నేషనల్ పార్కుగా ప్రకటించింది. సముద్రపు నాచు సేకరణను నిషేధించింది. దీంతో దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు.

అయితే, కొందరు మాత్రం తెగించి, ప్రభుత్వ నిషేధాన్ని ఎదురించి నాచు సేకరణ చేశారు. అయితే, ఇలా నాచును మొత్తం తీసేస్తుంటే.. పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఏదో ఓ రోజు మొత్తం సముద్రపు నాచే ఈ ప్రాంతంలో కనుమరుగు అవుతుందని గ్రహించిన ఇక్కడి మహిళలు ఓ పథకాన్ని రూపొందించుకున్నాయి. జీవనాధారం పోకూడదు, అలాగని పర్యావరణానికి హాని కలిగించకూడదు. అందుకోసం, ప్రభుత్వ సంస్థల సహకారం కూడా తీసుకున్నారు. సాధారణంగా నెలలో 30 రోజుల పాటు నాచు సేకరణకు వెళ్లే మహిళలు.. ఇప్పటి నుంచి కేవలం నెలలో 12 రోజులు మాత్రమే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీళ్లకు వీళ్లే ఓ సైన్యంలా మారి.. సముద్రపు నాచును, పర్యావరణాన్ని రక్షించుకుంటున్నారు. అప్పటి నుంచి నెల పొడుపు నుంచి ఆరు రోజుల, పౌర్ణమి ఆరు రోజులు మాత్రమే నాచు వేటకు వెళ్తున్నారు.

ఒకప్పుడు నెలలో 30 రోజుల పాటు నాచు సేకరణకు వెళ్లినప్పుడు రోజుకి 5 నుంచి 10 కిలోల ఆల్గే మాత్రమే దొరికేది. గ్యాప్ ఇవ్వడం ద్వారా రోజుకి 25 నుంచి 30 కిలోల సీవీడ్ దొరుకుతోందని మహిళలు చెబుతున్నారు. దీని ద్వారా నెలకు పది వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. అంతేకాదు, పర్యావరణాన్ని రక్షిస్తున్న యోధులు అంటూ అమెరికాలోని సీకాలజీ డిపార్ట్ మెంట్ వీరిని గుర్తించి అవార్డులు కూడా ఇచ్చింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిరక్షకురాలు అంటూ లక్ష్మీ అనే మహిళకు 2015లో అవార్డు కూడా ఇచ్చారు. ఈ అవార్డు ద్వారా వచ్చిన 2 లక్షల రూపాయలను తిరిగి స్థానిక స్కూలుకే ఖర్చుపెట్టింది లక్ష్మి. చదువు లేని కారణంగానే ప్రమాదం అని తెలిసినా సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ వెళ్లి.. అడుగున ఉన్న నాచును సేకరిస్తున్నామని, అదే తమకు చదువు ఉండి ఉంటే వేరు పని చేసుకునే వాళ్లమని చెబుతున్నారు. అందుకే, అవార్డు కింద వచ్చిన మొత్తం డబ్బును స్ధానిక పాఠశాల కోసం వెచ్చించినట్టు చెప్పింది లక్ష్మి.