Hindutva: హిందుత్వ కార్డుకే మళ్లీ బీజేపీ ఓటా? 2016 నాటి ప్రయోగమే రిపీట్ చేస్తుందా?

భారతీయ జనతా పార్టీ ఈమధ్యనే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. తప్పులేదు.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి కొన్ని రాష్ట్రాల్లో పవర్ లోకి రావడానికి ప్రయత్నిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 10, 2022 / 12:00 PM IST

భారతీయ జనతా పార్టీ ఈమధ్యనే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. తప్పులేదు.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి కొన్ని రాష్ట్రాల్లో పవర్ లోకి రావడానికి ప్రయత్నిస్తోంది. అలాంటప్పుడు ఆ మాత్రం సందడి ఉంటుంది. కానీ.. మళ్లీ అధికారం కోసం కొన్ని చోట్ల హిందుత్వ కార్డును ఉపయోగించడానికి పావులు కదుపుతోందా? ఎందుకంటే అభివృద్ధినే నమ్ముకుంటామని చెప్పిన ఆ పార్టీ.. ఇప్పుడు ఎందుకు మళ్లీ హిందుత్వ వైపు మొగ్గు చూపుతోంది. దీనికి ప్రయోగశాలగా కర్ణాటకను ఎంచుకుందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. అక్కడ యడియూరప్ప ప్రాభవానికి చెక్ పెట్టడానికి.. హిందుత్వ కార్డును ఉపయోగిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కన్నడ నేల.. ప్రయోగశాల కానుందా?

ఈమధ్యకాలంలో గమనిస్తే.. సిలికాన్ వ్యాలీ పేరు మసకబారుతోంది. ఎందుకంటే వరుస వివాదాలు ఆ నేలను కుదిపేస్తున్నాయి. అందుకే అలాంటి పరిస్థితులను క్యాష్ చేసుకునేలా.. కంపెనీలు తమ రాష్ట్రానికి రావచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది కూడా. అయినా ఇన్నాళ్లూ శాంతంగానే ఉన్న కర్ణాటక కొన్నాళ్లుగా ఎందుకు రగులుతోంది? హిజాబ్ తో అక్కడ అలజడి మొదలైంది. ఆ తరువాత హిందూ దేవాలయ జాతర్లలో ముస్లిం వర్గం వ్యాపారాలు చేసుకోవద్దంటూ ఆంక్షలు పెట్టారు. ఆపై హలాల్ వివాదం చుట్టుముట్టింది. అక్కడితో ఆగలేదు. ముస్లిం పండ్ల వ్యాపారుల నుంచి మామిడి పండ్లు కొనద్దంటూ సోషల్ మీడియా ద్వారా గుట్టుగా ప్రచారం చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా అజాన్ వినిపించడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా అంటే.. అక్కడే అసలు కథ ఉంది.

రెండు నెలలుగా కన్నడ నేల ఏదో ఒక వివాదంతో రగులుతోంది. బసవణ్ణ సర్వ మానవ సమానత్వ బోధనలకు ఆలవాలంగా నిలిచి.. శాంతిసామరస్యాలకు సాక్షీభూతంగా నిలిచిన గడ్డ… ఇప్పుడు ఇలా మారిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే మత విద్వేషాలు.. ఇప్పుడు కన్నడ నేలపై ఎందుకు కనిపిస్తున్నాయి? యడియూరప్పను పక్కన పెట్టడానికి.. ఈ వివాదాలకు సంబంధమేంటి? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. యడ్డీని పూర్తిగా పక్కనపెట్టేముందు.. హిందుత్వ కార్డు ఉపయోగం, శక్తి సామర్థ్యాలను బీజేపీ సరిచూసుకుంటోందని అభిప్రాయపడుతున్నారు. అందుకే హిందూఓట్లను ఒక్క గాటిన తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయినా వాటికి ఈ వివాదాలకు సంబంధమేంటి?

యడియూరప్ప అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. బస్వరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయాలు మారాయి. యడ్డీని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లినా, వెనకపెట్టి వెళ్లినా బీజేపీకి కష్టమే. ఆయన ఉంటే ఓట్లు వస్తాయో రావో కాని.. ఆయన లేకపోతే మాత్రం ఓట్లు, సీట్లు పోవడం గ్యారంటీ అన్న నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే యడియూరప్ప హవా ఆ స్థాయిలో పార్టీలో ఉంది. 2018 లెక్కలు తీసుకుంటే… మొత్తం 224 సీట్లకు గాను, 104 సీట్లు మాత్రమే బీజేపీ సాధించింది. ఇక 2019 లో పవర్ లోకి రావడానికి ఏం చేసిందో అందరికీ తెలుసు.

యడ్డీ సీఎం అయ్యాక పార్టీపై ఆయన పట్టు పెరిగిపోవడం అధిష్టానానికి నచ్చలేదు. అందుకే పార్టీ.. ఆయన చేతుల్లోకి పూర్తిగా వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి వీలుగా ఏకంగా యడ్డీని సీఎం కుర్చీ నుంచే పక్కకు తప్పుకోమన్నారు. బస్వరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రిగా చేశారు. బొమ్మై మాస్ లీడర్ కాదు. అందుకే కర్ణాటక బీజేపీపై ఇంకా యడ్డీకే పట్టుంది. ఇలాంటి సమయంలో యడియూరప్ప కుమారుడికి మంత్రిపదవి ఇవ్వడమంటే.. మళ్లీ పార్టీని ఆయన చేతుల్లో పెట్టడమే. అందుకే కమలం తన ప్లాన్ మార్చేసింది.

యడ్డీ ఉన్నా సరే పార్టీకి ఓటు బ్యాంకు స్థిరంగా లేదని బీజేపీకి అర్థమైంది. అందుకే హిందుత్వ కార్డును ఉపయోగించడం ద్వారా దానిని పూర్తిగా కమలానికి అనుకూల ఓటు బ్యాంకుగా మార్చడానికి ఎత్తుగడ వేసిందంటున్నారు విశ్లేషకులు. 2018 ఎన్నికల సమయంలోనే దీనిని ప్రయోగించింది. అప్పుడు కర్ణాటక తీరప్రాంతలో ఒక వర్గం ఓట్లను ఇలాగే సంఘటితం చేసింది. దీనివల్ల ఆ ప్రాంతంలో మొత్తం 19 సీట్లు ఉంటే.. 16 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అందుకే ఇప్పుడు అదే స్కెచ్ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి వీలుగా పావులు కదుపుతోందంటున్నారు నిపుణులు. లేకపోతే కర్ణాటకలో ఇలాంటి మత విద్వేష ఘటనలు తెరపైకి రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవంటున్నారు విశ్లేషకులు.

అధికారంలోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేయవచ్చు కాని.. అది రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి ఎఫెక్ట్ ను చూపించకుండా జాగ్రత్తపడాలి. ఏమాత్రం తేడా వచ్చినా పెట్టుబడులు పెట్టేవారు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఓటు బ్యాంకు సంఘటితమైనా.. వర్గ వైషమ్యాలు కొనసాగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి భావోద్వేగాలను పెంచే అంశాల విషయంలో ప్రభుత్వాలు కాని, పార్టీలు కాని ఆచితూచి అడుగేయాలి.