Gold Coins In Kitchen Floor: కిచెన్ ఫ్లోర్ లో కోట్ల విలువైన బంగారం దొరికింది.. ఎలా అంటే?

అది బ్రిటన్ లోని నార్త్ యార్క్ షైర్ ప్రాంతం ఎల్లెర్బీ గ్రామంలో ఉన్న పాత ఇల్లు.

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 11:57 PM IST

అది బ్రిటన్ లోని నార్త్ యార్క్ షైర్ ప్రాంతం ఎల్లెర్బీ గ్రామంలో ఉన్న పాత ఇల్లు. దీంతో ఇంటివాళ్ళు ఆధునికీకరణ పనులు చేపట్టారు.కిచెన్ లో తవ్వుతున్న సమయంలో గట్టిగా తగలడంతో ఏదైనా విద్యుత్ వైర్ల పైపు అయ్యుంటుందని వారు భావించారు. మరికాస్త తవ్వగా.. ఓ లోహపు క్యాన్ కనిపించింది. అందులో భద్రంగా ఉన్న 264 బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని చూసి ఆ ఇంటి దంపతుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

రూ.2.3 కోట్లు..

బంగారు నాణేల విలువ ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ నాణేలు 400 ఏళ్ల నాటివని భావిస్తున్నారు.
ఈ నాణేలను విక్రయించడానికి దంపతులు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించారు. కాగా, వారు తమ పేర్లను వెల్లడించేందుకు నిరాకరించారు. ఇదే ఇంటిలో తాము గత పదేళ్లుగా ఉంటున్నామని తెలిపారు.

నాణేలపై..

ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. అప్పట్లో ఎవరైనా వాణిజ్య ప్రముఖుడి కుటుంబానికి చెందినవి అయ్యుంటాయని స్థానిక మీడియా పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లోనూ..

మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో శిథిలమైన ఓ ఇంటిలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆ ఇంటిని పునర్నిర్మిద్దామని కార్మికులను పనికి పంపగా.. వారికి ఈ నాణేలు దొరికాయి. తొలుత వారు పంచుకోవాలని అనుకున్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారిని అరెస్టు చేశారు. నాణేలను స్వాధీనం చేసుకున్నారు.