Site icon HashtagU Telugu

Smiling Depression: చిరునవ్వు పరదా వెనుక “స్మైలింగ్ డిప్రెషన్”.. ఏమిటది?

Smiling Depression Behind The Veil Of Smile.. What..!

'smiling Depression' Behind The Veil Of Smile.. What..!

Smiling Depression : “తుమ్ ఇత్నా జో ముస్కురా రహే హో .. క్యా గం హై  జిస్కో చుపా రహే హో ”  అని జగ్జీత్ సింగ్ ఒక గజల్  పాడారు. దీని అర్ధం .. “నువ్వు పకపకా  నవ్వుతున్నావు.. అయితే  నవ్వు పరదా మాటున ఏ బాధను  దాస్తున్నావు” !!  ఈ గజల్ ఎవర్‌గ్రీన్‌. ఇటువంటి మానసిక స్థితి డిప్రెషన్‌కు గురైన వ్యక్తుల్లో  కనిపిస్తుంది. మెడికల్ భాషలో ఈ రకమైన డిప్రెషన్‌ను ” స్మైలింగ్ డిప్రెషన్” (Smiling Depression) అని అంటారు. చిరునవ్వు ముఖం వెనుక దాగి ఉన్న డిప్రెషన్‌కు అతి పెద్ద కారణం .. వారు బలహీనంగా ఉండగలమని అంగీకరించక పోవడమే. ఇలాంటి వాళ్ళకు వారి ఇమేజ్ చాలా ముఖ్యమైనది.  తాము  బలహీనంగా  ఉన్నట్టు,  సానుభూతి తెలపడం  అవసరమని ఇతరులు అర్థం చేసుకోవడం కూడా  వారికి ఇష్టం ఉండదు.  అటువంటి పరిస్థితిలో డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తి తనకు ఎవరూ సహాయం చేయలేరని భావించడం ప్రారంభిస్తాడు. ఈక్రమంలో నే సూసైడ్ చేసుకుంటాడు.

సౌమ్యులైన వ్యక్తుల ఆత్మహత్య వెనుక..

ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న తర్వాత..  ఆ వ్యక్తి చాలా మంచివాడని, ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడని,  ఆప్యాయంగా  అందరినీ కలిసేవాడని చర్చించుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకొని ఉంటాడు అని కూడా  డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈవిధమైన సౌమ్యులైన వ్యక్తులు కూడా  ఆత్మహత్య చేసుకున్నారు అంటే.. ఆ కఠిన నిర్ణయం వెనుక  స్మైలింగ్ డిప్రెషన్ ఉందని అర్ధం చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ అంటే..  ఒంటరితనం ఫీల్ కావడం, ఏడుపు, కేకలు, తనలో తాను కుమిలిపోవడం అని  భావిస్తుంటారు.  కానీ నవ్వుతూ, నవ్వుతూ ఉన్న ముఖం  మాటున కూడా  డిప్రెషన్‌ ఉంటుందని మీరుగుర్తుంచుకోవాలి.

స్మైలింగ్ డిప్రెషన్ (Smiling Depression) 3 ప్రధాన లక్షణాలు:

స్మైలింగ్ డిప్రెషన్ ఇతర రకాల డిప్రెషన్ల  కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించడం కొంచెం  కష్తం. అయితే, ఇది 3 ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది. వాటిలో మొదటిది అంతరంగంలో దుఃఖం.. రెండోది ఏ పని మీద ఆసక్తి లేకపోవడం.. మూడోది త్వరగా అలసిపోవడం. అంటే, మీరు మీ దైనందిన జీవితంలో చాలా  పనులు చేస్తూ ఉండవచ్చు. కానీ ఎక్కడో మీకు ఆ పనులపై ఆసక్తి ఉండదు. ఆ పనులు చేసే క్రమంలో త్వరగా మీరు అలసిపోతారు. చేసే పనులపై ఆసక్తి తగ్గిపోయి మధ్యలో నే  వదిలేస్తారు. ఇవన్నీ కూడా  స్మైలింగ్ డిప్రెషన్ లక్షణాల కిందికే వస్తాయని మనం గుర్తుంచుకోవాలి. మీకు ఎప్పుడూ తలనొప్పి లేదా ఒళ్ళు నొప్పి ఉన్నా స్మైలింగ్ డిప్రెషన్ దిశగా పోతున్నారని సందేహిచుకోండి అని నిపుణులు సూచిస్తున్నారు.

మెదడులో ఆ కెమికల్ గడబిడ.. 

డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తి మెదడులో సెరోటోనిన్ అనే కెమికల్  పరిమాణం తగ్గుతుంది. ఆ తర్వాత మనం ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తాం. చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల కంటే తానే దీన,హీన స్థితిలో  ఉన్నానని భావించడం మొదలు పెడతాడు.  ఇటువంటి స్థితి నుంచి బయటికి రావాలంటే మీరు మీ జీవితంలో మంచి జరిగిన సందర్భాలను, మీ విజయాలను గుర్తుకు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం ఆపేయండి. మీరు చేసేపని కూడా తక్కువేం కాదని తెలుసుకోండి. ఇటువంటి పాజిటివ్ విషయాల గురించే చర్చించండి. నెగెటివ్ ఆలోచనలు పంచే వారికి దూరంగా ఉండండి. కాలంతో పాటు పరిస్థితులు మీ అదుపులోకి వస్తాయనే నమ్మకంతో జీవించండి.  అప్పుడే మీరు డిప్రెషన్ నుంచి
కోలుకోగలరని తెలుసుకోండి. ఇలాంటి వారు మీ సన్నిహితుల్లో , స్నేహితుల్లో ఉంటే నైతిక బాధ్యతగా ధైర్యం చెప్పాలి. ఆత్మవిశ్వాసం ఇచ్చే వాక్యాలు చెప్పాలి. బతికి సాధించాలని సూచించాలి.

Also Read:  Sarvapindi : కామన్ మ్యాన్ పిజ్జా “సర్వపిండి” తయారీ ఇలా..