Solutions for Employee Stress: ఒత్తిడిలో ఉద్యోగులు.. పరిష్కార మార్గాలు

ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో భారతదేశంలోని 50- 80% మంది ఉద్యోగులు పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

  • Written By:
  • Updated On - April 9, 2023 / 05:18 PM IST

Solutions for Employee Stress : ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు.. వెరసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో భారతదేశంలోని 50- 80% మంది ఉద్యోగులు పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా బ్రిటిష్ అధ్యయనం ప్రకారం నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు ఒత్తిడి (Stress) మరియు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే మానవాళికి పెనుముప్పు వాటిల్లుతుందంటున్నారు నిపుణులు. అయితే మానసిక, శారీరక ఒత్తిడి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే దూరం చేసుకోవాలి. సమస్య ఎక్కువైతే డిప్రెషన్, బాధ, నిరాశ, నిద్రలేమి, ఆకలి మందగించటం, తలనొప్పి, జీర్ణసంబంధ వ్యాధులు, ఆత్మహత్యా ప్రయత్నాలకు కూడా దారి తీస్తుంది.

ఉద్యోగులు ఒత్తిడి నుండి బయటపడటానికి మార్గాలు:

☛ ఉద్యోగులు ఉత్తిడికి గురవ్వడం సర్వసాధారణం అయిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం ద్వారా ఉద్యోగులు మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారు. కానీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించడం మంచిది. ఆందోళన, చిరాకు పడటం, నిరాశ, అసహనం ఇలాంటివి ఎదురైతే మీరు ఒత్తిడికి గురవుతున్నారని గుర్తించాలి. ఎదో వర్క్ స్ట్రెస్ అని ఇంగ్లీష్ లో స్టైలిష్ గా తీసుకోకుండా అది మిమ్మల్ని ప్రమాదంలోకి తీసుకెళ్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉద్యోగుల ప్రవర్తనలో హెచ్చుతగ్గులు, ఏకాగ్రతతో ఇబ్బందులు, అలాగే తలనొప్పి లేదా అలసట వంటి శారీరక లక్షణాలను కలిగి ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలను ముందుగా గుర్తించడం సమస్యను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

☛ చాలా మంది ఎక్కువ సమయాన్ని కార్యాలయాల్లో గడుపుతారు. అది అస్సలు మంచిది కాదు. మీ పని వేళలను తప్పకుండ పాటించాలి. పని ముగించుకుని ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఇక మీ సంస్థలో ఎలాంటి వాతావరణాన్ని అయినా మీకు అనుగుణంగా, ప్రశాంతంగా మార్చుకోవాలి. సహోద్యోగులతో ఎప్పుడూ సరదాగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది మీ మానసిక అంశానికి ఎంతో ఉపయోగపడుతుంది. రోజంతా పని చేయడం వల్ల పనిమీద చిరాకు, అసహనం పుడుతుంది. సో.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో సహోద్యోగులతో నవ్వుతు మాట్లాడాలి. విశ్రాంతి సమయంలో మీ పని ప్రస్తావన తీసుకురాకూడదు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా మీకిష్టమైన పనులు చేయండి. అలా చేయడం ద్వారా ఆఫీస్ లో మీరు పడ్డ కష్టాన్ని మర్చిపోగలరు.

☛ ఆఫీస్ లో మీ పనిని అంచనా వేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం ద్వారా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి పనిని స్మార్ట్ గా చేయడం అలవాటు చేసుకోవాలి. ఖాళీ సమయంలో నడవడం అలవాటు చేసుకోండి. మీ ఆఫీస్ ప్రదేశాన్ని బట్టి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మరీ మంచిది. అలాగే కార్యాలయాల్లో సానుకూల పని వాతావరణాన్ని సృష్టించడం మానసిక ఆరోగ్య ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగి పనిని గుర్తించి అప్రిషియేట్ చేయడం ద్వారా ఉద్యోగుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగులపై యజమానులు వేధింపుల కారణంగా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అది సంస్థకే మంచి కాదు.

Also Read:  Project Tiger: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు టైగర్