Site icon HashtagU Telugu

Kashmir future : త్వరలోనే తేలనున్న కాశ్మీర్ భవితవ్యం

The Future Of Kashmir Will Soon Emerge

The Future Of Kashmir Will Soon Emerge

By: డా. ప్రసాదమూర్తి

16 రోజుల సుదీర్ఘ విచారణ.. 20 పిటిషన్లు.. అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ఇటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు, మరో పక్క సుప్రీం ధర్మాసనం.. అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగిన సీరియల్ వాదనలు.. ఇదీ కాశ్మీర్ (Kashmir) స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు సంబంధించిన సస్పెన్స్ వెనక ఇటీవల నెలకొన్న వాతావరణ. కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని (స్పెషల్ స్టేటస్) ప్రసాదించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసి నాలుగేళ్లవుతుంది. దీని మీద అతి దీర్ఘంగా కీలకమైన వాదోపవాదాలు కొనసాగాయి.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృంత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ సాగించింది. మంగళవారం విచారణ ముగిసింది. సుప్రీం కోర్టు తన తీర్పు రిజర్వులో పెట్టింది. విచారణ సాగిన పదహారు రోజులూ దేశమంతా ఎంతో ఉత్కంఠగా కోర్టు ప్రక్రియను తిలకించింది. ఇక సుప్రీం కోర్టు కాశ్మీర్ (Kashmir) విషయంలో ఏం తీర్పు చెప్తుందా అన్న విషయమే చాలా ఆసక్తికరంగా మారింది.

2019లో కేంద్రం జమ్మూ కాశ్మీర్ (Kashmir) స్పెషల్ స్టేటస్ ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి కాశ్మీర్ నుంచి దేశానికి అందే వార్తల్లో ఏది నిజం..ఏది అబద్ధమో తేల్చుకోడానికి ఎలాంటి యంత్రాంగమూ సాధారణ పౌరులకే కాదు, మీడియాకి కూడా లేదు. ఎంతో కాలం అక్కడ ఇంటర్నెట్ లేదు. నాయకులు గృహ నిర్బంధంలో ఉన్నారు. కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం కోసమే ఇదంతా చేస్తున్నట్టు కేంద్రం చెప్తున్నప్పటికీ ప్రతిపక్ష నేతలు మాత్రం కాశ్మీర్ లో నియంతృత్వం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాశ్మీర్ లో స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడానికి 370 అధికరణాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని మీద దాదాపు 20 పిటిషన్లు నమోదయ్యాయి. పిటిషనర్ల తరపున కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమనియం లాంటి హేమాహేమీలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలకు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేతృత్వం వహించారు.

కోర్టు వాదనలు చాలా ఆసక్తికరంగా సాగాయి. రాజ్యాంగంలోని 370 అధికరణం తాత్కాలికమైంది కాదని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో పాలన కొనసాగించే అవకాశం జమ్మూకాశ్మీర్ కి చట్టం కల్పించిన హక్కు అని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఆర్టికల్ 356 ద్వారా విధించిన రాష్ట్రపతి పాలన కాశ్మీర్ లో దుర్వినియాగమవుతోందని వారి వాదన. అయితే ఆర్టికల్ 370 శాశ్వతమైంది కాదని ప్రభుత్వ తరపు వాదనలు సాగాయి.

పోతే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని కూడా ప్రభుత్వం తరపున వాదించిన ఎస్.జి. తుషార్ మెహతా చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని చాలా ప్రశ్నలే వేశారు. రాష్ట్రపతి పాలన విధించాక కాశ్మీర్ లో పరిస్థితులు చాలా చక్కబడ్డాయని ప్రభుత్వం చెప్తోంది. మరి పరిస్థితులు కుదుటపడితే రాష్ట్రపతిపాలన ఎత్తివేసి అక్కడ ఎన్నిక లు ఎందుకు నిర్వహించడం లేదని ధర్మాసనం అడిగింది.

ఎన్నికలు నిర్వహించడానికి తామూ సిద్ధమేనని మెహతా అన్నారు. మరెప్పుడు జరుపుతారో …కాల పరిమితి ఏంటో చెప్పాలని కోర్టు నిలదీసింది. తాము నిర్దిష్ట కాల పరిమితిని చెప్పలేమని ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన సమాధానం. అలాగే రాష్ట్ర శాసనసభకు, ఎవరు కాశ్మీర్ మూల వాసులు.. ఎవరు కాదని నిర్ణయించే అదికారాన్ని కట్టబెట్టే ఆర్టికల్ 35ఏ గురించి కూడా సుప్రీం న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీని వల్ల జమ్మూ కాశ్మీర్ లో స్థానికులు కాని వారు అక్కడ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

మొత్తానికి ఎవరి వాదనలు ఎలా ఉన్నా కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ని ప్రసాదించే ఆర్టికల్ 370 విషయంలో సస్పెన్స్ ఇక వీడనుంది. ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు తన తీర్పు ఏ విధంగా చెబుతుందా అన్నదే దేశమంతా ఎదురు చూస్తున్న విషయం.

Also Read:  India Name Change : ఇండియా పేరు మార్పుపై ఐరాస ఏమంటుందంటే..