Site icon HashtagU Telugu

INDIA Alliance : ఇంతకీ ప్రతిపక్ష కూటమి ‘INDIA’ ఏమైనట్టు?

Opposition Alliance INDIA..

So What Is The Opposition Alliance 'india'..

By: డా. ప్రసాదమూర్తి

INDIA Alliance : మరో రెండు వారాల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పరిపూర్తి కానుంది. డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఇదంతా సరేగాని, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల సంరంభం ప్రారంభం కాకముందే హడావుడి చేసిన ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ (INDIA) ఎక్కడుంది? ఏమైంది? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న చొరవ, కాంగ్రెస్ పార్టీ చూపించిన సానుకూల వైఖరి, దేశవ్యాప్తంగా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ప్రదర్శించిన ఉత్సాహం కలగలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం మనకు తెలిసిందే. పాట్నా, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రతిపక్ష కూటమి (INDIA) సమావేశమై ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నో కీలక కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, దాని మిత్రపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి అమీతుమీ తేల్చుకోవడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నట్టు దేశవ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు సంకేతాలిచ్చారు. ఈ కలయిక, ఈ ఉత్సాహం, ఈ సంరంభం అంతా సమావేశాల వరకేనా.. ఆచరణలో ప్రతిపక్షాలు ఒక్కటైన తీరును ప్రదర్శించలేవా అనే అనుమానాలు ఇప్పుడు సాధారణ పౌరులకు కూడా కలుగుతున్నాయి.

We’re Now on WhatsApp. Click to Join.

ఇప్పటికే బీజేపీ ప్రతిపక్షాల ఐక్యతను ఒక అసాధ్యమైన అవకాశవాద కూటమిగా అభివర్ణిస్తూ దాడులు చేస్తూనే ఉంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో ఆయా రాష్ట్రాల స్థానిక పార్టీలు, వివిధ ప్రతిపక్ష పార్టీలు పోటీలో ఉంటాయి. అలాంటప్పుడు ఈ పార్టీల మధ్య ఐక్యత ఎలా సాధ్యమని బిజెపి పార్టీ మాత్రమే కాదు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వేసే ప్రశ్నకు ప్రతిపక్ష కూటమి (INDIA)కి దగ్గర సమాధానం లేదు. సమయం వచ్చినప్పుడు మా ఐక్యతను చాటి చెబుతామని ఇండియా కూటమి బదులు చెబుతుంది కానీ అది ఆచరణలో కనిపించడం లేదు. నిజంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఉంటే ఒకరి మధ్య ఒకరికి ఆయా రాష్ట్రాలలో వారి వారి బలాబలాల రీత్యా సయోధ్య కుదిరితే, పొత్తు ఏర్పడితే అది ప్రతి సందర్భంలోనూ ప్రతి చోటా ఆచరణలో వ్యక్తం కావాలి. అలా ఇప్పుడు కనిపించడం లేదు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన ప్రతిపక్షాలు ఏమైపోయాయి.. ఎక్కడున్నాయి అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో

కనిపించని ప్రతిపక్షాల ఐక్యత (INDIA):

నిజంగా ప్రతిపక్షాల మధ్య ఒక అవగాహన కుదిరితే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పక్షాలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సమైక్యంగా ఉన్నట్లయితే, ఆ ఐక్యత ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కూడా కనిపించాలి కదా అనే ఒక ప్రశ్న ఉదస్తుంది. రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీతో ప్రధానంగా తలపడుతున్నది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణలో కూడా అధికార బీఆర్ఎస్ ని, బిజెపిని ఎదుర్కొంటున్నది కాంగ్రెస్ పార్టీనే. కానీ ఈ ఎన్నికలలో ఎక్కడా ఏ ప్రచార సభలోనూ ప్రతిపక్ష కూటమి (INDIA)లోని పార్టీల నాయకులు పాల్గొన్న దాఖలాలు లేవు. నిజంగా కాంగ్రెస్ పార్టీతో తమ మధ్య ఒక అవగాహన కుదిరినట్లయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మిగిలిన ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులంతా ఐకమత్యంతో పని చేయాల్సి ఉంది.

Also Read:  Modi Election Strategy : మాదిగలకు మోడీ హామీ ఎన్నికల వ్యూహమేనా?

కనీసం ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సాగిస్తున్న ఎన్నికల ప్రచార సభల్లో కీలక నాయకులైనా పాల్గొని కాంగ్రెస్ విజయానికి తమ వంతు సాయం అందించాల్సి ఉంది. అలా ఎక్కడా జరగలేదు, జరగడం లేదు. కారణం ఏమిటి? ప్రతిపక్షాల ఇండియా కూటమి యుద్ధంలోకి దూకక ముందే విచ్ఛిన్నం అయిపోయిందా? నితీష్ కుమార్ ఎన్నికల పట్ల ఎందుకు ఆ మౌనం పాటిస్తున్నారు? మమతా బెనర్జీ ఏమైనట్టు? స్టాలిన్ ఎక్కడున్నాడు? కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్.. ఇలా కీలకమైన ప్రతిపక్ష నాయకులు ఎన్నికలలో కనీసం కాంగ్రెస్ కోసమైనా ఎందుకు ప్రచార రంగంలోకి దిగలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అంతేకాదు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ తో సమాజ్ వాది పార్టీకి పొత్తు కుదరలేదు.

ఆ రాష్ట్రంలో దాదాపు 60 స్థానాల్లో సమాజ్వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో తలపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ పోటీకి అర్థం ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్ష నాయకులే చెప్పాలి. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనక పోవడమే కాదు, ఈ ఎన్నికల మీద ఎక్కడా ఏ నాయకుడూ మాట్లాడుతున్న ఉదాహరణ కూడా లేదు. కనీసం మాటల రూపంలోనైనా కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తున్న తీరు కూడా వ్యక్తం కావడం లేదు. అంటే మరో ఐదారు నెలలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తాయా లేక ఎవరిదారి వారిదేనా అనే ప్రశ్న, సందేహం అందరిలోనూ గట్టిగా బలపడుతుంది.

తమ ఐక్యత కేవలం సార్వత్రిక ఎన్నికలకే పరిమితం అని కాంగ్రెస్ వారు చెబుతున్నప్పటికీ అది ఆచరణలో కనీసంగానైనా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కనిపించి తీరాలి. అసెంబ్లీల ఎన్నికల్లో సాధ్యం కాని ఐక్యత, సయోధ్య సార్వత్రిక ఎన్నికలలో సాధ్యమవుతుందని చెప్పడం వింతగానే ఉంటుంది. ఏమో అది వింత కాదు సమంజసమే అని సాధ్యమేనని ప్రతిపక్షాలు నిరూపిస్తాయో.. లేక తమ ఐక్యత అంతా ఆరంభ శూరత్వమేనని ఎవరిదారి వారుగా విడిపోయి నిరూపించుకుంటాయో చూడాల్సిందే.

Also Read:  Madhya Pradesh & Telangana Proximity : మధ్యప్రదేశ్, తెలంగాణ మధ్య సామీప్యం ఏమిటి?

Exit mobile version