CJI : సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు.. సీజేఐ లేఖ

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 01:18 PM IST

Retired Judges Letter to CJI : తీవ్రమైన ఒత్తిడి, తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని 21మంది సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు(Former Judges) సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌(CJI Justice DY Chandrachud)కు లేఖ(letter) రాశారు. సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అనైతికమే కాక, దేశ ప్రజాస్వామ్య విలువలకు హానికరమనీ, న్యాయవ్యవస్థ సమగ్రతను ఇవి దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

కొందరికి అనుకూలంగా ఉండే న్యాయ నిర్ణయాలను ప్రశంసించడం, అలా లేని వాటిని తీవ్రంగా విమర్శించడం, న్యాయ సమీక్ష సారాంశాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో అధికార ఎన్డీయే, విపక్షాల మధ్య వాగ్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో మాజీ న్యాయమూర్తులు ఈ లేఖ రాయడం గమనార్హం. న్యాయపరమైన ఫలితాలను, తీర్పులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆయా వర్గాలు అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న మాజీ న్యాయమూర్తులు, అనవసర ఒత్తిళ్లనుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షించాలని సీజేఐను కోరారు. అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థను మూలస్తంభంగా నిలపడం అత్యవసరమని వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

కొన్నిరోజుల క్రితం, రాజకీయ ఒత్తిళ్ల వల్ల న్యాయవ్యవస్థకు పొంచి ఉన్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేశంలోని దాదాపు 600 మంది లేఖ రాశారు. కోర్టుల తీర్పులను ప్రభావితం చేయడానికి ఒత్తిడి వ్యూహాలను ప్రయోగిస్తున్న స్వార్థ ప్రయోజనాల సమూహం ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ లేఖపై సంతకం చేసిన ప్రముఖ న్యాయవాదుల్లో హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిత్తల్, పింకీ ఆనంద్, స్వరూపమ చతుర్వేది తదితరులు ఉన్నారు.

Read Also: Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!

ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. వారి చర్యల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థతో పాటు న్యాయ ప్రక్రియలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ముప్పు వాటిల్లుతోందని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పనితీరును కించపరిచేలా ‘స్వర్ణ యుగం’, ‘బెంచ్ ఫిక్సింగ్’ లాంటి పదాలను కొందరు వెటకారంగా అర్ధం వచ్చేలా ప్రయోగిస్తున్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అజెండాతో న్యాయస్థానాలను అగౌరవపరిచే ఇలాంటి పదజాలాన్ని ప్రయోగించే వారిని ఉపేక్షించకూడదని వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డదిడ్డమైన ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టులను ప్రభావితం చేయడం సులభం అంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని 600 మంది లాయర్లు తమ లేఖలో పేర్కొన్నారు.