Site icon HashtagU Telugu

Rahul Gandhi : రాటు దేలిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi Shines Like A Leader In Congress Party

Rahul Gandhi Shines Like A Leader In Congress Party

By: డా. ప్రసాదమూర్తి

Rahul Gandhi : రాహుల్ గాంధీని పప్పూ పప్పూ అని ఎద్దేవా చేసినవారు, తప్పు తప్పు అని ఇక లెంపలు వేసుకోవాలి. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ చేపడుతున్న కార్యక్రమాలు, మాట్లాడుతున్న తీరు, విదేశీ యూనివర్సిటీలలో ఉపన్యాసాలు చేస్తున్న ప్రతిభ, లోక్ సభలో గానీ బయట గాని అనేక అంశాలపై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలలో ప్రదర్శిస్తున్న రాజకీయ పరిణతి ఆయన విమర్శకులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తున్నాయి. భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ప్రతి ప్రాంతాన్నీ, ప్రతి కోణాన్నీ స్పృశించిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) అటు అధికార పక్షమైన బిజెపి వర్గాలనే కాదు, ఇటు సాటి విపక్షాల నాయకులను కూడా విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన రోజురోజుకూ ఇంతింతై వటుడింతై అన్నట్టు తన రాజకీయ పరిపక్వతను ప్రదర్శిస్తూ దేశానికి క్రమంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు తాజాగా ఇటీవల రాహుల్ గాంధీ నార్వే యూనివర్సిటీలో చేసిన సంభాషణాత్మక ఉపన్యాసం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి.

సాధారణంగా రాజకీయ నాయకులలో కనిపించని నిజాయితీ నిబద్ధత రాహుల్ గాంధీలో కొట్టొచ్చినట్టు దేశానికి కనిపిస్తోంది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రెస్ వారితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య, సాధారణ నాయకుల వ్యక్తీకరణకు భిన్నంగా ఉంది. తెలంగాణలో తాము గెలవడానికి అవకాశం ఉందని, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో కచ్చితంగా గెలవబోతున్నామని, రాజస్థాన్లో పోటీ గట్టిగా ఉంటుందని, అక్కడ కూడా గెలవచ్చని రాహుల్ చేసిన వ్యాఖ్య కొంత చర్చకు దారి తీసింది. ఎవరైనా తమకు ఓటమి భయం లోపల ఉన్నప్పటికీ గెలిచేది తామేనని చెబుతారు. కానీ రాహుల్ గాంధీ అలా చెప్పలేదు. వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తన అభిప్రాయాన్ని నిజాయితీగా వ్యక్తం చేశారు. ఇది తన పార్టీ వారికి రాజస్థాన్ లో కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కానీ రాహుల్ లోని నిబద్ధతను నిజాయితీని చూపించడానికి ఇది ఒక పరమోదాహరణగా మారింది. అలాగే ఇటీవల లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పై చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు ఓబీసీ రిజర్వేషన్ల పట్ల ఎంత నిజాయితీగా నిబద్ధతతో ఉన్నారో ఆయన మాటల్లో తెలియ వచ్చింది.

అంతేకాదు, మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, తాము గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు సబ్ కోటా కల్పించకపోవడం అనేది నూటికి నూరు శాతం తప్పేనని, అందుకు పశ్చాత్తాప పడుతున్నామని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇది కూడా రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోని స్వచ్ఛమైన రాజనీతిజ్ఞతకు తార్కాణంగా నిలుస్తోంది. ఇక ముందు రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ వారు వెనుకబడిన వర్గాలకు ముందు పీట వేస్తారు అనే సంకేతాలు ఆయన నోటి నుంచి వినపడుతున్నాయి. మణిపూర్ హింసకాండ సందర్భంగా అక్కడకు వెళ్లి ప్రజల కష్టాలను కన్నీళ్లను అర్థం చేసుకున్న తీరు, అక్కడ ప్రెస్ తో మాట్లాడిన మాటలు గాని, దేశంలో పలు వర్గాల ప్రజలను పలు సందర్భాల్లో కలుస్తున్న తీరుతెన్నులు గాని, ఇటీవల కూలీ వేషంలో పెట్టె మోస్తూ ప్రజలను ఆకర్షించుకున్న సందర్భంగాని.. ఇలా అనేకానేక సందర్భాలలో రాహుల్ గాంధీ ప్రజానాయకుడిగా ఎదుగుతూ వస్తున్న తీరు దేశాన్ని అబ్బురపరుస్తోంది.

అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల నార్వే యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా కీలకమైనవి. దేశంలో జరుగుతున్న అనేక విషయాల పట్ల ఆయనకున్న స్పష్టమైన అవగాహనను తెలియజేస్తున్నాయి. 2014 ముందు భారత దేశంలో కేవలం రాజకీయ పక్షాల మధ్య పోటీ ఉండేదని, ఇతర రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేసేవని, మీడియా స్వేచ్ఛాయుతంగా ఉండేదని, వాక్ స్వాతంత్ర్యం సజీవంగా ఉండేదనీ, ఇప్పుడు భారతదేశంలో ఆ స్థితి లేదని, సిబిఐ, ఈడి, ఐటి, ఎన్నికల కమిషన్ తదితర సంస్థలు, మీడియా, అన్నీ పాలకుల చేతుల్లో బందీలై వారి రాజకీయ ఆస్త్రాలుగా మారిపోయాయని ఆయన మాట్లాడిన మాటలు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల ఆయన సంపూర్ణ అవగాహనకు అద్దం పడుతున్నాయి.

అంతేకాదు ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలలో తలపడడం అంటే, రాజకీయ పోరాటం కాదు. భారతీయ మౌలిక నిర్మాణంతో పోరాడాలని ఆయన అన్నమాట చాలా తీవ్రమైనది. అంటే భారతీయ మౌలిక సూత్రాలు, సిద్ధాంతాలు ప్రమాదంలో పడిపోయాయని, ఎన్నికల తాత్కాలిక ప్రయోజనాల కోసం కాదు ఇప్పుడు పోరాడాల్సింది, భారతీయ మౌలికతను కాపాడుకోవడానికి యుద్ధం చేయాలని అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇదంతా సాధారణమైన విషయం కాదని, ప్రతిపక్షాల మధ్య సయోధ్య ఎలా కుదురుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేనని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అధికార బిజెపిని మెయిన్ టార్గెట్ గా చేసుకుని ఉమ్మడి వ్యూహంతో కదులుతామని ఆయన అన్నారు.

ఇలా అనేక విషయాలలో రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న రాజకీయ విజ్ఞత, పరిపక్వత, అనేక అంశాల పట్ల ఆయనకున్న స్పష్టమైన అవగాహన క్రమంగా ఆయన్ని దేశంలో ఒక కీలకమైన రాజకీయ శక్తిగా నిలబెడుతున్నాయి. రానున్న రోజులలో మిగిలిన విపక్షాలు, రాహుల్ గాంధీ శక్తియుక్తులను ఎలా ప్రతిపక్ష ఐక్యతకు ప్రధాన వనరుగా వాడుకుంటాయో చూడాలి. మొత్తానికి రాహుల్ గాంధీని ఒక పిల్లవాడిగా ఎగతాళి చేసిన సో కాల్డ్ పెద్దలంతా ఇప్పుడు అతన్ని నోరు తెరుచుకుని చూసే పరిస్థితి వచ్చిందని మాత్రం గట్టిగా చెప్పొచ్చు.

Also Read:  MLC kavitha: గవర్నర్ నిర్ణయం.. బీసీలకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత ధ్వజం