Modi DA : డీఏల‌కు మోడీ క‌ళ్లెం! ఏపీ,తెలంగాణ ఉద్యోగులకు జ‌ల‌క్

క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా ఆర్థిక ప‌రిస్థితులు సానుకూలంగా లేవ‌ని చెబుతూ డీఏ(DA)ల‌ను ఇవ్వ‌లేమ‌ని మోడీ(Modi) స‌ర్కార్ తెగేసి చెప్పింది.

  • Written By:
  • Updated On - December 15, 2022 / 12:25 PM IST

`మంచం ఉన్నంత వ‌ర‌కే కాళ్లు ముడుచుకోవాలని` పెద్ద‌ల సామెత‌. దానికి సరితూగేలా కేంద్ర ఉద్యోగుల‌కు డీఏ(DA)ల‌ను ఇవ్వ‌లేమ‌ని మోడీ(Modi) స‌ర్కార్ తేల్చేసింది. క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా ఆర్థిక ప‌రిస్థితులు సానుకూలంగా లేవ‌ని చెబుతూ డీఏ(DA)ల‌ను ఇవ్వ‌లేమ‌ని తెగేసి చెప్పింది. గ‌త రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఏల‌ను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వంపై ఉద్యోగులు(Employees) ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, వాళ్ల అడుగుల‌కు మ‌డుగులొత్తే పార్టీల ఎంపీల‌తో పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌శ్నను సంధించారు. దానికి స్పందిస్తూ క‌రోనా కార‌ణంగా ఆర్థిక ప‌రిస్థితి బాగాలేద‌ని, డీఏ(DA)ల‌ను ఇవ్వ‌లేమ‌ని కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ధైర్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయ‌లేక‌పోతున్నాయి. ఫ‌లితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అప్పు స‌రాస‌రి 6ల‌క్ష‌ల కోట్ల‌ను దాటి పోయింది.

సాధార‌ణంగా పే రివిజ‌న్ క‌మిష‌న్‌( PRC) వేయ‌డం అంటే జీతాల‌ను పెంచుకోవ‌డానికి అనే అర్థం వ‌చ్చేలా ఆలోచ‌న ఫిక్స్ అయింది. వాస్త‌వంగా సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ, మౌలిక త‌దిత‌ర ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసిన తరువాత జీతాల‌ను పెంచాలా? వ‌ద్దా? అనేది నిర్థారించాలి. స్థూల జాతీయోత్ప‌త్తిలో పాటు రాష్ట్ర జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయాన్ని కూడా లెక్క‌లోకి తీసుకుని జీతాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుతున్నారు. మాన‌వాభివృద్ధి సూచిక‌ను బేస్ చేసుకుని జీతాల‌ను నిర్థారించాలని ప్ర‌ముఖ ఆర్థిక వేత్త అమృత్య‌సేన్ లాంటి వాళ్లు ఇచ్చే స‌ల‌హా. లేదంటే ఆర్థిక అంత‌రాలు స‌మాజంలో పెరిగిపోతాయ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఓట్ల రాజ‌కీయాల దిశ‌గా ఆలోచించే పాల‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు జీతాల‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఫ‌లితంగా బ‌డ్జెట్ లో 70శాతంపైగా వాటా ఉద్యోగుల(Employees) జీతాలకు వెళ్లిపోతోంది.

ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత పోటీపడి ఇరు రాష్ట్రాల సీఎంలు ఉద్యోగుల‌కు జీతాల‌ను పెంచారు. మిగులు బ‌డ్జెట్ తో ఏర్ప‌డిన తెలంగాణ ఉద్యోగుల‌కు ఫిట్మెంట్ ను కేసీఆర్ భారీగా ఇచ్చారు. వాళ్ల‌కు పోటీగా ఆనాడున్న ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఫిట్మెంట్ ను ఉద్యోగుల‌కు ఇవ్వ‌డంతో ప‌నిదినాల‌ను కూడా కుదించారు. వారానికి ఐదు రోజుల ప‌ని దినాలు, అమ‌రావతిలో ఉండడానికి ఉచిత వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యం, హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తి వెళ్ల‌డానికి ఉచిత రైలు, బ‌స్సు సౌక‌ర్యం, రెండు హెచ్ ఆర్ ఏలు, ప‌ని గంట‌ల త‌గ్గింపు త‌దిత‌ర వెసుల‌బాటుల‌ను క‌ల్పించారు. అయిన‌ప్ప‌టికీ రెండంకెల అవినీతి న‌మోదు అయింది. రెవెన్యూ, ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక శాఖ‌ల్లో సుమారు 22శాతంకు అవినీతి పెరిగిందని సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఆనాడు రివ్యూ మీటింగ్ ల్లో తేల్చారు. సేమ్ అటూ సేమ్ తెలంగాణ‌లోనూ భారీగా జీతాలు తీసుకుంటూ అవినీతిని పెంచి పోషించారు.

ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌ను బెదిరిస్తూ

`త‌లుచుకుంటే ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొడ‌తాం..` అంటూ హెచ్చ‌రించే స్థాయికి ఉద్యోగులు(Employees) వ‌చ్చారు. ప్ర‌భుత్వంలోని పెద్ద‌ల‌ను బెదిరిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు పీఆర్సీల‌ను వేయించుకుంటున్నారు. వాస్త‌వంగా పీఆర్సీ(PRC) అంటే జీతాల‌ను పెంచ‌మ‌ని ఎక్క‌డా లేదు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తగ్గించే వెసుల‌బాటు కూడా పీఆర్సీ (PRC)మార్గ‌ద‌ర్శ‌కాల్లో ఉంది. మాన‌వాభివృద్ధి సూచిక‌ను బేస్ చేసుకుంటే, జీతాల‌ను భారీగా త‌గ్గించాలని ఆర్థిక‌వేత్త‌లు చెబుతున్నారు. కానీ, దాన్ని ఏనాడూ పీఆర్సీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోదు. పైగా జీత, భ‌త్యాల‌, డీఏల‌కు సంబంధించిన పెంపు మాత్ర‌మే చూపిస్తుంటారు. పీఆర్సీ(PRC) ఇచ్చిన సిఫార్సును గుడ్డిగా అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వ పెద్ద‌లు ఏ మాత్రం వెనుకాడడంలేదు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు భారం ప‌డుతూనే ఉంది.

మాన‌వాభివృద్ధి సూచిక ప‌ట్టీని గ‌మ‌నిస్తే

మాన‌వాభివృద్ధి సూచిక ప‌ట్టీని గ‌మ‌నిస్తే పాకిస్తాన్ కంటే భార‌త్ వెన‌క‌బ‌డింది. అంటే, ఆర్థిక అంత‌రం పాకిస్తాన్ కంటే భార‌త్ లో ఎక్కువ‌గా ఉంద‌ని అర్థం. పేద‌, ధ‌నికుల మ‌ధ్య అంత‌రం నానాటికీ పెరిగిపోతోంది. ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ధ‌న‌వంతుల సంఖ్య గ‌త రెండేళ్లుగా పెరిగిపోతోంది. పేద‌లు మ‌రింత పేద‌లుగా ధ‌నికులు మ‌రింత ధ‌నికులుగా మారిపోతున్నారు. ఫ‌లితంగా భార‌త మాన‌వాభివృద్ధి సూచిక ప‌ట్టీలో ఏపీ8, తెలంగాణ 11వ స్థానంలో ఉన్న‌ట్టు ఇటీవ‌ల విడుద‌ల చేసిన నివేదిక‌లోని సారాంశం. ఇలాంటి విలువైన స‌మాచారాన్ని ఏ మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఉద్యోగుల‌కు భారీగా జీతాలు పెంచుతూ ఎన్నిక‌ల ప‌బ్బాన్ని గ‌డుపుతున్నారు.

ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న కొద్దీ ఉద్యోగులు కూడా పీఆర్సీ డిమాండ్ ను ముందుకు తీసుకురావ‌డం ఆన‌వాయితీగామారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వమూ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల పీఆర్సీని కాద‌న‌లేదు. కానీ, భారత ప్ర‌భుత్వం సాహ‌సోపేతంగా క‌రోనా ప్రభావాన్ని చూపుతూ గ‌త రెండేళ్ల డీఏ(DA)ల‌ను ఇవ్వ‌లేమ‌ని చెప్పింది. క‌నీసం ఇప్ప‌టికైనా ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ధైర్యం చేసి మాన‌వాభివృద్ధి సూచిక‌ను బేస్ చేసుకుని జీతాల‌ను స‌రిచేయాల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే, మ‌రో శ్రీలంక మాదిరిగా ఏపీ, తెలంగాణను భ‌విష్య‌త్ లో చూస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

AP PRC : ఉద్యోగుల అల్టిమేటం! జ‌గ‌న్ మార్క్ `సంక్రాంతి` సినిమా!