Padma Awards : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.

కర్ణాటకకు చెందిన తులసి 40 వేల వృక్షాలతో ఒక అడవినే సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన సేవకు కేంద్రం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.

కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడ హలక్కీ అనే గిరిజన తెగలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. దీంతో పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలీకి వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమవడంతో తులసీకి చదవడం, రాయడం రాదు. 10-12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో జరిగిన సంఘటనల నుండి సేద తీరడానికి నిత్యం దగ్గర్లోని అడవిలో గడిపేదట తులసి. అక్కడి చెట్లు తనకి ఓదార్పుని, ఆనందాన్ని ఇచ్చేవని అలా చెట్లతో బంధం ఏర్పడిందట.

చిన్నప్పటి నుండి మొక్కలు నాటి, వాటిని కాపాడే అలవాటున్న తులసిని చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. ఆమె అంకితభావం చూసి కొన్నాళ్లకు ఆమెను శాశ్వత ఉద్యోగిగా నియమించారు. ఇలా పద్నాలుగేళ్ల పాటు అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే మొక్కల పెంపకాన్ని మాత్రం ఆపలేదు. అరవై ఏళ్లలో తులసి నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని పెంచారు.

Also Read : విప్ల‌వం నీడ‌న `గోండుల‌` వ్య‌ధ‌

తులసి చదువుకోలేదు గానీ ఆమెకు చెట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసు. ఎప్పుడు నాటాలి, ఎన్ని నీళ్లు పోయాలి, దాని జీవితకాలం ఎంత? వాటిలోని ఔషధ గుణాలు ఏంటనే విషయాలు తులసి అవలీలగా చెప్పగలదు. శాస్త్రవేత్తలు కూడా అబ్బురపడేంత వృక్ష విజ్ఞానం ఆమె సొంతం. అందుకే పర్యావరణవేత్తలు ఆమెను ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌’ అని పిలుస్తారు. కానీ ఆమె ఊరి వాళ్లు మాత్రం ఆమెను వనదేవతగా కొలుస్తారు. ఆమెను చూడటానికే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అరుదైన వృక్షాల జాతుల గురించి తెలుసుకొని పోతుంటారు.

76ఏళ్ల వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను డబ్బులన్నింటినీ దీనికే ఖర్చు చేస్తున్నారు. మొక్కలు నాటగానే సరిపోదు. వాటిని కాపాడినప్పుడే నాటిన దానికి అర్ధముంటుందని చెప్తోంది తులసి.