Site icon HashtagU Telugu

Madhya Pradesh Polling Results : బిజెపికి కీలకమైన మధ్యప్రదేశ్ ఏ తీర్పు ఇవ్వనుంది..?

Mp Polls

Mp Polls

డా. ప్రసాదమూర్తి

ముఖ్యమైన రెండు రాష్ట్రాలు- చత్తీస్ గఢ్ (Chhattisgarh), మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లలో పోలింగ్ (Madhya Pradesh Polling) దశ ముగిసింది. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ (Congress), మధ్యప్రదేశ్ లో బిజెపి (BJP) అధికారంలో ఉన్నాయి. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ విజయం తథ్యమని సర్వే సంస్థలన్నీ ముక్తకంఠంతో చెప్పాయి. దానిమీద ఆశలు వదులుకున్న బిజెపి నాయకులు, ఎంపీలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆఖరి నిమిషం వరకు అన్ని ప్రయత్నాలూ చేశారు. డిసెంబర్ 3న గాని ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో అర్థం కాదు. అయితే మధ్యప్రదేశ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాత్రం గుర్తు చేసుకోవాలి. 71% పైగా మధ్యప్రదేశ్లో ఓటింగ్ నమోదయింది. ఎంపీలో గత 18 సంవత్సరాలుగా శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బిజెపి పాలన సాగిస్తుంది. 2018లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, ఆ ప్రభుత్వాన్ని అనతి కాలంలోనే కూల్చివేసి తిరిగి బిజెపి అధికార పగ్గాలు చేపట్టింది. అయితే ఈసారి ఎంపీలో బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న.

పీపుల్స్ పల్స్ చేసిన సర్వే (Peoples Pulse Survey ) ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని తేలింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా హోం మంత్రి అమిత్ షా తో సహా హేమాహేమీలు అందరూ మధ్యప్రదేశ్లో ఉధృతంగా ప్రచారం చేశారు. కానీ ఈ ఎన్నికల్లో గమనించాల్సిన విషయం ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రచారంలో డమ్మీగా మిగిలిపోవడం. ఆయన ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని బిజెపి అధిష్టానం గమనించింది. అందుకే మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం సస్పెన్స్ లోనే ఉంచింది.

అంతేకాదు మధ్యప్రదేశ్లో అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తూ శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) అభ్యర్థిత్వాన్ని మూడో జాబితా వరకు పెండింగ్ లో పెట్టి ఉంచింది. ఇది కూడా చౌహాన్ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం ఎలా ఆలోచిస్తుందో చెప్తోంది. ఇంతే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ (Modi) ప్రచార సభల్లో తన పక్కనే కూర్చున్న చౌహాన్ పేరును ఎక్కడా ఒక్కసారి కూడా ప్రసంగంలో ప్రస్తావించలేదు.

బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీ:

చాలా త్వరలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ దశలో ఇప్పటికే చేతిలో ఉన్న కర్ణాటక జారిపోయింది. ఇక ఎంపీ కూడా తమ చేతుల నుండి జారిపోతే అది ప్రతిపక్షాలకు గొప్ప అవకాశంగానే మారుతుందని బిజెపి నాయకత్వం భయపడుతోంది. అందుకే మధ్యప్రదేశ్ మీద అగ్ర నాయకులందరూ కేంద్రీకరించారు. మధ్యప్రదేశ్ ను బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యరంగానికి ఒక మౌలిక ప్రయోగశాలగా అద్వానీ తన జ్ఞాపకాలలో వర్ణించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం గుర్తు చేసుకోవాలి. అందుకే బిజెపి నాయకత్వం మధ్యప్రదేశ్ మీద అంత గట్టిగా పట్టుదలగా ప్రచార రంగంలోకి దూకింది.

We’re now on WhatsApp. Click to Join.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చౌహన్ ప్రభుత్వం కూడగట్టిన అపకీర్తి నుంచి బయటపడి, పార్టీని గెలుపు దిశగా నడిపించడానికి బిజెపి కేంద్ర నాయకత్వం ఎంపీలను, కేంద్ర మంత్రులను ఎన్నికలలో అభ్యర్థులుగా నిలబెట్టింది. ఎంపీలు రాజేష్ సింగ్, గణేష్ సింగ్, రీతి పాఠక్, ఉదయ ప్రతాప్ సింగ్ ఎన్నికల బరిలో ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గాన్ సింగ్ కూడా బరిలో దిగారు. చౌహాన్ నేతృత్వంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం సాధ్యం కాదని బిజెపికి అర్థమైపోయింది. అందుకే ఈ విధంగా ఎంపీలను, కేంద్ర మంత్రులను రంగంలోకి దింపినట్టు ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శ కూడా చేస్తోంది. అంతేకాదు చివరి ప్రయత్నంగా మధ్యప్రదేశ్లో బిజెపి హిందుత్వ కార్డును కూడా ప్రయోగించింది.

ఒకపక్క కాంగ్రెస్ పార్టీ 50% సర్కార్ అంటూ చౌహాన్ ప్రభుత్వాన్ని బజారున నిలబెట్టే దాడి మొదలు పెట్టింది. అంటే రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ప్రభుత్వానికి 50 శాతం లంచం సమర్పించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రచారం. కర్ణాటక ఎన్నికలలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని 40% సర్కార్ అని కాంగ్రెస్ చేసిన ప్రచారం మనం గుర్తుంచుకోవాలి. అది మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్కు అనుకూలంగా మారే అవకాశం ఉందని బిజెపి గమనించింది. ఈ మొత్తం ప్రమాదం నుంచి బయట పడాలంటే బిజెపికి హిందుత్వ కార్డు తప్ప మరొక మార్గం కనిపించలేదు.

అందుకే అమిత్ షా మాటిమాటికి మధ్యప్రదేశ్ సభల్లో రామ మందిరం గురించి ప్రస్తావించారు. కర్ణాటకలో కూడా హిందుత్వ కార్డును ప్రయోగించినా, అక్కడ ఫలితం దక్కలేదు. మధ్యప్రదేశ్లో కూడా ప్రజలు రామ మందిరం మాటకు తమ మనో మందిరాల్లో చోటిస్తారని చెప్పలేం. మధ్యప్రదేశ్లో ప్రజలు సమస్యల పైనే ఎక్కువగా స్పందించవచ్చని, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేయవచ్చని సర్వేల ద్వారా అర్థమవుతుంది. దీనికి తోడు అధికార బిజెపిలో మూడు నాలుగు గ్రూపులు తమలో తాము కొట్టుకుంటున్న వాతావరణం కూడా ఉంది. ఈ మొత్తం నేపద్యంలో మధ్యప్రదేశ్లో ఈసారి బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం చాలా కష్టమే అనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏమైనా మూడో తేదీ మరి ఎంతో దూరంలో లేదు. చూడాలి ఎంపీ ప్రజల మదిలో ఏముందో.

Read Also : TV9 Rajinikanth : స్ట్రైట్ టు ద పాయింట్