Modi Letter : జైల్లోని `ఐపీఎస్` కు ఓ `ఐఏఎస్` లేఖ‌, సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మీద `హర్ష్ మందర్ `(తెలుగు: ఎన్ వేణుగోపాల్)పేరుతో ఒక ఆర్టిక‌ల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - October 6, 2022 / 12:41 PM IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మీద `హర్ష్ మందర్ `(తెలుగు: ఎన్ వేణుగోపాల్)పేరుతో ఒక ఆర్టిక‌ల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌త్యేకించి తెలుగుదేశం గ్రూపుల్లో ఈ ఆర్డిక‌ల్ చ‌క్క‌ర్లు కొట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఆ క‌థ‌నం య‌థాత‌దంగా ఇలా ఉంది.

`మోడీ నిజస్వరూపాన్ని బయట పెట్టిన IPS అధికారి సంజీవ్ భట్ఇప్పుడు జైల్లో ఉన్నాడు. రాణా అయ్యుబ్ అనే మహిళా జర్నలిస్ట్ స్టింగ్ ఆపరేషన్ లో గుజరాత్ అల్లర్ల వెనక ఉన్న గుట్టును రట్టు చేసింది. ఆమె చేసిన సాహసంపై “గుజరాత్ ఫైల్స్” అనే బుక్ వచ్చింది. ఇది దేశంలో పెద్దసంచలనం సృష్టించింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోడీని “మౌత్ కా సౌదఘర్” అని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెసు వృద్ధజంబుకాలు సోనియా గాంధీకి అడ్డుపడి అలా అయితే మోడీకి హిందూ ఓటు బ్యాంకు పోలారైజ్ అయి బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని wrong advice ఇచ్చారు. అదే కాంగ్రెస్ పతనానికి కారణం అయ్యింది.
నిజానికి గట్టి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మెతకవైఖరి అవలంభించకుండా గట్టి విచారణ చేసి చర్యలు తీసుకుని ఉంటే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రధాని మోడీ జైల్లో ఊచలు లెక్కపెట్టేవాడు. దేశానికి ఈ దుర్గతి పట్టేది కాదు. దేశఆర్థిక పరిస్థితి దిగజారేది కాదు. లక్షలమంది ప్రజల ప్రాణాలు పోయేవి కావు.`

* IAS అధికారి లేఖను మీరు ఓపికతో చదవండి
ఐ.ఏ.ఎస్ హర్ష మందిర్ ఐ.పీ.ఎస్ సంజీవ్ భట్ కు లేఖ.

👉గుజరాత్ మారణకాండలో నరేంద్ర మోడీ హస్తం సాక్ష్యాధారాలు బైటపెట్టాడన్న కోపంతో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ భట్ ను ఒక పాత కేసులో ఇరికించి ముప్పై సంవత్సరాల శిక్ష వేసిన సందర్భంలో హర్ష్ మందర్ రాసిన లేఖ (వీక్షణం జూలై 2019 సంచిక నుంచి)

ప్రియమైన సంజీవ్,

✍️ఈ ఉత్తరం నీకందుతుందా, అందినా ఎప్పుడు అందుతుంది, నువ్విది చదవగలవా నాకు తెలియదు. ఈసారి నిన్ను జైలులో కలవడానికి వచ్చినప్పుడు కృతనిశ్చయురాలైన నీ సహచరి శ్వేతా భట్ ఈ ఉత్తరం ప్రతిని నీకు తెచ్చి ఇవ్వవచ్చు. కాని ఇప్పుడైతే ఆమె ఎంతో పోరాడవలసి ఉంది, ఎంతో సంభాళించుకోవలసి ఉంది. నా ఉత్తరం అనే చిన్న విషయం ఆమె మరిచిపోవచ్చు కూడా.

✍️మొత్తానికి నీకీ ఉత్తరం చేరినప్పుడు, జామ్ నగర్ జిల్లాలోని ఆ కష్టభరితమైన జైలు బారక్ లో ఒంటరితనంలో నువ్విది ఎలా చదువుకుంటావా అని ఊహిస్తుంటేనే నాకు బాధగా ఉంది. సివిల్ సర్వీస్ అధికారిగా నేను దేశంలోని ఎన్నో జైళ్ల లోపల ఎలా ఉంటుందో చూశాను. అది నీకు ఎంత కష్టంగా ఉండి ఉంటుందో నేనూహించగలను. రోజు వెంట రోజు అదే అదే విసుగెత్తించే ఒకే రకమైన జీవితం, కటిక నేల మీద పడక, కంపు కొట్టే ఉమ్మడి పాయిఖానా, మండుటెండల వేడి నుంచీ, ఈగల నుంచీ, దోమల నుంచీ రక్షణ లేని పరిసరాలు.

✍️ఇప్పటికే నువ్వు తొమ్మిది నెలలు జైలులో గడిపావు. ఆ కాలం ఎంత ఇబ్బందికరమైనదైనా అప్పుడు నీకు ఒక ఆశ ఉండి ఉంటుంది. ఏదో ఒక కోర్టు – అది జిల్లా సెషన్స్ కోర్టు గాని, లేదా అహ్మదాబాద్ లో, ఢిల్లీలో ఉన్న అత్యున్నత కోర్టులలో ఏదో ఒకటి గాని – న్యాయం చేస్తుందని ఆశ ఉండి ఉంటుంది.
అందుకు బదులుగా, జామ్ నగర్ జిల్లా సెషన్స్ కోర్టు నీకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించడం గొడ్డలిపెట్టులా తోచి ఉండవచ్చు. అయితే నువ్వు ధైర్యం, స్థిరనిశ్చయం నిండిన యోధుడివని నాకు తెలుసు. నువ్వు న్యాయం కోసం, నీ అమాయకత్వాన్ని రుజువు చేసుకోవడం కోసం, ఒకానొక రోజున స్వేచ్ఛగా విడుదల కావడం కోసం పోరాడుతూనే ఉంటావు.

✍️ఇబ్బందికరమైన, హింసాత్మకమైన నీ చెరసాల కొట్టులో ఏకాకిగా ఒంటరి క్షణాలు అనుభవిస్తున్న నీకు నేనొకటి చెప్పదలచాను. జీవితంలోకెల్లా కఠినమైన పోరాటాన్ని నువ్వు సాగిస్తున్నప్పుడు దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఎందరెందరో నీతోనే ఉన్నారు, నీకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాకు నువ్వు అమాయకుడివనే విశ్వాసం ఉంది. ఈ దేశంలోకెల్లా శక్తిమంతుడైన మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే అపూర్వ సాహసం ప్రదర్శించినందుకు మాత్రమే నీ మీద ఈ వేధింపు జరుగుతున్నదని మాకు తెలుసు. 2002లో జరిగిన, స్వతంత్ర భారత చరిత్రలోకెల్లా అత్యంత దారుణమైన, క్రూరమైన మారణకాండలో ఆ మనిషి పాత్ర ఉన్నదనే నిజాన్ని నువ్వు స్థాపించదలచావు గనుకనే ఈ వేధింపు.

✍️నీకు ఇప్పుడు జరుగుతున్నదంతా, ఆ మనిషికీ, దేశంలో ఇప్పుడు అత్యంత శక్తిమంతుడైన రెండో మనిషికీ ఉన్న మితిమీరిన అహంకారపు పర్యవసానమేనని తేటతెల్లమవుతున్నది. ఒక సాహసికుడైన, మడమ తిప్పని యోధుడి మీద చౌకబారు ప్రతీకారం తీసుకోవడానికి వాళ్లు రాజ్యాధికారాన్ని దారుణంగా వాడుకుంటున్నారు. దేశంలో నీలా జాగరూకుడైన కాపలాదారుగా ఉన్న మరొకరు నాకు గుర్తు రావడం లేదు. అత్యున్నత అధికారాన్ని ఆక్రమించినవారికి వ్యతిరేకంగా గొంతెత్తిన కాపలాదారుగా ఒక సీనియర్ అధికారి ఉన్న ఉదాహరణ లేదు. అలాగే రానున్న మూడు దశాబ్దాలు జైలులో గడపాలని నీ వంటి శిక్ష పొందిన అధికారి ఉదాహరణ కూడ లేదు.

✍️నీకు ఇటువంటి శిక్ష విధించడం దేశంలో న్యాయవ్యవస్థ నిర్మాణాలు తమ సమగ్రతనూ, స్వాతంత్ర్యాన్నీ కోల్పోయి, కుప్పకూలిపోయాయనడానికి దర్పణం. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, అధికారిక మానవహక్కుల సంస్థలు అన్నీ ధ్వంసమయ్యాయి. చివరికి ఖాకీ దుస్తులలో ఉన్న నీ సోదరులు, సోదరీమణులు కూడ నీ శిక్ష తర్వాత మౌనం వహించి నిన్ను వదిలేశారు.

✍️ఈ శిక్ష మీద ప్రచారసాధనాలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత, విమర్శ రాలేదంటే రాజ్యాధికారాన్ని ఇంత బహిరంగంగా, ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తుంటే ప్రచారసాధనాలు ఆగ్రహంతో నిరసన వ్యక్తీకరించడానికి సిద్ధంగా లేవని అర్థం.
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) తో సహా రాజ్య వ్యవస్థలన్నిటి విధ్వంసం కూడ నీ శిక్ష సందర్భంలో మరొకసారి ఘోరంగా బైటపడింది. సివిల్ సర్వీస్ అధికారుల స్వాతంత్ర్యాన్ని రక్షించడానికి రాజ్యాంగం 315 అధికరణం ప్రకారం ఏర్పడిన యుపిఎస్ సి 2015లో నిన్ను సర్వీస్ నుంచి తొలగించినప్పుడు పిరికిగా మౌనం వహించింది. అప్పుడు స్క్రోల్ లో రాసిన వ్యాసంలో నేను నా అసంతృప్తిని వ్యక్తం చేశాను. నిన్ను తొలగించడానికి వారు చూపినది నువ్వు కొద్ది రోజుల పాటు అనధికారికంగా సెలవు తీసుకున్నావనే అతి స్వల్ప కారణం.

✍️కాని ఒక అధికారిని తొలగించడమనే శిక్ష అత్యంత తీవ్రమైన పాలనా చర్య. అది అరుదైనవాటిలోకెల్లా అరుదైన సందర్భంలోనే తీసుకోవాలి. ప్రభుత్వాధికారులు అతి తీవ్రమైన నేరాలు చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. కాని యుపిఎస్ సి ఆ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నీకు నీ వాదన వినిపించుకోవడానికి కూడ అవకాశం ఇవ్వలేదు. నాకు తెలిసి ఎందరో ఐ ఎ ఎస్ అధికారులు చెప్పాపెట్టకుండా సంవత్సరాల తరబడి అనధికారిక సెలవులు తీసుకున్నారు. ఆ సమయంలో విదేశాలలోనో, ప్రైవేట్ కంపెనీలలోనో ఉద్యోగాలు కూడ చేశారు. కాని వారి మీద, తొలగింపు కాదు సరిగదా, కనీస చర్యలు కూడ తీసుకోలేదని నేనా వ్యాసంలో రాశాను.

✍️నీ సెలవు అనధికారికమైనది కాదని నువ్వు ఖండించావు గాని, ఒకవేళ అది అనధికారికమైనదే అనుకున్నా, ‘అటువంటి అనుచిత ప్రవర్తనకు సకారణమైన, ఉచితమైన శిక్ష ఒక లిఖితపూర్వక అసంతృప్తి ప్రకటనా లేఖతోనో, జీతం లేని సెలవుగా పరిగణించడంతోనో సరిపోయి ఉండేది’ అని నేనప్పుడు రాశాను.
దేశంలో అత్యున్నత అధికారంలో ఉన్నవారు నువ్వు ఎట్లాగైనా ఉద్యోగం నుంచి తొలగించబడాలని అంతగా ఎందుకు కోరుకున్నారనే చిక్కుముడి ఆ ‘అనధికార సెలవు’ రోజుల్లో నువ్వు ఏం చేశావనేది చూస్తే సులభంగా విడిపోతుంది. ఆ రోజుల్లో నువ్వు, ఇండియన్ పోలీస్ సర్వీస్ కు చెందిన గుజరాత్ కాడర్ అధికారిగా, ధైర్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నావు. మోడీకి జనహననపు మారణకాండతో సంబంధం ఉన్నదని చూపుతున్నావు.

✍️నువ్వు ఆ సాక్ష్యాన్ని సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ముందు, సుప్రీం కోర్టుకు సహాయకుడుగా వ్యవహరిస్తున్న రాజు రామచంద్రన్ ముందు ఇచ్చావు (ఆ తర్వాత ఆ సాక్ష్యమే లిఖితపూర్వక అఫిడవిట్ గా సుప్రీం కోర్టుకు చేరింది). వారు అప్పుడు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఆరోపణలపై విచారిస్తున్నారు. ఎహ్సాన్ జాఫ్రీని, ఆయనతో పాటు మరొక 70 మందిని అహ్మదాబాద్ లో గుల్బర్గ్ సొసైటీలో, 2002లో అత్యంత దారుణంగా చంపారు. ప్రాణాలనూ ఆస్తులనూ కాపాడడంలో “ఉద్దేశపూర్వకంగానే, తెలిసితెలిసీ వైఫల్యం చెందారు” అనే కారణంతో నరేంద్ర మోడీ ఈ హత్యాకాండలో మొదటి ముద్దాయి అని ఆమె ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ తన రాజ్యాంగబద్ధ విధులను నిర్వహించడంలో విఫలమయ్యారని ఆమె అన్నారు.

✍️నిన్ను ఉద్యోగం నుంచి తొలగించడం అసాధారణమూ దిగ్భ్రాంతికరమూ. కాని ఇక అంతకంటె దారుణం చేయలేరని మేమప్పుడు అనుకున్నాం. ఇంకా దారుణాలు రానున్నాయని అప్పుడు మేం ఊహించలేకపోయాం. నిన్ను జీవితాంతం జైలులో గడిపేలా చేసేదాకా వాళ్ల పగ చల్లారదని మేం ఊహించలేకపోయాం.
స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత కీలకమైన మతోన్మాద హింసా మారణకాండ నేరానికి సంబంధించిన కేసులో నీ సాక్ష్యం ఎంత బలమైనదో, నేరస్తులను ఎంత భయపెడుతున్నదో నీకు వేసిన శిక్షే చెప్పకనే చెపుతున్నది. నువ్వు వెల్లడించిన సాక్ష్యాధారాలు ఎంతో ప్రమాదకరమైనవి. ఈ శిక్ష నీ ఒక్కడికి మాత్రమే హెచ్చరిక కాదు, ఈ దేశంలో శక్తిమంతులైన మనుషులకు ఎదురుచెప్పే సాహసం చేసేవాళ్లందరికీ ఇది ఒక హెచ్చరిక. ఒక సీనియర్ పోలీస్ అధికారికే ఈ గతి పడితే, ఒక సాధారణ పౌరుడికి ఏం రక్షణ ఉంటుంది?

✍️2002 ఫిబ్రవరి 27 రాత్రి పొద్దుపోయిన తర్వాత మోడీ నేతృత్వంలో జరిగిన అత్యంత వివాదాస్పద సమావేశంలో నీతోపాటు ఇతర పోలీసు అధికారులు కూడ పాల్గొన్నారు. కాని వాళ్లందరూ ఆ సమావేశానికి హాజరైనట్టు గుర్తు లేదన్నారు. లేదా, ఆ సమావేశంలో నువ్వు చెపుతున్నట్టుగా మోడీ ఆదేశాలు ఇచ్చిన సంగతి గుర్తు లేదన్నారు. లేదా ఆ సమావేశంలో నువ్వు ఉన్నట్టు గుర్తు లేదన్నారు. కాని నీ డ్రైవర్ చెప్పిన ప్రకారం, ఆ సమావేశానికి వెళ్లడానికి ముందు నీతో ఉన్న బిబిసి విలేఖరి చెప్పిన ప్రకారం నువ్వు ఆ సమావేశంలో పాల్గొన్నావన్నది నిస్సందేహం.

✍️ఆ సమావేశంలో అధికారులకు మోడీ ఇచ్చిన ఆదేశాల గురించి బైటపెడితే విస్ఫోటనం సంభవిస్తుందని నీకు తెలుసు.

✍️అయినా నువ్వు మాట్లాడదలచుకున్నావు. నువ్వు ఆ మాట అనడానికి, ఆ మాటకు కట్టుబడి ఉండడానికి హెచ్చుస్థాయిలో ధైర్యం కూడగట్టుకోవలసి ఉండింది. “హిందువులలో తీవ్రమైన భావోద్వేగాలున్నాయని, అందువల్ల వారు తమ కోపం తీర్చుకోవడానికి అనుమతించడమే ఉచితమ”ని ఆ సమావేశంలో మోడీ అన్నాడని నువ్వు సిట్ ముందు, సుప్రీం కోర్టు ముందు చెప్పావు. ఈ ‘హిందూ ఆగ్రహం’ అనబడేది సకారణమైన ప్రతిస్పందన అని మోడీ అప్పుడే తన బహిరంగ ప్రకటనల్లో కూడ అని ఉన్నాడు. అయోధ్యలో రామాలయ నిర్మాణంలో సహకరించడానికి వెళ్లి తిరిగివస్తూ రైలు బోగీలో గోధ్రాలో 58 మంది తగులబడిపోవడానికి ప్రతిస్పందన అది అని ఆయన అన్నాడు.

✍️ఆనాటి సమావేశంలో “ఎంతో కాలంగా గుజరాత్ లో మతకల్లోలాలతో వ్యవహరించేటప్పుడు గుజరాత్ పోలీసులు హిందువులకూ ముస్లింలకూ మధ్య సమతౌల్యం పాటించాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నారని, ప్రస్తుతం మాత్రం ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ముస్లింలకు గుణపాఠం చెప్పవలసిందే”నని అక్కడివారిని ముఖ్యమంత్రి మోడీ ఉద్బోధించాడని నువ్వు సుప్రీంకోర్టు ముందు చెప్పావు. నీ ఆరోపణలను అంగీకరిస్తే, మోడీ మీద అతి తీవ్రమైన నేరారోపణలు చేయవలసి వచ్చేది. దేశంలో అత్యున్నత అధికార పీఠానికి అధిరోహించకుండా అది ఆటంకమయ్యేది.

✍️సిట్ లో ఉన్న నీ సహోద్యోగులు, ఐపిఎస్ అధికారులు, నీ ఆరోపణలను పూర్తిగా కొట్టివేశారు. నిన్ను అవిశ్వసనీయ సాక్షిగా ప్రకటించారు. అసలు ఆ సమావేశంలో నువ్వు పాల్గొననే లేదన్నారు. కాని, సుప్రీం కోర్టు సహాయకుడిగా పనిచేసిన రాజు రామచంద్రన్ నీ ఆరోపణలను సిట్ తోసివేయడాన్ని అంగీకరించలేదు. నువ్వు ఆ సమావేశంలో పాల్గొన్నావా లేదా అనేది నిజానికి న్యాయస్థానంలో తేల్చాలని, సమావేశంలో పాల్గొన్నామని చెప్పిన కొందరు అధికారుల సాక్ష్యాన్నికూడ సిట్ తోసిపుచ్చింది గనుక, నీ ఆరోపణలను కూడ పూర్తిగా కొట్టివేయడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని అన్నారు. నీ మాటలను ఒక న్యాయస్థానంలో పరీక్షకు గురి చేయవలసిందేనని ఆయన అన్నారు. ఆయన సూచనను అంగీకరించి, నీ సాక్ష్యాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి ఉంటే భారత చరిత్రే మరొక రకంగా ఉండేది. నీ జీవితం కూడ మరొక రకంగా ఉండేది.

✍️సిట్ కు అధినేతగా ఉండిన అధికారి ఆ తర్వాత మోడీ ప్రధానమంత్రిగా ఉండగానే ఒక అసాధారణ, గౌరవనీయ పదవికి ఎంపిక కావడం యాదృచ్చికం కావడానికి వీలు లేదు. ఆ పోలీసు అధికారికి పదవీ విరమణ తర్వాత విదేశంలో రాయబారి పదవి దక్కింది. మరొక పక్క నువ్వు యావజ్జీవితం జైలు శిక్షకు గురి చేయబడ్డావు.

✍️దేశంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన మనుషులు నీ మీద కోపం పెట్టుకోవడానికి తగిన కారణం ఉంది. కాని భారత రాజ్యాంగ సంస్థలు తమను తాము బలహీన పరచుకుని, ఆ వ్యక్తుల చౌకబారు ప్రతీకారవాంఛకు, రాజ్యాధికార దుర్వినియోగానికి వంతపాడి ఉండవలసింది కాదు.

✍️ఇవాళ నీకు మద్దతుగా మాట్లాడుతున్నప్పుడు కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు, కస్టడీలో ఒక వ్యక్తి మరణించడానికి నీకు సంబంధం ఉన్నదని న్యాయస్థానం నిర్ధారించిన తర్వాత, నిన్ను నేనెట్లా సమర్థిస్తానని వాళ్లు అడుగుతున్నారు.
నేను సివిల్ సర్వీస్ అధికారిగా ఉన్నప్పుడూ, అది అయిపోయి బైట ఉన్నప్పుడూ కూడ కస్టడీ హింసనూ, చట్టవ్యతిరేక హత్యలనూ గట్టిగా వ్యతిరేకిస్తున్నాను. కాని, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలే గుజరాత్ లో 2001 నుంచి 2016 వరకు 180 కస్టడీ మరణాలు సంభవించాయని, అన్ని మరణాలకుగాను ఒక్కరంటే ఒక్క పోలీసు అధికారికి కూడ శిక్ష పడలేదని తెలుస్తున్నది. కనుక నీ మీద చర్య సక్రమంగా జరిగిందని నేను అంగీకరించలేను.

✍️ఆ కస్టడీ మరణాలన్నీ లేదా కనీసం వాటిలో చాలభాగం దర్యాప్తు జరిగి ఉంటే, ఆ హత్యలకు కారకులైన చాలమంది పోలీసు అధికారులకు శిక్షలు పడి ఉంటే, ఇప్పుడు నీ మీద చర్యను కూడ నేను న్యాయమైనదని సమర్థించి ఉండేవాడిని. కాని, ముప్పై సంవత్సరాల కింద, కస్టడీ నుంచి విడుదల అయిన తొమ్మిది రోజుల తర్వాత మరణించిన ఒక వ్యక్తి విషయంలో నీకూ మరొక అధికారికీ శిక్ష పడడం నేను అంగీకరించలేను.
స్వతంత్ర భారతం చూసిన అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరి మీద, క్షమాగుణం అనేదే తెలియని వ్యక్తి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడంలో నువు చూపిన అద్భుతమైన సాహసానికి నిన్ను అభిమానించే వాళ్లెందరో ఉన్నారని తెలుసుకోవడం జైలులో నీ ఇబ్బందులనూ, వేదననూ ఎంతమాత్రం తగ్గించదు. నీ ముందున్న న్యాయపోరాటం దీర్ఘకాలికమైనదనీ, అనిశ్చితమైనదనీ, ఎన్నెన్నో నిరాశలకూ, హృదయవేదనలకూ దారి తీసేదనీ నీకూ, శ్వేతకూ, నీ పిల్లలకూ తెలిసినట్టుగానే నాకు కూడ తెలుసు.

✍️కాని ధైర్యంగా నిలబడడానికి, తట్టుకోవడానికి, పోరాటం కొనసాగించడానికి, నువ్వు సత్యమనీ న్యాయమనీ విశ్వసించిన వాటికోసం దృఢంగా నిలబడడానికి కావలసిన శక్తీ, సహిష్ణుతా నీకున్నాయని నాకు తెలుసు. అలాగే ఏదో ఒక రోజు నువ్వు స్వేచ్ఛగా బైటికి వస్తావనీ నాకు తెలుసు. శ్వేతతో, పిల్లలతో, మన దేశపు అసంఖ్యాక స్త్రీ పురుషులతో నేను కూడ ఆరోజు కోసం ఎదురుచూస్తున్నాను.

– హర్ష్ మందర్

(తెలుగు: ఎన్ వేణుగోపాల్)