Khalistan Movement : ఖలిస్తాన్ తీవ్రవాదం పేరు మళ్లీ ఎందుకు వినిపిస్తోంది? దీనిచుట్టూ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయా?

పంజాబ్ లో ఈమధ్య ఖలిస్తాన్ మాట వినిపించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో శాసనసభ గేటుకు ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. గోడలపై ఖలిస్తాన్ నినాదాలు కూడా రాసి ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 10:40 AM IST

పంజాబ్ లో ఈమధ్య ఖలిస్తాన్ మాట వినిపించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో శాసనసభ గేటుకు ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. గోడలపై ఖలిస్తాన్ నినాదాలు కూడా రాసి ఉన్నాయి. ఈమధ్యనే ఇద్దరు ఖలిస్తాన్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని పేలుడు పదార్థాలతో సహా అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు ప్రకటించారు. పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసుపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఇంటెలిజెన్స్ ఆఫీసునే టార్గెట్ చేశారంటే మాటలు కాదు. కానీ దీనిపై సీరియస్ యాక్షన్ కు బదులు.. రాజకీయ విమర్శలే ఎక్కువున్నాయి.

ఖలిస్తాన్ వాదానికి ఇప్పుడు పెద్దగా అనుకూలత లేదు. పంజాబ్ రాష్ట్రం కూడా గతంలో ఖలిస్తాన్ తీన్రవాద ప్రమాదాన్ని ఎదుర్కొంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఖలిస్తాన్ తీవ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ పార్టీలు మీరంటే మీరు ఖలిస్తాన్ వాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న వాదనకే పరిమితమవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పంజాబ్ లో క్షేత్రస్థాయిలో ఖలిస్తాన్ వాదానికి మద్దతులేదని. అందుకే దాని గురించి ఆచితూచి మాట్లాడాలని.

విదేశాల్లో ఉన్న సిక్కుల్లో ఖలిస్తాన్ వాదం ఇంకా బలంగా ఉందన్న వాదనుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఖలిస్తాన్ ఘటనకు సంబంధించి రిజిస్టరైన కేసులో కూడా అమెరికా నుంచి పనిచేసే ఖలిస్తాన్ సంస్థ పేరుంది. దీంతో ఈ వాదానికి బలం చేకూరుతోంది. ఇక రాజకీయ నాయకులు కూడా వివిధ సందర్భాల్లో ఖలిస్తాన్ వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కొన్ని సమస్యలు తప్పవన్న సంగతిని అవి
మరిచిపోతున్నాయి.

2017, 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు, ఖలిస్తాన్ వాదానికి మధ్య లింకు పెట్టే ప్రయత్నం చేశాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఆప్ కు విదేశాల్లో ఉన్న సిక్కుల మద్దతుంది. దీంతో ఆ పార్టీకి ఈ సమస్య తప్పలేదు. అయినా ఆప్ అయినా మరే పార్టీ అయినా సరే.. దానికి ఖలిస్తాన్ వాదంతో సంబంధముంటే చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయ విమర్శలు, సంకుచిత రాజకీయ ప్రయోజనాలు మంచివి కావు. సమర్థమైన, చట్టపరమైన చర్యలు మాత్రం ఫలితాన్ని ఇస్తాయని గుర్తుంచుకోవాలి.