Indian Railways : భారతీయ రైల్వేకు పునాది పడింది ఈరోజే..

1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 11:18 AM IST

భారతీయ రైల్వే (Indian Railway)కు పునాది పడి సరిగ్గా నేటికీ 171 ఏళ్లు అవుతుంది. 1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది. 34 కిలోమీటర్ల మేర ఏర్పాటైన ఈ ట్రాక్ ఫై13 బోగీలతో రైలు నడిచేది. సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే మూడు ఇంజిన్లను ఈ రైలును నడిపేందుకు ఉపయోగించారు. 13 బోగీలతో మొదలైన భారతీయ రైలు..నేడు వందే భారత్ అంటూ పరుగులు పెడుతుంది.

మనదేశంలో (India) మొదటిసారిగా 1853 లో రైలును ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు, నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతుంది. ప్రస్తుతం ప్రతి రోజు 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవల్ని అందిస్తోంది. ప్రతీ ఏటా 822 కోట్ల మంది ప్రయాణికులు రైల్వే సేవల్ని అందిస్తూ అతిపెద్ద రికార్డే గా నిలుస్తుంది.

1947 లో స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అధిక శాతం రైలు మార్గాలు కొత్తగా అవతరించిన పాకిస్థాన్ లో ఉండి పోయాయి. దాంతో మిగిలిన నలభై రెండు వేర్వేరు రైలు మార్గాలను (రాజ సంస్థానాల ఆధీనంలో ఉన్న ముప్పై రెండు మార్గాలతో సహా) కలుపుకొని ఏకైక సంస్థ “భారతీయ రైల్వే” అవతరించింది. 1951లో అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రైల్వేలను మార్చి, మొత్తం ఆరు ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో అన్ని రైల్వే కర్మాగారాలు పూర్తిగా దేశీయ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగంలోకి తెచ్చాయి. సం.1985 నాటికి అప్పటి వరకూ వినియోగంలో ఉన్న ఆవిరి యంత్రాలకు బదులుగా డీసెల్, విద్యుత్ యంత్రాలు ప్రవేశించాయి. 1995 నాటికి దేశంలోని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించబడింది.

We’re now on WhatsApp. Click to Join.

భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. దేశ వ్యాప్తంగా 114500 కి.మీ రైలు మార్గాలు ఉన్నాయి. మొత్తం 7500 స్టేషన్లు , రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వే రెండో స్థానంలో ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది.

* భారతీయ రైల్వేలో వివేక్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని దిబ్రుగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి 4273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సుమారు 4 రోజుల పాటు ఈ రైలు ప్రయాణిస్తుంది. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే రైలు ఇదే.

* వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రాకముందు వరకు న్యూ ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలుగా వార్తల్లో ఉండేది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత వందేభారత్ ట్రైన్ గంట కు 160 కిమీ వేగంతో నడుస్తుంది. ఇక ఇటీవల ప్రారంభించిన ట్రెయిన్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

* భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఉంది. ఇక్కడ ప్లాట్‌ఫామ్ పొడవు 1366 మీటర్లు. అంటే ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువే అన్నమాట.

* మనదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు 1925 ఫిబ్రవరి 3న నుండి ముంబై విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ మధ్య నడిచింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ రైల్వే నెట్వర్క్ విస్తరించింది. ఇలా భారత రైల్వే రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది.