Site icon HashtagU Telugu

ISRO – SpaceX : తొలిసారిగా ఇస్రో ప్రయోగానికి ‘స్పేస్ ఎక్స్’ రాకెట్‌.. ఎందుకు ?

Isro Spacex

Isro Spacex

ISRO – SpaceX : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తొలిసారిగా ఒక ప్రయోగం కోసం అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ SpaceX‌‌పై ఆధారపడబోతోంది.  ‘GSAT-20’ అనే పేరు కలిగిన భారీ అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి SpaceX‌కు చెందిన  ‘ఫాల్కన్-9’ హెవీ లిఫ్ట్ లాంచర్‌ను ఉపయోగించబోతోంది. ఈ ప్రయోగం అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో దీన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఇంకా ప్రయోగం డేట్‌ను ఇస్రో నిర్ణయించలేదు.

We’re now on WhatsApp. Click to Join.

4 టన్నులకు మించిన బరువు ఉండే కమ్యూనికేషన్ ఉపగ్రహాలను తీసుకెళ్లగల రాకెట్లు ప్రస్తుతానికి ఇస్రో వద్ద లేవు. GSAT-20 ఉపగ్రహం బరువు 4700 కిలోలు. దీంతో ఈ ప్రయోగం కోసం SpaceX‌‌ కంపెనీకి చెందిన బాహుబలి రాకెట్ ‘ఫాల్కన్-9’ హెవీ లిఫ్ట్ లాంచర్‌‌ను ఇస్రో వాడుకోబోతోంది. ఈ ప్రయోగం కోసం ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్.. అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకుముందు వరకు భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఫ్రాన్స్‌ సారథ్యంలోని ఏరియన్‌ స్పేస్ కన్సార్టియంపై భారత్ ఆధారపడేది. ఇప్పుడు అదే తరహా ప్రయోగం కోసం స్పేస్ ఎక్స్ వైపు భారత్(ISRO – SpaceX) అడుగులు వేయడం గమనార్హం.

చౌకగా ప్రయోగ సేవలు అందిస్తుండటం వల్లే స్పేస్ ఎక్స్‌కు ఇస్రో ప్రయారిటీ ఇచ్చిందని అంటున్నారు. ఇస్రోకు చెందిన బాహుబలి రాకెట్ ‘లాంచ్ వెహికల్ మార్క్ 3’ కేవలం 4000 కిలోల ఉపగ్రహాలను మాత్రమే జియో స్టేషనరీ కక్ష్యలోకి ఎత్తగలదు. రానున్న రోజుల్లో కక్ష్యలోకి 10,000 కిలోగ్రాముల వరకు ఉపగ్రహాలను ఎత్తగలిగే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV) తయారీపై భారత్ ఫోకస్ చేసింది. అయితే ఈ తయారీ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది.