Congress Party : అద్భుతమైన అవకాశం.. హస్తగతం చేసుకుంటుందా?

వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది.

  • Written By:
  • Publish Date - May 17, 2022 / 10:39 AM IST

వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలగడంలోనే ప్రధాన ప్రతిపక్ష విజయం ఆధారపడి ఉంటుంది. నిజానికి కాంగ్రెస్ మళ్లీ
పుంజుకోడానికి దేశవ్యాప్తంగా బోలెడు అంశాలున్నాయి. దేశంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. కాని, వాటిని ఓ ఉద్యమ రూపంలోకి తీసుకురాలేకపోయింది కాంగ్రెస్. నిజానికి పెట్రోల్, డీజిల్,
గ్యాస్ రేట్లు చాలు.. కేంద్రంలో కుర్చీ మార్పు సాధ్యమే. గతంలో ఒక్క ఉల్లిగడ్డ ధరలే ప్రభుత్వాన్ని మార్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దాంతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు సామాన్యుడు
భరించలేనివి. గతంలో రూపాయి పెట్రోల్, పది రూపాయలు గ్యాస్ పెరిగితేనే.. సిలిండర్లు వేసుకుని రోడ్లపైకి వచ్చారు. ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి నిరసన చేశారు బీజేపీ నేతలు. మరి కాంగ్రెస్ అలాంటి
ప్రయత్నం ఒక్కటీ చేయలేదు. ఒక నిరుద్యోగం అంశం కూడా చాలా బలమైనదే. మోదీ సారథ్యంలో దేశంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో నిరుద్యోగం పేరుకుపోయింది. రెండు కోట్ల ఉద్యోగాలు
అన్న మాటే మోదీ ప్రభుత్వం మరిచిపోయింది. పైగా దేశంలో యువ జనాభానే ఎక్కువ. వారిని కదిలించగలిగితే కుర్చీ మార్పు సాధ్యమే. కాని, ఆ పనినీ ఇంత వరకు చేయలేకపోయింది కాంగ్రెస్. నిజానికి కాంగ్రెస్ ఈ పని చేయగలదన్న విషయాన్ని జనం ఎప్పుడో మరిచిపోయారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఒప్పుకున్నట్టు.. కాంగ్రెస్ ఎప్పుడో జనానికి దూరం అయింది. వారికి మళ్లీ దగ్గర కావాలంటే జనంలో రగులుతున్న సమస్యలను బయటకు తీయాల్సిందే. ప్రస్తుతం కాంగ్రెస్ ముందు అద్భుతమైన అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గమనించారు. అందుకే దేశవ్యాప్తంగా పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. నిరుద్యోగం, పెరిగిన ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ఉద్యమిస్తూ.. జనబలం పొందాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.