Agnipath and Protest: అగ్నిపథ్ పై కేంద్రం నెగ్గిందా? తగ్గిందా? అభ్యర్థుల నిరసనల వెనుక అసలు కారణాలేమిటి?

సైన్యంలో సంస్కరణల కోసం కేంద్రం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వచ్చిందే.. అగ్నిపథ్ పథకం.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 12:00 PM IST

సైన్యంలో సంస్కరణల కోసం కేంద్రం చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వచ్చిందే.. అగ్నిపథ్ పథకం. దీని కింద చేరేవారిని అగ్ని వీర్ లు గా పిలుస్తారు. దీనికి పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 ఏళ్ల వయసున్నవారు అర్హులు. దేశవ్యాప్తంగా నిరసనలు పెరగడంతో ఆ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఈ పథకం కింద ఎంపికైన సైనికులు.. నాలుగేళ్ల పాటు సర్వీసులో ఉంటారు. కాంట్రాక్ట్ పద్దతిలోనే వారిని నియమించినా.. ప్రతిభ కనబరిచినవారిని.. మళ్లీ తీసుకుంటారు. కానీ ఇందులో నాలుగింట ఒకవంతు మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో.. ప్రతీ నలుగురిలో ముగ్గురు.. సర్వీసు పూర్తి చేసుకుని నాలుగేళ్లకే బయటకు రావాలి. వీళ్లను ఎక్కువగా ఆర్మీలోకే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వైమానిక, నావిక దళాలకు వీరి సేవలు ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఆ ఉద్యోగాలకు సాంకేతిక సామర్థ్యం కూడా అవసరం.

అగ్నిపథ్ కు ఆదరణ బాగుంటే.. ప్రస్తుత నియామక పద్దతికి చెక్ పెట్టొచ్చు. నిజానికి కార్గిల్ యుద్ధ సమయం నుంచీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడూ కార్యాచరణ మొదలుపెట్టలేదు. 2014లో NDA అధికారంలోకి వచ్చాక ఈ ఆలోచనను అమలు చేయడానికి ట్రై చేసింది. అందుకే 2016లో ఓ కమిటీని కూడా నియమించింది. అలా అగ్నిపథ్ లో ఓ అడుగు పడింది. తొలి విడతలో 46 వేల మందిని సైనికులుగా తయారుచేస్తామని చెప్పింది కేంద్రం.

సాధారణ పద్దతిలో సైనికుల నియామకాలు జరిపితే.. వారికి పెన్షన్లు, జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కేంద్రానికి ఆర్థికంగా భారం. కానీ దేశ రక్షణ దృష్ట్యా ఇది చాలా కీలకం. అవసరం. అందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చింది. దీనివల్ల సైన్యంపై పెట్టే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. ఇందులో ఎంపికైన వారికి కేవలం ఆరు నెలలు మాత్రమే శిక్షణ ఉంటుంది. మిగిలిన మూడున్నరేళ్ల పాటు సర్వీసు ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా తొలి ఏడాది రూ.4.76 లక్షలను ఇస్తారు. ఈ ప్రక్రియను జవాన్లకే పరిమితం.

ఉన్నతాధికారుల నియామకానికి ఇప్పటికే షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది. దీని కింద ఆఫీసర్ క్యాడర్ వాళ్లను నియమించుకుని ఐదేళ్లపాటు సర్వీస్ లో కొనసాగిస్తారు. కానీ ఇందులో కూడా కొద్దిమందికి మాత్రమే పర్మినెంట్ గా సేవ చేసే ఛాన్స్ వస్తుంది. ఇక ఈ ఆఫీసర్ లకు ట్రైనింగ్ కోసం ఏటా ఆరు కోట్లు ఖర్చవుతుందని అంచనా. వీరికి పెన్షన్లు కాని, వైద్యసదుపాయాలు కానీ రావడం లేదు. అలాంటిది ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో మళ్లీ అలాంటి నియామక పద్దతిలోనే రిక్రూట్ మెంట్ లు చేపడుతున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.

నిజానికి ఒక సైనికుడికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలంటే ఐదు నుంచి ఏడేళ్ల సమయం పట్టవచ్చు. అంటే వారికి పూర్తిగా శిక్షణ అంది.. దానిపై అవగాహన వచ్చేనాటికే.. వారి సర్వీసు పూర్తవుతుంది. కానీ చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దుల్లో ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో నాలుగేళ్లపాటు మాత్రమే సర్వీస్ అంటే వాళ్లు విధి నిర్వహణలో ఎంతమేర ధైర్యసాహసాలు చూపిస్తారు అన్న వాదనా ఉంది. కానీ అలా అంటే అది సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసినట్టే అన్న వాదన కూడా ఉంది. కానీ దేశ రక్షణ దృష్ట్యా సుశిక్షితులైన సైనికులు అవసరం అన్నది మర్చిపోకూడదు.

అగ్నిపథ్ లో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీర్ లు మళ్లీ చదువుకోవడానికి వీలుగా.. వారికి 12వ తరగతికి సమానమైన సర్టిఫికెట్ ను కేంద్రం ఇస్తుంది. ఒకవేళ ఉద్యోగమే చేయాలనుకుంటే.. దానికోసం రక్షణ శాఖ, కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో 10 శాతం రిజర్వేషన్ ను కూడా కల్పిస్తామని చెప్పింది కేంద్రం. దీంతోపాటు రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే.. బ్యాంకులు రుణాలు ఇస్తాయంది. ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే.. భవిష్యత్తులో.. సాయుధ బలగాల్లో అగ్నివీర్ ల సంఖ్యే మూడింతలు ఉండొచ్చు.

సాయుధ బలగాల సంఖ్యను మొత్తంగా చూస్తే.. తొలి ఏడాదిలో ఎంపికయ్యే అగ్నివీరులు 3 శాతం మందే ఉంటారని కేంద్రం చెబుతోంది. నాలుగేళ్ల తరువాత మళ్లీ వారికి పరీక్ష ఉంటుంది. అందుకే సైన్యం ఇంకా బలోపేతమవుతుంది అని కేంద్రం చెబుతోంది.